‘జల్సా’ సినిమా సమీక్ష

విజ్యువల్ యెఫెక్ట్స్ ఆస్కార్ గెలుచుకొన్న ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్‘ నిర్మించడానికి కేవలం సంవత్సరం పట్టిందంట. మరి మన పెద్ద హీరోలకు తొడకొట్టే మామూలు సినిమాలు పూర్తి చెయ్యటానికి కూడా ఎందుకు అంత సమయం పడుతుందో మన దర్శకులకు ఎరుక. ఆనాటి నిప్పురవ్వ నుండి ఈనాటి సైనికుడు, జల్సా వరకు ఇదే తంతు. తమ హీరో సినిమా ఆలస్యమైయ్యే కొద్దీ అభిమానల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోవడం, దానికి తగ్గట్టే మార్కెటింగ్ మేనేజర్ లాంటి నిర్మాత లేని హైప్ సినిమాకు తెప్పించడం, మంచి రేటుకు సినిమాను అమ్ముకున్న తరువాత వందల కొద్దీ థియేటర్లలో విడుదల చెయ్యటం మామూలయిపోయింది. ఈ ‘వందలు’ సంఖ్య నిర్ణయించడానికి రెండు ప్రాతిపదికలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎగస్పార్టీ హీరో సినిమాల కన్నా ఎక్కువ థియేటర్లు ఉండాలి, జనాలు ఇది బోకు సినిమా అని తెలుసుకునే లోపే మన పెట్టుబడి మనకు తిరిగి వచ్చెయ్యాలి. ఇందులో భాగమే మొదటి రెండు వారాలు ఇష్టమొచ్చిన రేటుకు టిక్కెట్టును అమ్ముకునే అధికారం, అవకాశం థియేటర్లకు కట్టబెట్టడం. వీటన్నిటి పైనా మొదటి ఆట టిక్కెట్ల వేలం, రాజకీయ నాయకుల గాలం వగైరా వగైరా. రెండు సంవత్సరాలు కాసుకొని, విడుదల రోజున ధియేటరు గేట్ల దగ్గర తోసుకొని, వందలు విదిలించి ‘వదిలించు”కొని’ సంపాదించిన టిక్కెట్టుతో విజయ గర్వంతో ధియేటర్లోకి అడుగుపెడతాడు సగటు అభిమాని. భీభత్సమైన వెరైటీగా సినిమా టైటిల్స్ పడేటప్పుడు ….అభిమానుల గోల,ఈలలు సినిమా మొదలైన తరువాత తగ్గుతాయి. ధియేటర్లోకి వెళ్ళేటప్పుడు, నైలు నదిని దాటే జీబ్రాల్లా చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళిన అభిమాని, తిరిగి వచ్చేటప్పుడు నాలుగు లంకణాలు చేసి…నెత్తి మీద సమ్మెటతో పదిసార్లు కొట్టిచ్చుకున్న బాపతులా ఉంటాడు.

ఉరేయ్…సినిమా ఎట్లుంది రా అని అడిగితే …వాళ్ళిచ్చే కొన్ని జవాబులు చూడండి:

 1. ధియేటర్ ఫుల్లు రష్షు రా, డైలాగులేమీ ఇనపడలా
 2. సెకండాప్ బాగుంది రా
 3. మూడు డ్యాన్సులు బాగున్నాయ్ రా
 4. ఫరవాలేదు…ఒక్క సారి చూడచ్చు
 5. ఊర్లో సినిమాలు చూసేకి ఇంకేమీ మిగలకపోతే, దీన్ని చూడొచ్చు.
 6. ఏమీ ఎక్స్పెక్టేషన్సు పెట్టుకోకుండా చూస్తే…బాగుంటాది రా. లేకుంటే ల్యా.

ఏమీ సరుకులేని సినిమాల్లో కూడా ఇలా ఏదో ఒక మంచిని చూస్తూ, హీరోలను ప్రోత్సహిస్తున్న తెలుగు అభిమానులు చాలా గొప్పవాళ్ళు. మరి ఆ అభిమానాన్ని నిలబెట్టుకునే సత్తా మన హీరోలకు ఉందా?

ఇప్పుడు అసలు విషయం జల్సా సినిమాకు వద్దాం.

ఆర్థిక, సామాజిక, ఆరోగ్య కారాణాల రీత్యా సంజయ్ సాహు అనబడే పవన్ కళ్యాణ్ కుటుంబాన్నంతా పోగట్టుకుంటాడు. దీంతో గుండెల్లో భూస్వాముల పట్ల అణిగి ఉండే కోపం బయటకు తన్నుకొచ్చి నక్సలైట్లలో చేరుతాడు. కొరియర్ స్థాయి నుండి లీడర్ స్థాయికి ఎదిగిన పవన్, ప్రకాష్‌రాజ్ అనబడే ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన దారుణ ఎన్కౌంటర్లో తోటి నక్సలైట్లనంతా పోగట్టుకుంటాడు. తరువాత లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోతాడు. కమలినీ ముఖర్జీ అనబడే ప్రకాష్‌రాజ్ కూతురు, మన పవన కళ్యాణ్‌ను ప్ర్రేమిస్తుంది. కానీ మన పోలీస్ ప్రకాష్‌రాజ్ ఇడియట్ సినిమా తరువాత కూడా మారకపోవడంతో పెళ్ళికి ఒప్పుకోడు. ఇట్సాల్రైట్ అని..సింపుల్‌గా తండ్రి చెప్పిన వాడినే పెళ్ళి చేసుకొంటుంది. దాని తరువాత మన పవనేమో..పగలు కాలేజీలో చదువు, రాత్రి బారులో మందు కొట్టడంలో బిజీగా ఉంటాడు. ఇప్పుడు అసలు వీరోఇన్ల ఇంట్రడక్షన్. హీరోఇన్లంటే ఎవరో కాదు, మన ఇలియానా, పార్వతీ మెల్టన్లే.
ఇప్పుడు మీకో చిన్న జీ.కే ప్రశ్న
1)సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోఇన్లను ఇట్రడ్యూస్ చెయ్యటానికి అనువు గల సీను ఏది?
a)బీచిలోనో/స్విమ్మింగు పూల్లోనో పొట్టిబట్టలతో తడుస్తూ వయ్యారంగా బయటకు రావటం
b)ట్రాక్ సూట్లతో ఏ జిమ్ములోనో అందాలను విరజిమ్మటము లేదా స్లో మోషన్లో టెన్నీసు ఆడటము
c)ఏ గూండా కంట్లోనో పడి రేప్‌కు గురికావటము (ఇది పాత పద్దతి. గూండా వికటాట్టహాసం మాని ముట్టుకునే లోపే ఠంచనుగా హీరో వచ్చేస్తాడులెండి)
d)ఇంకో క్రియేటివ్ పద్దతి
సాధారణంగా తెలుగు దర్శకులు మొదటి మూడు పద్దతులను ఎంచుకుంటారు. ఎప్పుడూ లేనిది, మన త్రివిక్రముడు రెండు, మూడు పద్దతులను కలిపి ఎంచుకున్నాడు. రెండోది మూడో దానికి కారణమౌతుందన్నమాట. షరా మామూలుగా…గూండాలు రేప్ చెయ్యబోతే ఇలియానా, పార్వతీ ఇద్దరూ కూడా పవన్ దగ్గరకు పరిగెడతారు. పవనేమో…గుద్దుకో గూండాను పడగొడతాడు. అది చూసిన ఈ బ్యూటీలు, వీడు నా వాడే అని ఎవరికి వారు అనేసుకుంటారు. మొదట…పార్వతి ‘ఐలవ్యూ’ అని ప్రొపోజ్ చేస్తే, పవన్ ప్రవరాఖ్యుడిలా ‘ఛీ..పో..నువ్వు నాకు నచ్చలేదు’ అంటాడు. లైన్ క్లియరైపోవడంతో, పవన్‌ను పడేద్దామని ఇలియానా ఫస్టాఫంతా ప్రయత్నిస్తూంటుంది. మధ్య మధ్యలో..దామోదర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు పవన్‌ను చంపాలని చూస్తూంటాడు. ఇలియానాకు ప్రేమ వరం ఇచ్చాడా, దామోదర్‌రెడ్డి ఎందుకు చంపాలనుకున్నాడు? అతని హత్యా ప్రయత్నాలను హీరో తిప్పికొట్టగలిగాడా అన్నదే మిగతా కథ.

నచ్చినవి:

 1. పవన్ నటన చాలా బాగుంది. చాలా హుషారుగా నటించాడు. బావోద్వేగాలు కూడా చాలా బాగా చూపించాడు.
 2. సినిమాటోగ్రఫీ అదరహో. ముఖ్యంగా పోరాట దృశ్యాల్లో.
 3. హీరోయిన్లను పాటల్లో కానీ, సీన్లలో కానీ ఎక్కడా అసభ్యంగా చూపకపోవడం. పవన్ కళ్యాన్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయుడు. ఇతని సినిమాల్లో ఆడవారిని అసభ్యంగా చూపరు.
 4. మాటలు కొన్ని బాగా నచ్చాయి. ఉదా:
 • బడికి నాలుగు కి.మి దూరంగా, ప్రభుత్వాస్పత్రికి ఎనిమిది కి.మీ దూరంగా, దురదృష్టానికి దగ్గరగా బ్రతుకుతున్నారు
 • పంటను పురుగు ఆశించింది. పురుగుల మందు చల్లాడు, పని చెయ్యలేదు. పురుగుల మందు తను తాగాడు, ఈ సారి పని చేసింది.
 • ఆకలైనా తినకుండా ఉంటే అది ఉపవాసం, నిద్రొచ్చినా పడుకోకుండా ఉంటే అది జాగరణ, చంపే అవకాశం వచ్చినా వదిలేస్తే అది మానవత్వం
 • రవి పార్కులాంటోడు. ఒక వారం చూస్తే, మరి కొత్తగా చూడటానికేమీ ఉండదు. సంజయ్ అలా కాదు, జీవితంలో ప్రతి రోజూ ఏదో కొత్తదనం చూపిస్తాడు.
 • నేనూ ఈ మధ్యే మార్గదర్శిలో చేరాను, ఒక తుపాకీ కొన్నాను

నచ్చనివి:

 1. అసలు నేను ఇక్కడ కథను సాధ్యమైనంత లీనియర్‌గా చెప్పాను. సినిమాల్లో కథంతా కలగాపులగంగా ఉంది.
 2. త్రివిక్రముడికి మాటల రచయితగా మాత్రమే మార్కులు పడతాయి. స్క్రీన్‌ప్లే లో ఘోరంగా విఫలం అయ్యాడు.
 3. గండరగండల్లాంటి హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, ఆలీ‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు
 4. ఇలియానాకు కొన్ని పాటల్లో మేకప్ విపరీతంగా ఉండి, ఎబ్బెట్టుగా ఉంది
 5. పాటలు, డ్యాన్సులు జస్ట్ ఓఖే. సూపరు..అనేంతగా ఏమీ లేదు.
 6. చాలా సీన్లు ఇల్లాజికల్‌గా, సిల్లీగా, అసంపూర్తిగా ఉన్నాయ్
 7. ఇది A సర్టిఫైడ్ సినిమా, హింస చాలా ఉంది సినిమాలో
 8. కథనంలో ట్విస్టులు ఎక్కువైయ్యాయి

అవీ-ఇవీ:

 1. ఇలియానా అంటే ఆంధ్రాలో కుర్రాళ్ళు ఎలా పడిచస్తారో, పార్వతి మెల్టన్ అంటే మళయాళీ కుర్రాళ్ళు అంతకంటే ఎక్కువ పడిచస్తూన్నారంట.
 2. మొదటి వారంలో 21కోట్లు, రెండు వారాల్లో 32కోట్లు వసూలు చేసిందని గీతా ఆర్ట్స్ ఉవాచ

చివరగా:

* ఈ ఆదివారం ఏదో సినిమాకు తప్పని సరిగా వెళ్ళాలి అంటే, ఈ సినిమాకు ఒక్క సారి వెళ్ళవచ్చు

ప్రకటనలు

19 thoughts on “‘జల్సా’ సినిమా సమీక్ష

 1. అమ్మా నవీన్,

  నేను భయపడి చచ్చా. ఏమిటీ నేనలా రాస్తే ఈయనిలా రాశాడని. కానీ తరచి, లోతుగా చూస్తే నువ్వు రాసిన దానికీ నేను అనుకున్నదానికీ మరీ అంత తేడాలు లేవని తెల్సింది.

  . నాకూ నమ్మబుద్ధి కాలా, నువ్వే చూడు.

  ఇవి నీకు నచ్చినవి:
  1) పవన్ నటన చాలా బాగుంది. చాలా హుషారుగా నటించాడు. బావోద్వేగాలు కూడా చాలా బాగా చూపించాడు.
  భావోద్వేగం బహుశా నక్సలైట్ డైలాగులేమో. అదొకటొ అరో సీన్లంతే కదా. సగం సినిమా అంతా తాగుతూ, తూలటమే కాబట్టి ఎక్కువ డైలాగులే లేవు. అసలు స్పష్టత లేదు డైలాగుల్లో. అయినా సరే, ఆయనకదే ఎక్కువంటే ఒప్పుకుంటా.

  2) సినిమాటోగ్రఫీ అదరహో. ముఖ్యంగా పోరాట దృశ్యాల్లో.

  కొత్తదనం ఏది, అదే కార్లలో ఈడ్చుకుపోయే పాత సీన్లే కదా. నిజంగా నివ్వెర పరచేవేవయినా ఉన్నాయా?

  3)హీరోయిన్లను పాటల్లో కానీ, సీన్లలో కానీ ఎక్కడా అసభ్యంగా చూపకపోవడం. పవన్ కళ్యాన్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయుడు. ఇతని సినిమాల్లో ఆడవారిని అసభ్యంగా చూపరు.

  ఇది ఒప్పుకుంటా మనస్పూర్తిగా.

  4)మాటలు కొన్ని బాగా నచ్చాయి.
  అంటే మహేష్ బాబు గొంతే కదా :-)

  ఆశ్చర్యం ఏమంటే కథ గానీ, సంగీతం గానీ బాగున్నాయని నువ్వూ చెప్పలా. అసలు సినిమాకి అవే కాదూ ప్రాణాలు :-)

 2. @వికటకవి గారు
  1) దామోదర్ రెడ్డిని జైలులో కలిసినప్పుడు, అతనికి “టన్నుల కొద్దీ భయం పుట్టిస్తా…” అని చెప్పినప్పుడు పవన్ చూపిన భావోద్వేగాలు ఎచ్చలెంట్. అలాంటి సన్నివేశాల్లో… పెద్ద గొంతేసుకొని అరచకుండా అంత బ్యాలెంస్డ్ నటన చూపడం అందరికీ అయ్యే పని కాదు. ఈ సన్నివేశంలో పవన్‌కు తప్పక మార్కులు పడతాయి.
  2) సినిమాటోగ్రఫీ నిజంగానే అదరహో. నవలల్లో వ్రాసేటప్పుడు…”షాడో కళ్ళ ముందర ఆ పది మంది గూండాలు తప్ప ఇంకేమీ కనబడటం లేదు” అని వ్రాస్తాం. ఇదే విషయాన్ని కేమెరాతో ఎలా చెప్పటం? గుడి దగ్గర పోరాట దృశ్యాల్లో బ్యాక్‌గ్రౌండంతా తెల్లగా చేసి, గూండాలను మాత్రం చూపడం అధ్బుతం. చివరిపోరాటాల్లో కూడా దామోదర్‌రెడ్డి తన కాలు చెయ్యి తెగిపోతుందేమో అన్న భయాన్ని కేమెరా చూపిన తీరు అమోఘం. ఇలాంటి కేమరా కవిత్వాన్ని అన్ని సినిమాల్లోనూ చూడలేం.
  ౩) ఒకే నిజాన్ని ఎన్ని సార్లు చెబుతాం? దేవిశ్రీ సంగీతం ఎప్పుడూ అదరహో :)
  కథ ఏముందని? అసలు నాలుగు కథలు కలిపి ఒక కథను తయారు చేసినట్టుంది. చెత్త స్క్రీన్‌ప్లే , అసలు కథను మింగేసింది.
  @Sunny
  NJoy :)

 3. ఈ సినిమా టికెట్స్ దొరకక నేను+ఫ్రెండ్స్ 10రూపాయల టికెట్ 50 ఇచ్చి చుసాము. నాకైతే దీనికి పావలా కూడా waste అనిపించింది. దరిద్రమైన సినిమా. ఇది అట్టర్ ఫ్లాపు సినిమా అందుకే దీనిని ఒక్కేసారి ఎక్కువ theatres లో release చేసారు కనీసం పెట్టుబడి రావాలని

 4. నేను కూడా (మస్కట్‌లో వచ్చింది) చూశానోచ్. అంత బిల్డప్ లేకపోతే సినిమా పరవాలేదు టైపు. సినిమాలో అంత మందు కొట్టుడు అవుసరం లేదు. అయినా త్రాగడానికి అవుసరం కావాలా? వాళ్ళిష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s