మొదటి బెబ్లాస :)

రావు గారు మరియు జ్యోతిగారు అన్న “బస్తీ మే సవాల్” కంటే చావా కిరణ్ అన్న “వీళ్ళకి కలవడం ఇష్టం లేకపోతే మానేస్తారు! ఎందుకు వీళ్ళను బలవంతం చేస్తారు” వాక్యం చురుక్కుమని కాదు కసక్కుమని గుచ్చుకొంది. దాంతో దాదాపు సంవత్సరం నుండి గింజుకొంటున్న “బెబ్లాస” (బెంగళూరు బ్లాగర్ల సమావేశం) ఎట్టకేలకు ఈ శనివారం (19-మే-2007) పచ్చని చెట్లకు మరియు ప్రశాంత వాతావరణానికి నిలయమైన లాల్ బాగ్ లో జరిగింది.
మొదట నా ఫోన్ నంబరుని బ్లాగర్లందరికీ తెలుపుదాము అని అనుకొన్నాను, కానీ అదే రోజు జరిగిన Spam Calls చర్చను చదివి ఉండడంతో సందేహించి రావుగారు పంపిన వ్యక్తుల మాత్రం నా ఫోన్ నంబరు పంపాను. ఇది పెద్ద పొరపాటని తరువాత తెలిసి వచ్చింది. రావుగారు ఇచ్చిన చిట్టాలో లేని బ్లాగర్లు కొందరు సమావేశానికి రావాలని ఉన్నా రాలేక పోయారు. మన ముఖాలు తెలియక, మన ఫోన్ నంబరు తెలియకపోతే..జనాలు ఈ పూతరేక్స్ నవీన్ ను ఎలా గుర్తు పడతారు?
సమయం 9:30
నా స్నేహితుడు కిరణ్ ఫోన్ చెయ్యడంతో నిద్ర లేచాను…వెంటనే 10:00కు సమావేశం గుర్తు రావడంతో తొందరగా తయారయ్యాను.

సమయం 10:00
లాల్ బాగ్ కు వెళ్ళే బస్సులో ఎక్కాను. తమాషా ఏమిటంటే అక్కడ చెక్కింగ్ స్క్వాడ్ బస్సులో ఉన్న వారి టిక్కెట్లను చెక్ చేస్తున్నారు. టిక్కెట్లు లేని వారికి 150 రూపాయల అపరాద రుసుమును వసూలు చేస్తున్నారు. స్క్వాడ్ నేరుగా నా వద్దకు వచ్చి “టిక్కెట్ ఎల్లి” అన్నాడు. మనం వచ్చీ రానీ కన్నడంలో “నాను ఇవాగె బందిదిని” అన్నాను….వాడికి అర్థమైయ్యేలా వాదింది రోదించి భోదించేసరికి లాల్ బాగ్ వచ్చేసింది.

సమయం 10:30
లాల్ బాగ్ ముఖద్వారంలో ఎవరైనా మనోళ్ళు ఉన్నారా అని చూశాను….ఊహు ఇలా పోల్చుకోవడం సాధ్యపడదని….ప్రవీణ్ కు ఫోన్ చేసి బిగ్గరగా తెలుగులో మాట్లాడాను ఎవరైనా నన్ను గుర్తుపడతారేమోనని. తరువాత మాకినేని ప్రదీప్ కు ఫోన్ చేస్తే తను ఇది వరకే లాల్బాగ్ లో ఉన్నానని చెప్పాడు. ఒకరి చొక్కా రంగులు ఒకరం చెప్పుకొని…గుర్తు పట్టే సరికి 10:45 అయ్యింది. మాటల్లో అతను కూడా NITK, Surathkal కాలేజీలోనే M.Tech చదివాడని తెలుసుకొన్నాను.

సమయం 11:00.
“నా మదిలో” ప్రవీణ్ విచ్చేశాడు. అతన్ని చూసిన వెంటనే పదీప్ “అర్రె!!! బ్లాగులో ఫోటోలో ఉన్నాట్టే ఉన్నాడే” అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక ప్రవేశ శుల్కాన్ని చెల్లించి చీటీలు (టిక్కెట్లు) తీసుకొని లోపలికి నడిచాము. ఇది వరకే ప్రవీణ్ నాకు తెలుసు, ప్రదీప్ ను ఇందాకే పరిచయం చేసుకొన్నాను..కావున ఒకరికి ఇంకొకర్ని పరిచయం చేశాను. తరువాత మాకున్న పరిధిలో లక్షాన్ని ఎలా సాధించగలుగుతాము, వాటికి మార్గాలు ఏమిటి అని చర్చించుకుంటున్నాము..ఇంతలో ప్రవీణ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

సమయం 11:30
ఆ ఫోన్ చేసింది కూనపరెడ్డి మురళీకృష్ణ గారిది. “అరగంట నుండి గేటు ముందరే కాచుకొని ఉన్నాను..మీ ఫోన్ నంబర్లు తెలీక చీమలమర్రి అనీల్ కు ఫోన్ చేస్తే ఇంటర్నెట్ లో చూసి మీ నంబర్లు ఇచ్చాడు” అని అన్నారు. ఆయన వేచిచూత అంతా గొంతులోనే ద్వనించింది :). మళ్ళీ మేం ముగ్గరం పరుగు లాంటి నడకతో గేటు దగ్గరికి వచ్చేసరికి మురళీకృష్ణ గారు, ఆయన కజిన్ తమ్ముడుని (?) కూడా సమావేశానికి తోడ్కొని వచ్చారు.
అంత వరకు గంభీరంగా సాగిన చర్చ…సరదాగా రసవత్తరంగా సాగిపోయింది. దగ్గర్లో ఉన్న ఒక రచ్చబండ మీద కూర్చొవడంతో సమావేశం మొదలైంది. మొదటి హైబ్లాస కూడా ఇలాగే జరింది అని మురళీకృష్ణ చెప్పారు. బ్లాగర్ల చరిత్ర, యూనీకోడు, యూనీకోడు పనిముట్ల చరిత్ర వంటి ఆసక్తికర అంశాలు చర్చల్లో సరదాగా సాగిపోయాయి.

సమయం 12:30
లాల్బాగ్ మధ్యలో ఉన్న చెరువు దగ్గర నిల్చుకొని మాట్లాడుకొంటూ ఉండగా, ఆరడుగుల స్ఫురద్రూపి ఐన యువకుడు పెద్ద పద్ద అంగలతో మెట్లు ఎక్కుతూ మా వద్దకు వచ్చి తన చేతిలో ఉన్న బిస్లరీ నీళ్ళ సీసాను మా చేతిలో పెట్టాడు. అతను అనీల్ చీమలమర్రి అని గురు పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. మురళీకృష్ణ గారి లాగే అనీల్ కూడా సరదా మనిషి కావడంతో చర్చ మరింత రసవత్తరంగా సరదాగా సాగిపోయింది. తరువాత నవ్వులే నవ్వులు. మా నవ్వులకి అప్పటిదాకా మోఢంగా ఉన్న మేఘాలు చెల్లాచదురు అయ్యి మమ్మల్ని చూడటానికి సూర్యునికి దారిని ఇచ్చాయి.

సమయం 2:30
ఇలాగే సరదాగా ఫోటోలు తోసుకొంటూ..నవ్వుకొంటూ ఉండగా సమయం 2:30 అయిపోయింది. మిగతా వాళ్ళ సంగతేమో కానీ నేను టిఫిన్ చెయ్యకుండా వచ్చాను. అందరికీ పేగులు కేకలు పడుతున్నాయి. సమావేశం ముగించి తదుపరి భోజన కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ది గాంచిన MTR హోటల్ కు వెళ్ళాం. అక్కడ భోజనం చెయ్యాలంటే కనీసం రెండు గంటల ముందు ఉండాలి..అలాంటిది 2:30కు వెళితే భోజనం ఏమి దొరుకుతుంది? మురళీకృష్ణ గారు సెలవు తీసుకోవడంతో నేను, ప్రవీణ్, ప్రదీప్, అనీల్ మిగిలాము.

సమయం 3:00
MTR నుండి బయటకొచ్చి మండే యెండలో Kamat Minervaకు వెళ్ళం. అక్కడ North Karnataka Special ఐన జోళెద రొట్టె (జొన్న రొట్టె)కు వెళ్ళాం. యెండలో తిరిగి, గంటల కొద్దీ మాట్లాడి, పేగులు అల్లాడున్న సమయంలో….వేడి వేడి జొన్న రొట్టెలతో పాటూ నంజుకోవటానికి గుత్తొంకాయ కూర, శెనెగల పులుసు, వెన్న ఇస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో మా నలగురికీ తెలుసు. వాడు రొట్టెలు తెస్తూనే ఉన్నాడు, మేం రొట్టెలు తింటూనే ఉన్నాం. ఆత్మారాముడు శాంతించిన తరువాత ఇంకోసారి సమావేశం అయినప్పుడు MTRలో భోజనం చెయ్యాలని కీలక నిర్ణయం తీసుకొని ఇంటిదారి పట్టాము.

నిర్ణయాలు:

1) http://etelugu.org/ (?) బెంగళూరుకు ఒక పేజీ కావాలి.
2) బెంగళూరు బ్లాగర్లు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని వారందరినీ వచ్చే సమావేశంలో పాల్గొనేలా చెయ్యాలి.
3) కంప్యూటర్లో తెలుగు గురించి పాఠాలు .ppt, flash animation రూపాల్లో తయారు చెయ్యాలి.
4) ETV2 తెలుగు వెలుగు కార్యక్రమంలో ఈ అంశం గురించి ప్రసారం వచ్చేలా చర్యలు తీసుకోవాలి
5) ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి దినపత్రికలలో కాడా వ్యాసాలు వచ్చేలా కృషి చెయ్యాలి
6) బ్లాగర్లకు Tele Conference ద్వారా సమావేశం అయ్యే అవకాశం ఉందేమో పరిశీలించాలి ;)
7) నెలకు ఒక్కసారైనా సమావేశం జరపాలి.
8) ఇంకోసారి సమావేశం అయినప్పుడు MTRలో భోజనం చెయ్యాలి :)

బొమ్మలు:
మొదటి తెలుగు బ్లాగర్ల సమావేశం

మొదటి బెంగళూరు బ్లాగర్ల సమావేశం

మాకినేని ప్రదీప్, చీమలమర్రి అనీల్, గార్ల సురేంద్ర నవీన్, కూనపరెడ్డి మురళీకృష్ణ, గార్లపాటి ప్రవీణ్ (ఎడమ నుంచి కుడి వైపుకు)

14 thoughts on “మొదటి బెబ్లాస :)

 1. ఎట్టకేలకు బెబ్లాస జరిగిందని తెలిసి చాల సంతోషించిన వాళ్ళలో మొదటి వాడిని నేను.బెంగుళూరు వస్తే తదుపరి సమావేశముకు నేను హాజరవుతాను.
  జాబాలిముని

 2. అభినందనలు. మీరంతా, ఇలాగే, నెల నెలా కలవాలనీ, మీ స్నేహం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలనీ, తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభి వృద్ధికీ, మీ వంతు సాయం అందించ గలరనీ ఆశిస్తాను.

 3. అభినందనలు. సవాల్ పనిచేసిందన్నమాట ఇలా ప్రతీ ఊర్లో జరగాలి. తెలిసిందా సమావేశంలో ఉన్న మజా. రాని వాళ్ళు చాలా మిస్ అవుతారని అన్నానా. అమెరికా వాళ్ళు ఏం చేసారో తెలియాలి.ఇది ఇలాగే ప్రతినెలా జరపండి

 4. భలే..చాలా ఆనందంగా ఉంది. బెబ్లాస బాగా జరిగిందన్నమాట. ఇలాగే మరిన్ని సమావేశాలు జరగాలని ఆశిస్తూ..

  అమ్మా జ్యోతీ మేమేం తక్కువ తినలేదు. అబ్లాస మొదటి ఫోను సమావేశం పోయిన శనివారం జరిగింది. విశేషాలతో విహారిగారు త్వరలో మీముందుకొస్తారు. ఆయన బ్లాగును ఒక కంట కనిపెడుతూ ఉండండి.

  ఇక సమావేశానికి రానారె, ఇస్మాయిల్ గారు, చరసాల ప్రసాద్ గారు, విహారి గారు, సురేష్ కొలిచల గారు, ఇంద్రగంటి పద్మ గారు వచ్చారని మాత్రం చెప్పగలను.

 5. మీలో ఒక్కోరూ ఒకో సెలబ్రిటీ :)
  మంచి నిర్ణయాలు తీసుకున్నారు. హైబ్లాస, బెబ్లాస,అబ్లాస,అభాబ్లాస,ప్రబ్లాసలు ఏవి జరిగినా మన లక్ష్యాలు దాదాపు ఒకటే కావున, వాటిని నెరవేర్చేందుకు కలిసి పనిచేయడమే ఇకముందు మనం చేయబోతున్నది. అందులో భాగంగా తెవికీని, లేఖినినీ, తెలుగుబ్లాగు గుంపునూ బ్లాగరులందరూ ప్రముఖంగా కనిపించేలా తమతమ బ్లాగులలో చేయాలని, తెవికీకి లింకులిచ్చి విస్తృతంగా ఉపయోగించాలనీ ప్రోత్సహిద్దాము. ఈరోజు తెలుగుబ్లాగు గుంపులో మీ ఉత్తరం చూశాను. సైన్యానికి ఒక జెండా ఎంత గుర్తింపునిస్తుందో మనకూ ఈ అజెండా అంత గుర్తింపునూ ఇచ్చి, అందరూ మనవైపు చూసేలా చేస్తుంది. ఇంటింటా ఇంటర్నెట్టులో తెలుగు వ్యాప్తికి కీలకమైన సాధనమౌతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s