వీళ్ళకి కాప్షన్‌ కూడా వేస్టే

“పది లక్షల మంది జనం వచ్చే బహిరంగసభ అంటే మాటలు కాదు … మూటలు కావాలి! అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో చర్చించడానికే మిమ్మల్ని పిలిచాను” అన్నాడు కేసీఆర్‌.

జై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుల సమావేశం జరుగుతోంది. నరేంద్ర, నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, రవీంద్రనాయక్‌ తదితర నాయకులంతా వచ్చారు.
“ఇందులో చర్చించడానికేముందీ? పార్టీ ఫండ్‌ బోలెడంత ఉందిగా … దాన్ని తీద్దాం … ఇంకా కావాలంటే తలా కొంత విరాళాలు వేసుకుందాం” సలహా ఇచ్చాడు నరేంద్ర. మిగతా వాళ్ళు కూడా అవునన్నట్టు తలలాడించారు.
కేసీఆర్‌ కుర్చీలో ్రస్పింగులా ఊగుతూ తల అడ్డంగా తిప్పి అన్నాడు.
“ఇది వేలూ, లక్షలతో అయ్యే పనికాదు. కొన్ని కోట్లు కావాలి. అంత డబ్బు మన దగ్గర లేకకాదు గానీ మనం సొంతంగా ఖర్చుపెడితే … ‘అబ్బో .. వీళ్ళ దగ్గర ఎంత డబ్బుందో’ అని కాంగ్రెస్‌ వాళ్ళు దిష్టి పెట్టేస్తారు .. మన ఫండ్స్‌ పొజిషన్‌ ఎవరికీ తెలియకూడదు.”
“అయితే మరేం చేద్దాం” అడిగారంతా.
“కేసీఆర్‌ అందరి వైపూ చిరునవ్వుతో చూస్తూ చెప్పాడు.

‘ఊరిమీద పడి చందాలు పోగుచేద్దాం … అయితే జనం దగ్గర్నించి కాదు … వాళ్ళేమిస్తారు నా బొంద … అందుకని నాకో ఆలోచన వచ్చింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, దుకాణాల దగ్గర్నించి వసూలు చేద్దాం. ఊరికే కాకుండా, వెరైటీగా వాళ్ళ దగ్గర కూలిపని చేద్దాం.”
“అమ్మో! కూలిపనా? మా వల్ల కాదు … అయినా కూలి పనిచేస్తే మనకి పెట్రోలు ఖర్చు కూడా రాదు” అన్నారంతా.
“నాకామాత్రం తెలీదనుకున్నారా? మనవాళ్ళు ముందే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళివ్వాల్సిన ఎమౌంట్‌ ఫైనల్‌ చేస్తారు. మనం అలా షికారెళ్ళినట్టు వెళ్ళి, సుతారంగా ఏదో పని … జస్ట్‌ అయిదు నిమిషాలు చేసి … మన కూలీ డబ్బులు తీసుకుని … ఫోటోలు దిగి తిరిగొచ్చాస్తామంతే … ఒక్క దెబ్బకి రెండు పిట్టలు .. అటు డబ్బూ, ఇటు పబ్లిసిటీ …” విడమర్చి చెప్పాడు కేసీఆర్‌.
అందరూ తుళ్ళుతూ కేరింతలు కొట్టారు. “బాస్‌ … క్యా అయిడియా హై!” అంటూ పొగడ్తలు కురిపించారు.
“మరేమనుకున్నారు కేసీఆరంటే … గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు వైఎస్‌కీ, చంద్రబాబుకే కాదు, నాక్కూడా తెలుసు..” అంటూ కేసీఆర్‌ సమావేశాన్ని ముగించాడు.

* * *
మర్నాడు టిఆర్‌ఎస్‌ నాయకులంతా కూలిపనికి బయల్దేరారు. కేసీఆర్‌, నరేంద్ర చెట్టాపట్టా లేసుకుని పాడుకుంటూ నడిచారు.
“ఆడుతూ, పాడుతూ కూలీ చేస్తే … అలుపూ సొలుపేమున్నది? ఇద్దరమొకటై దండుతు ఉంటే ఎదురేమున్నదీ? మనకూ కొదవేమున్నదీ?”
ఏరియా ఇన్‌చార్జిలు కూడా ఎంపికచేసిన ప్రదేశాలకు వెళ్ళి కూలీ పనులు మొదలుపెట్టారు. కిళ్ళీలు కట్టారు, చాయ్‌లమ్మారు … బట్టలు, నగలు అమ్మారు, జ్యూస్‌లు చేశారు, దుమ్ము దులిపారు, ఓ పెళ్ళికి వెళ్ళి పెళ్ళిభోజనాలు కూడా వడ్డించారు.
అబ్రకదబ్ర … మొదటి రెండు రోజుల్లోనే అందరికీ కలిపి రెండు కోట్ల రూపాయలకి పైగా కూలీ డబ్బులు ముట్టాయి. టిఆర్‌ఎస్‌ నాయకులకి కళ్ళు తిరిగాయి. నోళ్ళు వెళ్ళబెట్టారు.
కేసీఆర్‌ హుషారుగా పాట మొదలుపెట్టాడు.

చందాలే పార్టీకీ మూలం ...

ఆ చందా విలువ తెలుసుకొనుట లీడరు ధర్మం ...

చందాలే పార్టీకీ మూలం....

నాయకుడే చందాలను కనిపెట్టెనురా!

దానికి తానే తెలియని దాసుడాయెరా!

చందాలను నిస్సిగ్గుగ దండినవాడే ...

శ్రీమంతుడు, ధీమంతుడు, చందాలుడు రా!

చందాలే పార్టీకీ మూలం ..."నరేంద్ర చప్పట్లు కొడుతూ శ్రుతి కలిపాడు."కూలివాడి చెమటలో బలమున్నదిరా!

ఇమిటేషను చెమటలోన కలిమున్నదిరా!

రాజకీయ కూలీకీ లక్ష్మీ కటాక్షం ...

విజయశాంతి తోడుంటే ఇంకా లాభం ..."

కేసీఆర్‌ పాట ఆపేసి, నరేంద్ర వైపు ఉరిమి చూశాడు. “మీరా విజయశాంతి జపం మానరు కదా!” అంటూ చిరాకుపడ్డాడు.
“ఆవిడ ఎంతైనా మన ఆడపడుచు … ఈ ప్రోగ్రాంలో ఆమెని కూడా కలుపుకుని ఉంటే మరింత కనకవర్షం కురిసేది కదా అని నా తాత్పర్యం” సర్దిచెప్పాడు నరేంద్ర.
కేసీఆర్‌ ఏదో అనబోయేలోగా బయట ఏదో కోలాహలం వినిపించింది. ఇంతలో సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు.
“సార్‌ … మిమ్మల్ని కలవడానికి చాలామంది జనం వచ్చారు … తెలంగాణ కూలీల సంఘం అని బ్యానర్‌ పట్టుకున్నారు.”
కేసీఆర్‌ మొహం వికసించింది. “చూశారా నరేంద్రగారూ, మన వాళ్ళెలా సంఘటితమవుతున్నారో! తెలంగాణ డాక్టర్ల సంఘం, తెలంగాణ న్యాయవాదుల సంఘం, తెలంగాణ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ ఆట్రోడైవర్ల సంఘం … ఇప్పుడు తెలంగాణ కూలీల సంఘం కూడా వచ్చేసింది” అన్నాడు పొంగిపోతూ.
ఇద్దరూ బయటికి వెళ్ళి, అక్కడి జనానికి నమస్కారం చేశారు.

“ఓ నా తెలంగాణ కూలీ సోదరులారా! మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు” శిరసు వంచి అన్నాడు కేసీఆర్‌.
కూలీజనంలో కలకలం మొదలైంది. ఆ సంఘం ప్రతినిధి ముందుకొచ్చి అన్నాడు.
“మద్దతు తెలపడానికి రాలేద్సార్‌! రెండు డిమాండ్లతో మీ దగ్గరికి వచ్చాం … మీరా డిమాండ్లు నెరవేరిస్తే తప్పకుండా మీకే మద్దతిస్తాం.”
“తప్పకుండా … తెలంగాణ సోదరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి టీఆర్‌ఎస్‌ చివరి రక్తపుబొట్టు దాకా శ్రమిస్తుంది. గడచిన ప్రభుత్వాలు మిమ్మల్ని ఎలా దోపిడీ చేశాయో అందరికీ తెలుసు … ఆ దోపిడీలకు తెరదించడానికే మా పార్టీ పుట్టింది” అన్నాడు నరేంద్ర ఆవేశంతో ఊగిపోతూ.
“ఉపన్యాసాలు తరవాత … ముందు మేం చెప్పేది వినండి … మీరంతా ఏయే కూలిపనులు చేశారో, దానికి మీకెంత కూలీ ముట్టిందో టీవీల్లో చూశాం … పేపర్లలో చదివాం … మా కూలీరేట్లు పెంచినందుకు కృతజ్ఞతలు చెబుతూ, మా డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నాం … డిమాండ్‌ నెంబర్‌ వన్‌ … ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, రోజు కూలీ మినిమమ్‌ లక్ష రూపాయలు చేస్తూ కనీస వేతనాల చట్టాన్ని సవరించాలి. ఆ మేరకు హామీ ఇప్పుడే ఇవ్వాలి … మేనిఫెస్టోలో కూడా ప్రకటించాలి” గడగడా చెప్పుకుంటూ పోయాడు సంఘం ప్రతినిధి.

కేసీఆర్‌, నరేంద్ర ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
“రెండో డిమాండేమిటి నాయనా!” కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు కేసీఆర్‌.
సంఘం ప్రతినిధి తలూపి చెప్పాడు.
“డిమాండ్‌ నెంబర్‌ టూ … మీరెన్ని రోజులు మాలాగా కూలీవేషం కట్టి పనిచేశారో, అన్ని రోజులు మేంకూడా మీలాగా వేషాలు కట్టి, మీ పదవుల్ని ఏలాలి … మీ పార్టీ కార్యాలయం మాకప్పగించాలి … ఇది ప్రత్యేక రాష్ట్రంలో కాదు … ఇప్పుడే … ఇక్కడే …”
అగ్రనేతలిద్దరూ చటుక్కున అంతర్థానమై పోయారు.


ఈ వ్యాసానికి చెందిన కాపీ హక్కులు రచయిత రాజగోపాల్ (rajagopal_mangu@rediffmail.com)మరియు ప్రచురణదారులు ఆంధ్రజ్యోతి కలిగియుంటారు. నాకు నచ్చిన ఈ వ్యాసాన్ని ఇక్కడ ఉంచడం అభ్యంతమైనచో తెలుపవలసింది.


ప్రకటనలు

2 thoughts on “వీళ్ళకి కాప్షన్‌ కూడా వేస్టే

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s