మంచి నీటి పొదుపునకు 10 చిట్కాలు


నీటి
చుక్క
విలువ
ఎంత?

నీటి చుక్క

బావిలో నుంచి నీళ్ళు తోడుకున్నంత?
నీళ్ళ మోటారు స్విచ్చి ఆన్ చేసినంత?
క్రెడిట్‌ కార్డులతో నీటి బిల్లులను చెల్లించేంత?
మునిసిపల్ ట్యాంకర్ల దగ్గర ఖాళీ బిందెలతో పోట్లాడుకునేంత?
రెండు రాష్ట్రాల మధ్య వైరమంత

తన కోసం చూసే రైతు గుండెలోని ఆశంత?
వేల కోట్ల జలయఙ్ఞమంత?
రోజు అంతా లోటా నీళ్ళతో గడిపేంత?

గుక్కెడు నీళ్ళ కోసం ప్రాణాలు తీసేంత?
దేవుని కన్నీరంత?
…ఇంతకూ నీటి విలువ ఎంత?

పదైదేళ్ళ ముందు మదనపల్లె ఎలా ఉండేది!! స్వర్గంలా ఉండేది కాదూ… పచ్చగా కళ కళలాడే పంటలు, ఎక్కడ త్రవ్వితే అక్కడ పడే నీళ్ళు, ఊరు చుట్టు పక్కల పెద్ద పెద్ద చెరువులు, ఎంత భగ భగలాడే ఎండాకాలంలో ఐనా చెమట పట్టని వాతావరణం, రెండు మూడు నెలలు ఒకటే వర్షాలు, వర్షాకాలంలో మినీ గోదావరిని తలపించే బహుదా కాలవ, అధ్భుతమైన చల్లటి వాతావరణం, రాయచోటి..చిత్తూర్లలో నీళ్ళు కొనుక్కుంటారంటా అని ఆశ్చర్యంగా చెప్పుకునే జనాలు, మురుగుకాలవలను శుభ్రం చెయ్యటాని వీధికో ట్యాంకరు నీళ్ళు ఉపయోగించే మునిసిపాలిటీ.

మరి ఇప్పుడో…

వేలకు వేలు అప్పు తెచ్చి వందల అడుగులు త్రవ్వినా బయటపడని నీటి చుక్క, కిలోమీటర్లు నడిచి..జనాలతో పోట్లాడితే..అతి కష్టం మీద దొరికే బిందె నీళ్ళు, కంటి మీద కునుకు లేకుండా అర్థతాత్రి ఐనా..మునిసిపల్ నీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కళ్ళు, కలుషితం ఐపోయిన ఉప్పు నీటినే వాడుతూ విధిలేక అనారోగ్యాన్ని ఆహ్వానించే అసహాయ జనాలు, ఒక బిందె నీళ్ళకోసం హత్య చేసే జనాలు, వేలకు వేలు పోసి కొనే వాటర్ ఫిల్‌టర్లు………………..

పదేళ్ళలో ఎంత మార్పు!!

పదైదేళ్ల ముందు మా ఇంట్లోనే ఇరవై మంది ఉండే వాళ్ళం, ఐనా నీటికి ఎప్పుడూ కట కట లేదు. ఇంట్లోనే బావి ఎప్పుడూ నీళ్ళతో నిండుగా ఉండేది. ఆ మాటకొస్తే చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంట్లోనూ ఒక బావిని చూడచ్చు (నదులు ఏవీ లేవు కదా :(). ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తే, డబ్బులుపెట్టి స్పెషల్‌గా నీళ్ళ ట్యాంకర్ తెప్పించాల్సిందే. ట్యాంకర్ నీళ్ళు 350రూపాయలు. మదనపల్లెలో ఇప్పుడిది లాభసాటి వ్యాపారం. పరిస్థుతులలో ఇంత విపరీతమైన మార్పులు జరిగినా, దీని గురించి జనాలు ఎందుకు ఆలోచించటం లేదో నాకు అర్థం కావటం లేదు. Who Moved my Cheese పుస్తకంలో చెప్పినట్టుగా ‘నీళ్ళు అనేది తరగని గని. మనం ఎంత వాడినా, ఎలా వాడినా, ఏమి చేసినా .. రేపటికి నీళ్ళు తప్పక ఉంటాయి‘ అన్న భ్రమలో ఉన్నారనుకుంటా అమాయక జనాలు. ముందంటే మనం పారబోసిన నీళ్ళు మళ్ళీ భూమిలో ఇంకి భూగర్భ జలాలల్లో కలిసేది. ఇప్పుడా పరిస్థితి లేదు…ఆవిరైన నీళ్ళు మళ్ళీ వర్షం రూపంలో రావటం లేదు. అందుకే కాసులు పోసి కొనుక్కుంటున్న నీళ్ళను ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాల్సిన రోజులొచ్చేశాయి. వేసవిలోనే కాదు, ఏ కాలంలో ఐనా..ఎప్పుడైనా నీటిని పొదుపుగా/సమర్థంగా వాడుకోవటం మన బాధ్యత. భవిష్యత్తులో నీరు బంగారం కన్నా విలువైనది అవుతుందేమో ఎవరికి తెలుసు.

ఇంట్లో నీళ్ళను పొదుపుగా వాడటానికి నాకు తెలిసిన చిట్కాలు కొన్ని పంచుకుంటున్నాను

 1. బచ్చల్లో నీళ్ళు తోడుకోవడానికి పెద్ద పెద్ద చెంబులు, మగ్గులూ కాక చిన్న మగ్గులు ఉపయోగించండి. పెద్ద మగ్గులో నీళ్ళు తీసుకున్నప్పుడు, అవసరమున్నా లేకున్నా అందులో మీగిలిన నీరంతా పారబొయ్యటం మనకు అలవాటే. చిన్నవి ఉపయోగించి చూడండి, ఆశ్చర్యంగా ఆ చిన్న మగ్గులోని నీరే చాలా అవసరాలకు సరిపోతుంది.
 2. ఇల్లు అలికిన మురికి నీళ్ళను, బట్టలుతికిన నీళ్ళను కాలువలో పారబోసే బదులు వాటిని మొక్కలకో, టాయ్‌లెట్లోనే పొయ్యచ్చు.
 3. స్నానం చెయ్యడానికి ఇక అందరూ షవర్‌బాత్ గురించి, తొట్టిలో నుంచి, అండా నుంచి నేరుగా పోసుకోవడం గురించి మరచిపోవడం మంచిది. ఒక బక్కెట్లో నీళ్ళు తోడుకొని, వాటితోనే స్నానం ముగించడం మంచిది. తలకు పోసుకోవడానికైతే ఇంకో అర బక్కెట్టు గ్రాంటెడ్. ఒక్క సారి షవర్‌బాత్‌లో ఉపయోగించే నీరు దాదాపు ముప్పయ్ బక్కెట్లు ఉంటుంది.
 4. లీకైయ్యే నీటి పైపులను, కొళాయిలను అశ్రద్ద చెయ్యక రిపేరు చేయించండి.
 5. కార్లు, బైకులూ కడగటానికి పైపుల ద్వారా కాక, బక్కెట్లో నీళ్ళు తెచ్చుకొని వాటితో కడగటం మంచిది. పైపులలో నుంచి ఎంత నీళ్ళు పోయినా, మనకు లెక్క తెలియదు. కార్లు కడగటానికి కూడా ఎదైనా డ్రై వాష్ పద్దతి ఉంటే బాగుండు :)
 6. మీ ఇంట్లో స్థలం ఉంటే తప్పక ఇంకుడు గుంటను త్రవ్వించండి (rainwater harvesting). వీలైతే మీ బచ్చల్లో నుంచి వచ్చే నీరును, ఈ గుంటలోకి మళ్ళించవచ్చు. దీని ద్వారా మీ ఇంట్లో నుంచి బయటకెళ్ళే నీరు మురికి కాలవలలో కలవక నేరుగా భూమిలోకే ఇంకిపోతాయి.
 7. కొళాయి పూర్తిగా తిప్పేస్తే మనకు అవసరమైనదానికన్నా ఎక్కువ నీళ్ళు వస్తాయి, కాబట్టి ఎప్పుడూ కొళాయి కొద్దిగా..అవసరమైనంత మాత్రమే తిప్పండి.
 8. మామూలుగా మనం భోజనం సమయంలో అవసరం ఉన్నా, లేకున్నా అందరికీ తలా ఒక లోట ఇచ్చి…అందులో నిండుకూ నీళ్ళు పోస్తాము. కొందరు భోజనం చేసేటప్పుడు అస్సలు నీళ్ళు త్రాగరు (నా లాగన్న మాట), అలా వారు వదిలేసిన నీళ్ళు పారేసే బదులు మొక్కలకు వాడవచ్చు.
 9. పళ్ళు తోముకునేటప్పుడో, పళ్ళాలు కడిగేటప్పుడో సింకు కొళాయిలో నీళ్ళు అలానే వదిలేయటం చాలా మందికి అలవాటు. నీళ్ళు వాడనప్పుడు వాటిని వృధా చెయ్యక, కొళాయిల్ని కట్టెయ్యండి.
 10. వాడినా వాడకున్నా రోజూ తువాలును (సౌకము), లుంగీ గట్రాలను ఉతికేదానికి వెయ్యటం మానుకోండి.

ఈ విషయంలో పాఠకులు తమ అనుభవాల నుంచి నేర్చుకున్న చిట్కాలు పంచుకోవచ్చు.


ఇలాంటివే మరిన్ని పూతరేక్స్:

ప్రకటనలు

16 thoughts on “మంచి నీటి పొదుపునకు 10 చిట్కాలు

 1. మంచి గమనికలు.
  స్వదేష్ సినిమా మొదటి సీనులో .. ఇకమీదట యుద్ధాలు నీటి వనరులకోసం జరుగుతా యంటాడు. దాని సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. అసలే నీటి యెద్దడి ఉన్న చోట్ల మెగా సాఫ్టు డ్రింకు బాటిలింగ్ ప్లాంట్లు పెట్టిన సందర్భాల్లో ప్రజలు ఉద్యమిస్తున్నారు.

 2. నిజమే, మాది వాయల్పాడు. ఈ పరిణామాలకు నేను కూడా సాక్షినే.
  మనం మన చిట్కాల ప్రయత్నం తో పాటు “వాటర్ షెడ్” వంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టమని రాజకీయనాయకులకి చెప్పాలి. లేక పోతే, చల్లటి మదనపల్లె ఇక లేనట్టే!

 3. 1. వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా చేసేది ఒక చెంబుడు నీళ్ళతో ముఖం కడుక్కోవడం, దానిబదులు ఒక చేతిరుమాలుని నీటిలో తడిపి వాడితే ముఖంతో పాటు చేతులు, ఒళ్ళు కూడా తడుపుకోవచ్చు.
  2. అదే రుమాలుని ముక్కు మీదుగా చెవులవెనుకకు కట్టుకుంటే వడగాలి నుండి చల్లని రక్షణ లభిస్తుంది.
  3. తాగే నీటిదగ్గర పొదుపుండకూడదు అని వినికిడి కానీ కారం తిండి లేదా కూర తింతున్నప్పుడు పొరపాటున పచ్చి మిరప తొంటే, ఆ మంట చల్లారడానికి ఎన్ని గ్లాసుల నీళ్ళు తాగుతాం. ఆ విషయం లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు కొన్ని గ్లాసుల మంచినీటిని పొదుపుచేయవచ్చు.
  4. అలాగే బిందెల దగ్గర చిన్న గ్లాసులు మాత్రమే అందుబాటులో ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే.
  5. హృదయపూర్వకంగానే మనకి నీళ్ళని సంరక్షించాలని ఉంటే మనం చేయాల్సిన మొట్టమొదటిపని కూల్‍డ్రింక్స్ మానెయ్యడం లేదా తగ్గించుకోవడం ఎందుకంటే త్రాగే నీటిని బాతిలింగ్ ప్లంటులు ఎలా తన్నుకుపోతున్నాయో నవీన్ గారు పైన చెప్పారు. (కేవలం చెప్పడం కాదు నేను గత 6 ఏళ్ళ నుండీ కూల్‍డ్రింక్స్ తగ్గించాను, ఎంతంటే గత 2 సంవత్సరాలలో నేను తాగిన సాఫ్ట్ కూల్‍డ్రింక్ మహాఅయితే ఓ లీటర్ అదికూడా ఆఫీసు మీటింగుల్లో చప్పరిస్తుంటాను)
  6. ఈ వేసవిలో కూరలని ఫ్రై చేయడం మాని ఉడికించి తినండి.

  ఇంకా ఎన్నెన్నో… ఆచరించే ఓపిక, చిత్తశుద్ధీ ఉండాలి గానీ..

 4. @మహేష్ గారు,
  వాటర్ షెడ్‌ అని పత్రికల్లో చదవటం తప్పితే అదంటే ఏమిటో తెలియదు నాకు. అదేమిటో కాస్త చెబుదురూ!!
  @చక్స్ గారు,
  >> తాగే నీటిదగ్గర పొదుపుండకూడదు అని వినికిడి
  ఇది నిజమే కదా. మంచి నీరు రోజు రోజుకూ అమూల్యము ఐపోతోంది. రేపు మీకు ఇంత మంచి నీరు దొరుకుతుందో లేదో…ఈ రోజే కడుపారా నాలుగైదు లీటర్ల నీళ్ళు త్రాగండి.
  నేను ఈ నాలుగు సంవత్సరాలలో నాలుగు కూల్‌డ్రింకులు కూడా త్రాగి ఉండను :)
  @కొత్తపాళీ గారు,
  >> దాని సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి
  నిన్న మధ్యప్రెదేశ్‌లో బిందె నీళ్ళు అదనంగా ఇవ్వనందుకు బావి యజమానిని హత్యచేశారంట :( . CNN-IBNలో చూపించాడు ఈ ఘోరాన్ని.
  @cbraoగారు, sumaగారు
  నెనర్లు

 5. వాటర్ షెడ్ డెవలెప్మెంట్ అనేది మట్టిలోని తేమని కాపాడి, భూగర్భ జలాన్ని పెంపొందించడానికి సాంకేతికపరంగా భూమికి చేసే చికిత్స (treatment). సాధారణంగా ‘నీరు పల్లమెరుగు’ కాబట్టి, ఒక ప్రదేశం లో వర్షం రూపంలో నీరు పడినప్పుడు ప్రవాహంగా లోతట్టుకు చేరి సాధారణంగా వృధా అయిపోతూఉంటుంది. ఇలా కాకుండా, ఎక్కడికక్కడ నీటిని ఆపి దాన్ని భూమిలో ఇంకిపోయాలా చేస్తే? అన్న ఆలోచనకు సమాధానమే ‘వాటర్ షెడ్’.

 6. మదనపల్లెలో నీటికి కటకటా?!! అదొక్ భూతల స్వర్గమని విన్నా,కొన్ని సినిమాల్లో చూసా..
  మంచి రచన,మంచి సూచనలు

  నవీన్ గారు పొదుపునకు అని రాయండి ఇకముందు పు తర్వాత కు కు బదులుగా నకు అని

 7. @రాజేంద్ర గారు,
  మీరు చెప్పినట్లే శీర్షికను సరిదిద్దాను. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ‘పొదుపుకు’ అని అంటాం కదా. ఇది వ్యాకరణ రీత్యా ఎలా తప్పౌతుందో తెలుసుకోవాలనుంది.

  @మహేష్ గారు
  కొత్త విషయం చెప్పారు. థ్యాంక్స్.

 8. నవీన్ గారు

  నీటి విలువ గురించి బాగానే వివరించారు. కానీ, మీ సలహాలలో సరైన పరిణితి లేదు. మనకి నీరు ఎందుకు అవసరం అవుతోంది ? ఎక్కువ భాగం నీటిని మనం వేటికి ఉపయోగిస్తున్నాం ?

  స్నాహ్నం చెయ్యడానికి, తాగడానికి అయితే నీళ్ళు నిక్షేపంగా ఉంటాయి. దీనికి కరువు లేదు ! సరఫరాలో ప్రభుత్వం లోపాలు అంతే. వీటి గురించి మనకు బెంగ అవసరం లేదు. దప్పికతో జనాలు చచ్చిపోయేటంత నీటికరువు మనకి లేదు.

  కానీ, నీళ్ళతో నిజమైన సమస్య ఒకటి ఉంది. ఏమిటి అంటే, వ్యవసాయానికి సరిపడేటన్ని నీళ్ళు మనకి లభ్యంగా లేవు. జనాభా పెరగడంతో ఆహార అవసరాలు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా సేద్యపు నీరు అవసరం విపరీతంగా పెరుగుతోంది. మంచినీటిలో అత్యధికభాగం తరలిపోయేది వ్యవసాయానికే (ఇంచుమించు 80%). ఈ నీటిని వృధా కాకుండా అరికట్టాలి. అంటే, నీటి కాలువలు సమంగా తవ్వాలి, వృధాగా సముద్రంలో నీరు కలవకూడదు. దేశంలో మంచినీరు సరఫరాలోనే 60% మాయమయిపోతోంది. దీనిని అరికట్టాలి.

  డ్రిప్ ఇర్రిగేషన్ పద్ధతులు పాటించాలి.

  నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలని తగ్గించాలి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వరి లాంటి పంటలను పెంచకూడదు. మాంసాహారం తినడం తగ్గించాలి. (మాంసం తయారీకి శాకాహారం కంటా 15 రెట్లు ఎక్కువ నీరు అవసరం అవుతుంది).

  మరిన్ని వివరాలు నా బ్లాగులో.

 9. చాలా సార్లు అసలు వ్యాసంలోనే కాకుండా వ్యాఖ్యలలో కూడా అద్భుతమైన సమాచారం దొరుకుతుంది. అలాగే ఇక్కడ వ్యాఖ్యాతలు పంచుకున్న అనుభవాలు చిట్కాలు కూడా చాలా బాగున్నాయి.
  @కిరణ్ గారు
  ఈ చిట్కాల పరిధి ఒక ఇంటికి పరిమితం, మరియు ఒక మనిషిగా చేయదగ్గది. మీరు ఇచ్చిన సలహాలు, సమాచారం బాగుంది.
  >> దప్పికతో జనాలు చచ్చిపోయేటంత నీటికరువు మనకి లేదు.
  ఇది నిజం కాదు. రెండు నెలల క్రింతం, ఒక వ్యక్తి తనకు ఒక బిందె మంచి నీళ్ళు ఇవ్వనన్నందుకు హత్య చేశాడంట. అక్కడ నీటి లభ్యత ఎంత హీనంగా ఉండకపోతే అంత పని చేస్తాడు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో అడిగినా తెలుస్తుంది, మంచి నీటికి ఎంత తపిస్తారో. మంచి నీరు కరువే లేకపోతే ఆక్వాగార్డ్, కెంట్ లాంటి ఇరవై, ముప్పై కంపెనీలు కోట్లలో తమ వ్యాపారాన్ని ఈ దేశంలో ఎలా విస్తరించాయి? ఇదంతా కాదు కానీ, మదనపల్లెలో మునిసిపల్ ట్యాంకర్లు మూడు రోజులకు ఒక సారి వస్తాయి. పది ఇండ్లకు ఒక ట్యాంకు వస్తుంది. దొరికినోడికి దొరికినంత అని నీళ్ళు పట్టుకుంటే ఓ ఇరవై ముప్పై బిందెలొస్తాయి. వాటితోనే మూడు రోజులు నెట్టుకు రావాలి. అవే మంచి నీళ్ళు, అవే స్నానం చేసే నీళ్ళు. ఒకే సారి పది మంది బంధువులొస్తే, మంచి నీళ్లకు ఎలారా దేవుడా ని ఆలోచన వస్తుంది. నా వరకైతే, మూడువందలు పెట్టి ఎక్కడో ఉన్న కొత్తపల్లి నుంచి ట్యాంకు తెప్పించుకో గలను. యాభై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొనగలను. మరి మా వీధి చివరున్న బక్కప్రాణీ అంత పెట్టగలడా? ఆరు మంది మూడు రోజుల పాటు ఆ ఇరవై బిందెలతోనే సర్ధుకోవాలి. ఈ సిటీలల్లో ఐతే ఏ కావేరి నుంచో, నాగార్జున సాగర్ నుంచో నీళ్ళు తెచ్చిచ్చేస్తారు? మరి ఏ నదీ లేని మా చిత్తూరు జిల్లా సంగతో? అసలు నదంటూ ఉంటే కదా కాలవలు సమాంతరంగా తవ్వడానికి..వ్యవసాయానికి నీళ్ళు మళ్ళించడానికి. ఉన్నా ప్రాజెక్టులు ఎప్పటీకి పూర్తయ్యేనూ. ఇలా చెబుతూ పోతే వెయ్యిలైన్లయిలా చాలదు జనాల నీటి కడగండ్ల గురించి మాట్లాడటానికి. నిజంగానే చచ్చిపోయేటంత నీటికరువు మనకి వచ్చేస్తోంది.
  ఒక మంచి నీటి చుక్క విలువ తెలిసిన వాడిగా నాకు ఈ వ్యాఖలలో వ్రాసిన అందరి సలహాలూ బాగా నచ్చాయి…చక్స్ గారి చిట్కాలతో సహా.

 10. కిరణ్ గారూ, మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ వీటిని ఆచరింప చెయడం ప్రభుత్వం చెతిలొ ఉంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఏదైనా చేస్తే, ఆల్ హ్యపీస్…

  నవీన్ చెప్పినవి ప్రభుత్వం తో పని లెకుండా ఎవ్వరైనా చేయొచ్చు.

  ఆల్ హ్యపీస్…
  ( http://gsashok.wordpress.com )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s