విమానంలో బ్రహ్మచారి

అబూధాబిలో ఉండటానికి నవీన్‌కు ఆఖరు రోజు. ఇంటికొచ్చేస్తున్నామన్న ఆనందం ఒక పక్క…స్టార్ హోటల్లో రాజ భోగం ఇక ఉండదే అని కొంచెం బాధ ఇంకొక పక్క. తప్పదు…ఒక్క రోజులో ఎలక్ట్రా వీధిలో ఉన్న కాస్సెల్స్ హోటల్ నుంచి బిలేకళ్ళిలో ఉన్న మునిస్వామి వొన్ బెడ్రూమ్ అద్దింటికి వచ్చేయాలి. విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉన్న హంగామా వచ్చేటప్పుడు ఉండదు. కాకపోతే వెళ్ళేటప్పుడు వచ్చే నెలకు సరిపడ్డా పప్పు, నిప్పట్లు, చెక్కిలాలు, మైసూరుపాకులు, కొబ్బరి మిఠాయిలు, టాప్ ర్యామెన్ టొమాటో ఫ్లేవర్డ్ నూడుల్స్, ఎమ్టీఆర్ రసం పొడి, ఎమ్టీఆర్ సాంబార్ పొడి, ఎమ్టీఆర్ మసాలా పొడి, ఎమ్టీఆర్ ఆ పొడి, ఎమ్టీఆర్ ఈ పొడి పట్టుకెళ్తాం…వచ్చేటప్పుడు అదే స్థలంలో బంగారం, బండెడు చాక్లెట్లు, బోల్డు సెంటు బుడ్లు, రక రకాల ఖర్జూరాలు, విధ విధాల గ్యాడ్జెట్లు పట్టుకొస్తాం. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ప్యాక్ చేసి, లగేజిని ఒకటికి పది సార్లు తూకమేస్తాం. వెచ్చేటప్పుడు మనకివన్నీ అవసరమా? లేదు. మాసిన బట్టలు కుక్కేసి..మిగిలిన స్థలంలో ఏవో కొన్ని బహుమతులు తెచ్చయ్యడమేగా.
సరే మొత్తానికి న’వీను’డు లగేజి సర్దుకొని ట్యాక్సీ ఎన్ని గంటలకు పిలవాల్రా అని ఆలోచించుతూంటే…కోయంబత్తూరు తీర్థగిరి, సాయంకాలం అవగానే దుబాయి రోడ్డులు డబెక్కి కదం తొక్కుతున్న వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీ కార్లతో నిండిపోయి ట్రాఫిక్కు కాస్తా వాకింగుకి వెడుతున్న 90యేళ్ల ముసలోడిలా ఇంచు బై ఇంచు వెడతాయని చెప్పేసరికి…నాలుగ్గంటలకె క్యాబును రమ్మని కబురెట్టాను. అబూధాబి నుండి దుబాయికి గంటన్నర ట్యాక్సీ ప్రయాణం. ట్రాఫిక్కు అంతరాయాలుండి క్యాబు అంతకంత సమయం తీసుకున్నా హీన పక్షంలో ఏడుకు చేరతాం విమానాశ్రయానికి. పది గంటల బెంగళూరు విమానాన్ని పట్టుకోవటానికి ఆ మాత్రం సమయం చాలనేది నా లెక్క. ఈ లెక్కలన్నీ వేసుకొంటూండగానే రిసెప్షన్ నుండి క్యాబొచ్చిందని కబురొచ్చింది. ఖాళీ చేసి వెళ్ళిపోయే ముందు తొమ్మిదో అంతస్తులో ఉన్న ఆ ఎక్జిక్యూటివ్ రాయల్ సూటును ఒక్కసారి చూసుకున్నాను. ఇలాంటి ఒక దేశానికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కిటికీ లోనుంచి కనపడే అరేబియా సముద్రాన్ని ఒక్క నిముషం పాటూ అలా చూస్తూ ఇక్కడ కలిగిన అనుభవాలు, పరిచయం అయిన వ్యక్తులు, చూసిన స్థలాలు అన్నింటినీ ఒక్క సారి గుర్తు చేసుకొని క్రిందకు వచ్చేశాను. హోటలోడికి లాండ్రీ డబ్బులు గట్రా చెల్లించేసి ట్యాక్సీ ఎక్కాను. అబూధాబి దీవిని దాటి కారు ఎడారు మధ్యలో ఉన్న అబూధాబి – దుబాయ్ హైవే రోడ్డులో 90+ మైళ్ల వేగంతో దూసుకుపోతూంది. ఎడారిని హరితవనంగా మార్చాలన్న అరబ్బుల పట్టుదలకు సాక్ష్యంగా కనిపిస్తూన్న ఖర్జూరపు చెట్లు, ఇతర మొక్కలు, వాటి వెనుక కనిపిస్తున్న ఇసుక తిన్నెలను అలా చూస్తూ చిన్న కునుకు తీశాను. కళ్ళు తెరిచేసరికి బుర్జ్-ఆల్-అరబ్ కనిపించింది. అంటే దుబాయ్‌కు వచ్చేశామని లెక్క. ఆ రోజెందుకో ట్రాఫిక్కు చాలా తక్కువగా ఉంది. ఐదూ ముఖ్కాల్ కల్లా దుబాయ్ ఎర్‌పోర్టులో ఉన్నా. బెంగళూరు విమానానికి ఇంకా నాలుగ్గంటలు ఉంది. సరే..బ్యాగేజి స్క్రీనింగ్, లగేజి చెక్కిన్ గట్రా కానిచ్చే సరికి ఆరున్నర అయ్యింది. బోర్డింగుకు ఇంకా మూడు గంటల సమయం ఉందన్న మాట, ఇంకేముంది మస్తుగా ఫేమస్సయిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మీద పడ్డా. ఖర్జూరాలు, చాక్లెట్లు ఒక పక్క, ఖరీదైన వాచీలు, ఐపాడ్లు, ఇతరత్రా గ్యాడ్జెట్లు మరో పక్క. మధ్యలో మొత్తం బంగారం (డిజైనర్ జ్యువెలరీ). దీన్తల్లీ…ఈ రోజు ఎట్లాగైనా మనకు వాచీ కొనుక్కోవాలని డిసైడయ్యా. నాకు నచ్చిన ఒక ఐదు మోడళ్ళ వాచీలను చూశా. వాటి రేటు చూడంగానే కళ్ళు తిరగడమే కాదు మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఒక్కటి కూడా 35వేలకు తక్కువ లేదు. వార్నాయనో…దాని బదులో కంప్యూటరు కొనచ్చు, ఎప్పుడూ షర్టు మాటున దాగుండే వాచీకి యాభైవేలు అనవసరం అనిపించి..కొనడానికి సాహసించలేదు. కాళ్ళరిగే దాకా డ్యూటీ ఫ్రీలో తిరిగి మొత్తానికి బోర్డింగు సమయానికి గేటు-16కు చేరుకున్నా. బోర్డింగు ఆయితు…ఇక విమానం ఎక్కడానికి అరగంట ఉంది. ఆ అర గంట Gulf News, Business Arabic చదువుతూ కూర్చున్నాను. అందులో సగం పైన ప్రకటనలు రియల్ యస్టేటువే. ఫ్లాట్ల ఖరీదు మీతో చెప్పకపోవడమే మంచిది. లేదంటే..ఈ కూడలి చూస్తూ కుప్పకూలే ప్రమాదం ఉంది. మొత్తానికి పది అయ్యింది. విమానంలోకి రా..రా..రారా బంగారం అని పిలుపూ వినిపించింది. విమానంలోనికి వెళ్ళి 35C ఎక్కడుందో చూసుకొంటూ వెళ్ళాను.

ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి…..సామాన్యంగా ప్రయాణం అవుతున్నాము అనగానే జనాలు “విష్యూ ఎ వెరి హ్యాపీ జర్నీ” అంటారు. “హ్యాపీ జర్నీ” అంటే ఎలా ఉండాలి? ఒక్కోరు ఒక్కో సమాధానం చెబుతారు. కొందరికి ప్రయాణం మొత్తం హాయిగా నిద్రపడితే హ్యాపీ జర్నీ. ఇంకొందరికి బండిలో మంచి సినిమా వేస్తే అది హ్యాపీ జర్నీ. మరి కొందరికి పక్కన ‘మాంచి’ కంపెనీ దొరికితే అది హ్యాపీ జర్నీ. ఖర్మ బాగోలేకపోతే పక్కన ఏ నస మహారాణి ఐన బామ్మో, పేగులు బయటకొచ్చేలా దగ్గే తాతో, ఎప్పుడప్పుడు వాంతి చేసుకుందామా అనే అజీర్తి రావులు తగులుతారు. ఖర్మను నమ్మని వాళ్ళకు….విష్షస్సు తెలిపిన బాడ్కోవ్‌లను తిట్టడం మినహా వేరే దారి కనిపించదు. ఐస్టీన్ సాపేక్ష సిద్దాంతం ప్రతిపాదించిన కొత్తల్లో దాన్ని కొందరికి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కష్టపడే వాడంట. దాంతో వారికి తేలిగ్గా అర్థమయ్యేలా తెలుపడానికి ఇలా చెప్పేవాడంట..”ఎండా కాలంలో మధ్యాహ్నం నిప్పుగుండం పక్కన గంట కూర్చుంటే..అది ఓ రోజులా అనిపిస్తుంది. అదే గంట ఒక అందమైన అమ్మాయితో గడిపితే…నిముషంలా అనిపిస్తుంది. రెండు ఉదాహరణల్లోనూ గంట గంటే. ఇదే సాపేక్షమంటే”

విమానమెక్కుతూ…పక్కన ఏ బేవార్స్ గాడు ఉంటాడో అనుకుంటూ 35Cను వెతుక్కుంటూ వెళ్ళాను. పక్కన ఎవ్వరూ లేరు కానీ ఖాళీ సీటు పక్క మాత్రం ఓ మోడ్రన్ బామ్మ కూర్చొని ఉంది (కోటు..ప్యాంటు వేసుకొని ఉంది మరి). ఈ ఖాళీ సీటు ఈమె మనవరాలిదైతే బాగుండు అనుకుంటూ నా సీట్లో కూర్చున్నాను (సాపేక్షం…సాపేక్షం). ఎమరైట్స్ ఫ్లయిట్ కదా…సీటుకో టీవీ..టీవీలో నాలుగు వందల ఛానెల్స్. అంటే నాలుగు వందల సినిమాల్లో మనకు ఇష్టం వచ్చింది ఎంచుకొని చూడొచ్చన మాట. నా ముందరోడు “పోకిరి” సినిమా చూస్తున్నాడు. వావ్…ఇంగ్లీషు కాకుండా వేరే భాషా సినిమాలు కూడా వస్తాయన్న మాట. నాలుగ్గంటలు తగలెయ్యడానికి ఏ సినిమా ఐతే ఏం..ఒక ఛానల్లో Bourne Ultimatum వస్తూంటే దాన్ని చూస్తూ కూర్చున్నా. ఇంతలో ఒక అరబ్బీ విమాన కన్య (ఎయిర్ హోస్టేస్‌కు పట్టిన తెగులు..కాదు తెలుగు) వచ్చి ‘ఎక్యూజ్ మీ సర్’ అంది. పక్కనే ఎవడో ఉన్నాడు. వాడు ఇక్కడ ఖాళీ కుర్చీ బాపతు కాబోలు…..కాళ్ళడ్డం తీసి దారిచ్చా. జనుడు వచ్చి కుర్చీలో కూలబడి…ఎయిర్ హోస్టేస్‌తో సీరియస్‌గా గుమ్మడి శైలిలో డవిలాగులు చెప్పడం మొదలెట్టాడు…”అమ్మా నేను కాబట్టి ఆ సీటును త్యాగం చేసి ఇక్కడికొచ్చా, ఆ ముగ్గర్లాగా నేనూ అదే సీటు కావాలని మొండికేసుంటే ఏమి జరిగేది? నాకైతే పరవాలేదు..ఆ సీటు కాకుంటే..ఈ సీటు, ఇది కూడా కాకుంటే..పైలట్ సీటు..ఏదో ఒకటి సర్దుకుపోగల్ను…కానీ నా చిట్టి చిన్నారి కూతురు అక్కడే ఒంటరిగా ఉంది…విమానం పైకి లేచేటప్పుడు ఏడిస్తే…ఆ పాపం నీదేనమ్మా నీదే” అనీ ఎమోషనల్‌గా చెప్పాడు. పాపకోసం ఆలోచించిందో లేక పాపానికి భయపడిందో కానీ విమాన కన్య మళ్ళీ నా పక్క చూసింది. కొంపదీస నా సీటు త్యాగం చెయ్యమనదు కదా అని అనుకొంటూండంగానే…”సర్ డూ యూ మైండ్ ఛేంజింగ్ యువర్ సీట్” అని కూసింది.అది వినంగానే అయోమయంలో పడ్డాను. లగేజి ఇది వరకే పైన పెట్టేశాను. అందులో విలువైన వస్తువులు ..ముఖ్యంగా మా ప్రాజెక్టు బ్యాకప్ ఉంది. ఆర్నెల్ల కష్టం అది…నలభై మిలియన్ డాలర్ల సాప్ట్‌వేర్ అది. అది ఎక్కడో ఎనకల పడేసి ముందర ఆలోచలు లేకుండా నిశ్చింతగా నిద్రపోవచ్చునా!!! అని ఆలోచిస్తూ విసుగ్గా “యా..ఐ మైండ్ టు ఛేంజ్ సీట్” అన్నా. ముందర సీటు బాగుందో లేదో…పక్కన ఏ నసగాళ్ళు తగులుతారో ఏమో అని నా బాధ. నా నుంచి ఈ సమాధానాన్ని ఆశించలేదేమో…విమాన కన్య షాక్ తిన్నట్టుగా గొణుగుతూ “యూ మైండ్?” అని నమ్మలేనట్టుగా చూసింది నన్ను. 35Dలో కూర్చున్న ఓ దేశోద్దారకుడు, మోడర్న్ బామ్మ, ఆ చిన్న పిల్ల తండ్రి, విమాన కన్య నలగురూ కలసి నన్ను హంతకుడుని చూసినట్టు చూశారు. “జాలి దయ కరుణ లేని కఠిన హృదయుడా” అని అంటున్నట్టున్నాయి వాళ్ళ చూపులు. చూస్తే చూసుకోనీ నాకేం..తీరా ముందుకు పొయ్యి…అక్కడేమన్నా ఇబ్బందులు ఉంటే నా జర్నీ కాస్తా అన్‌హ్యాపీ జర్నీ అవుతుంది. ఐనా ఆ పాపేనేమైనా ఏయిర్‌పోర్టులో వదిలేస్తున్నారా? లేదే పాపేమన్నా ఏడుస్తోందా? లేదే…ఐదారు వరుసల ముందే కదా ఉంది….ఏమిటో ఈ కంగాళీ అని ఆలోచిస్తూండగానే…దేశోద్దారకుడు తన సీటు మారడానికి అంగీకరించాడు. విమాన కన్యేమో పాప తండ్రితో…ఒక్క సీటు అవతలేగా..పరవాలేదా అంటోంది. నా పక్కనోడేమో కూతురు తన పక్కనే ఉండాలి అని గొడవ. ఈ గొడవంతా వినలేక..విమాన కన్యతో..నీకిష్టమొచ్చిన చోట నన్ను తగలెయ్యి తల్లి అన్నాను.
వీడియో కట్టేసి, బెల్టు తీసి విమాన కన్యను అనుసరించాను. నాలుగు వరుసల ముందర 31C చూపించింది. ఆ సీట్లో మూడు సంవత్సరాల చిన్న పాప బుద్దిగా కూర్చొని ఉంది. ఓ ఈ పాపకోసమే కాబోలు అనుకొని, అలవాటుగా….యధాలాపంగా 31B, 31A చూశా…కళ్ళు జిగేల్‌మన్నాయి, నిద్ర మత్తు వదిలిపోయింది, అనాశక్తి ఎగిరిపోయింది…చినపాప పక్కనే ఇద్దరు పెద్ద పాపలు. వావ్….తంతే బూరెల బుట్టలో పడటమంటే ఇదే.ఈ సీటులోకి రాననా నేను ఇంత నసపెట్టింది..ఛీ..ఛీ. సరే ఈ రోజు జనాలు తెలిపిన విష్షస్సు బలం బాగుంది మరి. ముసలి మోడ్రన్ బామ్మ పక్కన కన్నా ఈ కరిష్మా మరియు కరీనా కపూర్‌ల కంపెనీ మేలు కదా. ఇంకేమీ ఆలోచించక వెంటనే సీట్లో కూర్చొని బెల్టు పెట్టేసుకున్నా. విమాన కన్య…”ఈజిట్ ఓఖే సర్” అని మెల్లగా అడిగింది. ఏమిటా వెధవ ప్రశ్న…”ఐయామ్ వెరి ఫైన్ అండ్ కంఫర్ట్‌బుల్” అని చెప్పాను. కూర్చున్న తరువాతా మళ్ళీ వీడియో సినిమాలు బ్రౌజ్ చెయ్యటం మొదలెట్టాను…ఇక ఈ నాలుగు వందల సినిమాలు ఏమి పనికి వస్తాయి, పక్కనే నలుగు వందల ఒకటవ సినిమా పెట్టుకొని. బ్యాక్‌గ్రౌండులో “ఏమెట్టి ..ఏమెట్టి ..ట్టి..ట్టి..ట్టి..ఏమెట్టి చేశా…..” అని వినిపిస్తూండగా యధాలాపంగా పక్కన కరీనా కరిష్మాల వైపు తిరిగి చూశా. వాళ్ళు ఇద్దరూ ముందర సీటులో ఎవర్నో చూస్తున్నారు. ఎవరా అని చూశా..30Cలో ఎవరో ముసిలోడు మా ముగ్గరి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. పోలికలు చూస్తే..రణధీర్ కపూర్ ఉన్నట్టున్నాడు. బబితతో కలిసి రాలేదు కాబోలు. విమానకన్యను పిలిచి ఏదో మాట్లాడాడు. మాటలయ్యాక విమాన కన్య నా వైపు తిరిగి ఏదో చెప్పబోయింది. వెంటనే “ఐ డోంట్ మైండ్ ఛేంజింగ్ మై సీట్” అన్నా. దాంతో విమాన కన్య, కరిష్మా, కరీనా అందరూ గట్టిగా నవ్వేశారు. దేనికి నవ్వారో ఇప్పటికీ నాకు అనుమానమే. త్రివిక్రం చెప్పినట్లు ఆ నవ్వులో లక్ష అర్థాలు వెతుక్కోవచ్చు. ఇప్పుడా అర్థాలు నాకనవసరం, ఒక్కసారి బెండయ్యాక…ప్రతిసారీ వొంగుతూండాల్సిందే. సరే మనకు తప్పేదేముంది…30Cకు వచ్చి చూశా…వావ్ …ఇక్కడ ఇంకో పాప. కొత్త పాప కూర్చునేదెవరా అని నా వైపు చూసింది. నన్ను చూస్తూనే పక్కనే ఉన్న కుర్రోడి చెవిలో ఏదో గొణుగింది. ఓహ్..వీళ్ళిద్దరూ జంటా…సరిపోయింది ఫో. నేను ఊహించినట్లేఅనుకున్నట్టే ఇద్దరూ సీట్లు మారి, కుర్రోడు నా పక్కకొచ్చాడు. “న్యూలీ మ్యారీడ్?” అని అడిగా కుర్ర్రోడితో. వెలిపోయే ముఖంతో “యస్” అన్నాడు.
ఆ రాత్రికి తరువాత మరి ఎవ్వరూ సీట్లు మారమని అడగలేదు. ప్రశాంతంగా కెమరాన్ దర్శకత్వంలో వచ్చిన “ది అబ్బైస్” సినిమా చూశా. ఆ తరువాత మరో రెండు గంటలకల్లా విమానం బెంగళూరుకు చేరింది.

ప్రకటనలు

7 thoughts on “విమానంలో బ్రహ్మచారి

  1. ‘యువార్ ఎక్స్యూస్డ్’, “యా..ఐ మైండ్ టు ఛేంజ్ సీట్” ఈ రెండు మాటలూ మీరు నిజంగానే అని వుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగించినవారౌతారు. ఈ మధ్య వస్తున్న తెగులు సినిమాల్లో ఇలాంటి చిల్లర హాస్యం ఉంటుందిగానీ.. దేశం బయట ఆంగ్లం మాట్లాడేటప్పుడు ఎకస్ట్రా పొలైటుగా వుండడం ఉచితం (ఆ మధ్య వచ్చిన తెలుగు సినిమాల్లోలా)… ప్రత్యేకించి మీ వృత్తులవారు.

  2. ప్రవీణ్:
    నువ్వు ఊహించినంత గొప్ప అనుభవాలేమీ లేవు రాయటానికి.

    రాకేశ్వర్రావ:
    ప్రయాణంలో కొన్నిసార్లు మొహమాటాలకు సెంటిమెంట్లకు పోవద్దనేది నాకు అనుభవాలు నేర్పిన పాఠాలు. ఇందులో వృత్తుల ప్రసక్తి లేదు.

  3. హిహిహి..కరిష్మా..కరీనాల దగ్గరనుండి తరిమేసినందుకు..ఆ ఎయిర్లైన్సుమీద కుళ్ళబొడిచేంత కోపమొచ్చిండాలే. ఎయిరులైన్సులో మనపక్కన అందమైన భామ వచ్చే ఛాన్సు ఆదివారం అర్ధరాత్రి ౧౨ గంటలకు సరిగ్గా మన కుడికంట్లో వెంటవెంటనే రెండు సార్లు పిడుగుపడేంత ప్రాబబిలిటీ అన్నమాట..దానిబదులు నుంగంబాక్కం లక్షీ బంపర్ డ్రా టికెట్టు కొనుక్కోవటం మేలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s