కరివేపాకాంధ్రప్రదేశ్‌

”ఎవడువాడు? ఎచటివాడు?
ఇటువచ్చిన తెలుగువాడు
తరిమి తరిమి కొట్టరా
తగిన శాస్తి చేయరా” అంటూ ‘శాస్త్రీ’యమైన పద్ధతిలో తెలుగు భూభాగంలోకి కూడా చొచ్చుకువచ్చి మరీ మరాఠీ లాఠీ విన్యాసం సాగిస్తుంటే తెలుగువాడు తెల్లమొగం వేస్తున్నాడు. మనస్సూ, శరీరమూ గాయపడి తనకు మైనస్‌ మార్కులు ఎందుకుపడుతున్నాయో తెలియక తికమకపడుతున్నాడు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. అయినా తనకు అడుగడుగునా అవమానమేమిటని తల్ల’ఢిల్లి’పోతున్నాడు. ఏ ఏడాది చూసినా కాంగ్రెస్‌ పంచాంగంలో తెలుగు రాశికి రాజపూజ్యం 0, అవమానం 14 అని ఉంటే తలపట్టుకుంటున్నాడు. మన పాలకులు హరితాంధ్రప్రదేశ్‌ తెస్తామని పదేపదే ఊరిస్తుంటారు. వారు ఏమీ చెప్పకుండానే మనది ‘కరివేపాకాంధ్రప్రదేశ్‌’ అయింది. ‘అవసరం తీరాక అల్లుడు’… అనే సామెతపోయి ‘అవసరం తీరాక ఆంధ్రుడు…’ అన్న కొత్త సామెత వచ్చింది. ఒకప్పుడు, తెలుగు నాయకుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభిసీతారామయ్య కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికోసం పోటీపడి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ చేతిలో ఓడిపోతే, ‘ఇది నా ఓటమి’ అని మహాత్మాగాంధీ అన్నారు. ఒక తెలుగువాడికి గాంధీజీ ఇచ్చిన గౌరవం చూసి, ఆంధ్రులంతా గర్వించారు. కానీ ఆ గాంధీజీ వారసులు (అని చెప్పుకొంటున్న వాళ్లు) అడుగడుగునా తెలుగువాడి గౌరవాన్ని దెబ్బతీస్తుంటే లబలబలాడిపోతున్నారు. తెలుగు నాయకులను ‘చచ్చినా’ వదలకుండా అవమానించడం ఇప్పటి ‘గాంధీ’లకు అలవాటయిపోయింది. ఆమధ్య రాహుల్‌గాంధీ ”మా కుటుంబీకులు ప్రధానమంత్రిగా ఉంటే బాబ్రీ మసీదు కూలిపోయేది కాదం”టూ దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును పరోక్షంగా అవమానించారు. మరి పి.వి. చేసిన పాపం ఏమిటి? రాజీవ్‌గాంధీ మరణానంతరం అనాథగా ఉన్న కాంగ్రెస్‌ను భుజాన వేసుకుని గెలిపించి, దక్షిణాది తొలి ప్రధాని కూడా అయి, అయిదేళ్లపాటు పరిపూర్ణంగా పరిపాలించడమేనా? ఆ మాటకొస్తే తెలుగువాళ్లు చేసిన పాపం ఏమిటి? సీట్ల పంటపండించి ముందు నిలబడి ఢిల్లీ సింహాసనంమీద కాంగ్రెస్‌ను కూర్చోబెట్టడమేనా?

ఏం పాపం చేశారని అలనాటి ముఖ్యమంత్రి అంజయ్య రాజీవ్‌గాంధీ చేతిలో అవమానాల పాలయ్యారు? చిరునవ్వుల ఖజానా అయిన అంజయ్య ముఖం రాజీవ్‌ మాటల కత్తివేటుకు నెత్తుటి చుక్క లేకుండా అయింది? దానికి పర్యవసానంగా తెలుగుల వెండితెరవేల్పు ఎన్‌.టి.రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో రాజకీయాల్లోకి దిగితే ముఖానికి రంగు పూసుకునేవాడు అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎగతాళి చేశారు. అంతెందుకు ‘విభజించు- పాలించు’ అనేది తెల్లదొరల విధానం మాత్రమేకాదు, కాంగ్రెస్‌ దొరల విధానం కూడా. ఇవన్నీ తెలుగువాడి రాజకీయ ప్రయోజనాల వ్యవహారమైతే, ఇతర ప్రయోజనాలూ కాంగ్రెస్‌ ప్రభువుల చేతుల్లో మట్టిగొట్టుకుపోయాయి. ఢిల్లీ జనపథంలో మన నేతల భజన తగ్గడంవల్ల రాష్ట్రం పనులు ఆగిపోతున్నాయా అంటే అదేంలేదు. ‘భజన ఎక్కువ… సృజన తక్కువ’ అన్న పేరు మన నాయకులు సంపాదించుకున్నారు. అందులో మనదే ‘సర్వ’ శిక్షాభినయ్‌! మనదే రికార్డు.

‘మన రాష్ట్ర పాలకులు మంచి వాళ్లయితే మహారాష్ట్ర పాలకులను అనడమెందుకు? అన్న సన్నాయి నొక్కులు ఆదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకు వినిపిస్తున్నాయి. అసలే రాష్ట్రాధిపతులు నోరు తెరిస్తే చాలు ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తాం ఈ ప్రాజెక్టు చేస్తాం అని తమను తాము ప్రొజెక్టు చేసుకుంటుంటారు. మన ఆనకట్టల సంగతి సరే మహారాష్ట్ర, కర్ణాటక అడ్డుకట్టల విషయానికివస్తే ఏదో మొక్కుబడికి తప్ప కట్టుదిట్టమైన ప్రయత్నాలు, కట్టదిట్టమైన ప్రయత్నాలు కంటికి కనిపించవు. ప్రతిపక్షాలు బంద్‌ పిలుపునిస్తే నైతిక మద్దతు అన్నారు తప్ప భౌతిక మద్దతు ఏదీ? ఆంధ్రులు ఆరంభశూరులు అని పేరు. మన పాలకులకు అది వర్తించదు. కనీసం ఆరంభశూరత్వం అయినా కనపడటంలేదు.

మహారాష్ట్ర లోపలికి వెళ్లడానికి మనకు గగనమైపోయింది. వీసాలు తీసుకుని పాకిస్తాన్‌కయినా చకచకా వెళ్లగలుగుతున్నాం గానీ పొరుగు రాష్ట్రంలోకి వెళితే పురుగుల్లా చూస్తారు? నక్సలైట్లు బాంబులు తెచ్చి బాబ్లీ ప్రాజెక్టును పేల్చివేస్తారని మహారాష్ట్ర పత్రికల్లో వచ్చిందట! అందుకని తెలుగువాళ్లను బాబ్లీ దగ్గర అడ్డుకున్నారట! ఒక రకంగా చూస్తే మహారాష్ట్ర పాలకులే నయం! వాళ్లు పత్రికలు చదువుతారు. ఇక్కడి మన పాలకులు పత్రికలు చదవరు. విషయం తెలీదు. అందువల్ల ఏమీచేయలేరు!

‘వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు… ఒక నిర్దోషికి కూడా శిక్షపడకూడదు’ అనేది మన న్యాయసూత్రం. అయితే ”లక్ష జనం ప్రయోజనం దెబ్బతిన్నా పర్వాలేదు. ఒక్క నాయకుడు కూడా దెబ్బతినకూడదన్నది” కాంగ్రెస్‌ న్యాయసూత్రం! ముందు నాయకులు బాగుపడితే సరి! వెర్రిజనానిదేముంది ఎప్పుడయినా ముందుకొస్తారు!! వెనక నడుస్తారు.
(ఈనడులో శంకరనారాయణ వ్యాసం)

ప్రకటనలు

One thought on “కరివేపాకాంధ్రప్రదేశ్‌

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s