పరుగు సినిమా సమీక్ష

హల్లల్లో నవీన్..ఎలా ఉన్నావ్?
బ్రహ్మాండంగా ఉన్నాను.

వారాంతం ఏమి చేశావ్?

వారాంతంలో నేను త్….

తినడం పడుకోవడం టీవీ చూడటం తప్పించి ఇకేవన్నా చేశావా అని నా ఉద్దేశం!!

:) రెండు తెలుగు సినిమాలు చూశాను, అదీ ధియేటరుకు వెళ్ళి

ధైర్యవంతుడివే…అందులో కంత్రీ సినిమా ఉంది ..కరెక్టేనా?
శుద్ద తప్పు. రివ్యూలు చదవకుండా తెలుగు సినిమాకు వెళ్ళడమా..నోవే..

సరే నువ్వే చెప్పు ఏమేమి సినిమాలో.

శనివారమేమో పరుగు సినిమాకు వెళ్ళా, ఆదివారమేమో బొబ్రచసి సినిమాకెళ్ళాను

ఏబ్రాసి లాగా ‘బొబ్రచసి‌’ ఏమిటి … తెలుగు సినిమా పేర్లు ఇలా కూడా వస్తున్నాయా..ఈ మధ్యన?

అమాయకుడా…నువ్వు హిందీ చిత్రాలు ఫాలో కావనుకుంటా. ‘బొబ్రచసి‌’ అంటే బొమ్మానా బ్రదర్స్ చందనా సిస్టర్స్.

ఓహో అదా సంగతి. పరుగు సినిమా ఎలా ఉంది?

పర్లేసు…తల నొప్పైతే రాదు.

అసలు మీ ఊర్లో అన్ని తెలుగు సినిమాలు ఆడుతూండగా, పరుగే ఎందుకు వెళ్ళాలనుకున్నావు?

మూడు కారణాలు
1) హీరోను అనుకొని కథ అభివృద్ది చేసిన సినిమా కాదిది. కథ అనుకొని నటులను ఎంపిక చేసిన సినిమా ఇది.
2) లేచిపోయిన కూతురు గురించి తండ్రి పడే వేధన చూపాడన్నారు…సరే కథా బలం గల సినిమా కదా అనిపించింది.
3) ఇది మామూలుగా వచ్చే తెల్ల చొక్కాలు, వంద సుమోలు, ఢిష్యుం ఢిష్యుం సినిమా కాదు.

పదో తరగతిలో ఐదు మార్కుల ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు చెప్పారు…బాగుంది. ఇక సినిమా విశేషాలేమైనా చెబుతారా?

ఆకాశంలోని నక్షత్రాలు, భారతీయ సినిమాలోని ప్రేమ కథలు ఎవ్వరూ లెక్కపెట్టలేరు. ప్రేమ , ప్రేమ అండ్ కో., ప్రేమ ఎంతమధురం, ప్రేమ కధ, ప్రేమ కానుక, ప్రేమ కిరీటం, ప్రేమ కోసం, ప్రేమ ఖైదీ, ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం, ప్రేమ చేసిన పెళ్ళి, ప్రేమ జీవులు, ప్రేమ తపస్సు, ప్రేమ దీపాలు, ప్రేమ నక్షత్రం, ప్రేమ నాటకం, ప్రేమ పంజరం, ప్రేమ పల్లకి, ప్రేమ పిచ్చోళ్ళు, ప్రేమ ప్రయాణం, ప్రేమ బంధం, ప్రేమ మందిరం, ప్రేమ మూర్తులు, ప్రేమ యుద్ధం, ప్రేమ విజేత, ప్రేమ సంకెళ్ళు, ప్రేమ సామ్రాట్, ప్రేమ సింహాసనం, ప్రేమ-పగ, ప్రేమంటే ఇదేరా, ప్రేమకానుక, ప్రేమకు వేళాయెరా, ప్రేమతరంగాలు, ప్రేమద్రోహి, ప్రేమనగర్, ప్రేమపుస్తకం, ప్రేమలు – పెళ్ళిళ్ళు, ప్రేమలేఖలు , ప్రేమలో ప్రమాదం, ప్రేమవిజయం, ప్రేమశిఖరం, ప్రేమాభిషేకం, ప్రేమాయణం, ప్రేమించానునిన్నే, ప్రేమించి చూడు , ప్రేమించి పెళ్ళి చేసుకో, ప్రేమించిచూడు, ప్రేమించు పెళ్ళాడు, ప్రేమించుకుందాం రా, ప్రేమించేది ఎందుకమ్మా, ప్రేమించేమనసు, ప్రేమే దైవం, ప్రేమేనాప్రాణం, ప్రేయసి రావే, ప్రేమ చరిత్ర……………..లాంటి సినిమాలు వేరైనా కథ ఒక్కటే.

(నీరసంగా…) ఉపోద్ఘాతంలోనే ఊరంతా తిప్పించావు, అసలు కథ ఎప్పుడు చెబుతావు నాయనా!!
మధ్యలో పుల్లలెయ్యకుండా చెప్పేది విను ముందు…

చెప్పు…అడిగాక తప్పుతుందా.

ఈ పరుగు సినిమా కూడా అదే ప్రేమ కధే, కాకుంటే ఇది ఓ తండ్రి కోణం లో నుంచి చూపిన కథ. సాధారణంగా ప్రేమ కథల్లో మొదట హీరో హీరోయిన్ల పరిచయం, పరిచయం ప్రేమగా మారటం, ఆ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటం లేదా పరిస్థితులు అనుకూలించకపోవటం, దాంతో హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ కథానాయకుడు కథానాయికను స్నేహితుల సాయంతో లేపుకెళ్ళిపోవడం చూపుతారు (జయం సినిమా గుర్తుందా?). లేచిపోయిన జంట మీద సానుభూతి సంపాదించడానికి కథానాయికను పెళ్ళీ చేసుకోబోయే పెళ్ళికొడుకు మహాక్రూరుడో, దుర్గుణ సంపన్నుడిగానో చూపుతారు. కానీ నిజ జీవితంలో ఇలాంటి విలన్లు
అరుదు. రుక్మిణీ కళ్యాణం సినిమాల నాటి నుంచి ఇలాంటి సన్నివేశాలను చూసి చూసి ప్రేక్షకులకు….. లేచ్‌పోవటం మరీ అంత బ్యాడేమీ కాదు, పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోతే పాపం పసి ప్రేమికులు ఏమి చేస్తారు మరి, ప్రేమను గెలుచుకోవటం ప్రేమికుల కర్తవ్యం, ప్రేమే జీవితం లాంటి భావాలు ప్రేక్షకుల స్మృతిలో నిలచిపోయాయి. నిజ జీవితంలో సినిమా జనాలతో సహా చాలా మందికి స్పూర్థిని ఇచ్చాయి కూడా. నాగార్జున నటించిన ‘సంతోషం’లాంటి కొన్ని సినిమాలు మాత్రం ఒక జంట లేచిపోవటం ఆ జంట సమస్య కాదని, అది రెండు కుటుంబాల గౌరవం సమస్యని సున్నితంగా చూపాయి.

(చప్పట్లు కొడుతూ) శభాష్…నువ్వొద్దని పుల్లెయ్యకుండా ఉండలేకపోతున్నా… నీ ఉపన్యాసం బాగుంది కానీ, అసలు పరుగు సినిమా కథ చెప్పవయ్యా బాబూ.
చూడు మిష్టర్…ఐ విల్ సీ మూవీ విథ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వాట్ మెస్సేజ్ హీ ఈస్ కన్వేయింగ్. సో ఎక్స్‌ప్లైనింగ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ ఆర్ నెసెస్సరీ బిఫోర్ ఐ టెల్ యూ ద వొరిజిన పరుగు స్టోరీ…వోఖే? వైదివే యూకెన్ హ్యావ్ దిస్ కూల్ డ్రింక్స్ మీన్ వైల్ యూ లిజన్ టు మై లెక్చర్.

నీ అబ్జర్వేషన్స్ మడిచి…టపా చివర్లో పెట్టుకో. ఇప్పుడు కథ చెప్పు.
వోఖే…యాజ్ యూ లైక్.

ధ్యాంక్స్….కథ మొదలు పెట్టబోతున్నందుకు మరియి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేసునందుకూనూ…
అనగనగా ఓ పల్లె‌లో ఓ ప్రకాష్‌రాజ్. ప్రకాష్‌రాజ్ అంటే సన్నా బన్నా మనిషా…ఆ ఊరికే పెదరాయుడన్న మాట. భార్య అందమైన ఇద్దరు కూతుర్లుని ఇచ్చి చనిపోయింది. పెద్ద కూతురు పెళ్ళి సీనే సినిమాలో మొదటి సీనన్న మాట. లైట్లు, తోరణాలతో అలంకరింపబడిన పెళ్ళి ఇళ్ళంతా జోకులేసుకుంటున్న స్నేహితులతో, ఎర్పాట్లు చూస్తున్న బంధువులతో హడావుడిగా ఉంటుంది. ప్రకాష్‌రాజ్ పెద్ద కూతురు, ఇప్పుడు పెళ్ళి కూతురు ఐన పూనమ్ బాజ్వా గౌరీ పూజ చేసి చీర మార్చుకోవడానికని వెళ్ళి అట్నుంచి అటే ఓ పేద హ్యాండ్సమ్ గైతో పరారయిపోతుంది. ఈ వార్త విని హతాశ్యుడైన తండ్రి హడావుడిగా రైల్వేస్టేషన్లను గాలించినా లాభముండదు. అప్పటికే ప్రేమికుల జంట జంప్‌ అన్న మాట. ఆ జంపైపోయింది కూడా అదే ఊరికి చెందిన బాబూ అన్న కుర్రాడితో అని తెలుస్తుంది. ఆ జంటెక్కడుందో కనుక్కోవడానికి బాబు స్నేహితుల్నంతా తన్ని తీసుకొస్తారు. ఆ జంటెక్కడ ఉందో చెప్పమని ఓ స్టోర్రూములో బంధిస్తారు. ఆ బంధింపబడిన వారిలో ఒకడు మన హీరో(?) అల్లూ అర్జున్. మరుసటి రోజు తెల్లవారే స్నేహితులంతా పారిపోవాలని చూస్తారు. ఆ పారిపోయే మార్గంలో మన అల్లూకి ప్రకాస్‌రాజ్ రెండో కూతురు షీలా పొగమంచులో నడుకొంటూ, చలికి వణుకుతూ శాలువాతో యువరాణిలా కనిపిస్తుంది. అంతే..అప్పటి దాకా ఒకటే పరిగెత్తిన హీరో కాళ్ళకు బ్రేక్స్. మళ్ళా తనను బంధించిన చోటుకు వచ్చేసి, తన యువరాణి సాక్షాత్కారం పొందేంత వరకూ అక్కడ నుండి కదలకూడదనుకుంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా పూనం బాజ్వా – బాబు జంట వ్రాసుకున్న ఉత్తరాలు అర్జున్ చేతిలో పడతాయి. అందులో షీలాకు సంబంధించిన సమాచారం ఉండటంతో, తనను అనుమానించి అక్క లేచిపోవాటానికి సహాయం చేసింది తనే అనుకుంటారని షీలా భయపడుతుంది. అర్జున్ దగ్గరున్న ఆ ఉత్తరాలు ఆమె తిరిగి లాక్కోవటం ఓ ప్రసహనం. ఈ క్రమంలో పెద్ద కూతురు లేచిపోవటానికి సహాయం చేసింది మన అల్లూ అర్జున్ అని ప్రకాస్‌రాజ్‌కి తెలిసిపోతుంది. అక్కడి నుంచి ‘నా కూతురెక్కడ ఉందిరా చెప్పరా బాబూ’ అని ప్రకాష్‌రాజ్ అర్జున్‌ను బ్రతిమాలుకోవటం, ‘వాళ్ళేదో లేచిపోయి ఆనందంగా ఉంటే మధ్యలో నీ గోలేంటి’
అని అర్జున్. చేసింది చాలక చిన్న కూతురుని కూడా ప్రేమించేటట్టు చేసి, ఆమెను కూడా లేపుకెళ్ళిపోయే ప్రయత్నం. అసలు తండ్రి లేచిపోయిన కూతురు జాడ తెలుసుకున్నాడా? పెద్ద కూతురు పరిస్థితి ఏంటి? షీలా అర్జుజ్‌ను ప్రేమించిందా? వారి ప్రేమను ఆమె తండ్రి ఆమోదించాడా? లేక వాళ్ళు లేచిపోయారా? అర్జున్ తన తప్పు తెలుసుకున్నాడా అన్నది మిగిలిన కథ.

భేతాళ కథలో లాగా చివర్లో ఆ ప్రశ్నలేంటి? ఆ క్లయిమాక్సు ఏదో కాస్త చెప్పరా బాబూ.

కథలో ఎస్సెన్సు మరియు సస్పెన్సు కూడా చెప్పిన్నట్లౌతుందని సందేహించా…సరే నీకోసం క్లుప్తంగా చెప్తా. ప్రకాష్‌రాజ్ పెద్దకూతురుని హైదరాబాదులో కలుసుకుంటాడు, కూతురేమో ప్రియుడి చెయ్యి పట్టుకొని “నా దారి నేను చూసుకున్న తరువాత కూడా నన్ను కుక్కలా వెంబడిస్తావేం” అని కసురుకుంటుంది. మనసు విరిగి పల్లెకు తిరిగి వచ్చేస్తాడు తండ్రి. కనీసం చిన్న కూతురు కైనా పెళ్ళి చేసి ముచ్చట తీర్చుకుందాం అని అనుకుంటాడు. ఇంతలో హీరో హీరోయిన్ను ప్రేమించుకుంటున్నారని తెలిసి ట్రూ రిపెంటెన్సు కలగడం చేత … తూచ్ ఈ పెళ్ళి క్యాన్సిల్ అనేసి…అర్జున్ చేతిలో చిన్న కూతురి చెయ్యి పెట్టేస్తాడు.

ఒక్క నిముషం…చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి నాకు. ఈ కథలో తప్పెవ్వరు చేశారు? ఎవరు తప్పు దిద్దుకున్నారు? అసలు కథ చెప్పదలుచుకున్నదేమిటి? లేచిపోవడం తప్పనా లేక బిడ్డలు ఎప్పుడు లేచిపోతారో కనుక్కొని దానికి ముందే వారికి పెళ్ళి చేసెయ్యాలనా? అంతా తిక మకగా ఉంది.
వురేయ్…కథ విన్న నీకే ఇన్ని సందేహాలొస్తే…నలభై రూపాయలు పెట్టి ధియటర్లో సినిమా చూసిన నాకు ఎన్ని సందేహాలు వచ్చుండాలి

సందేహాలది ఏముంది కానీ … ఈ విషయంలో నీ అభిప్రాయమిటో చెప్పు?

లేచిపోవటం గురించి లెక్చరిచ్చేంత లెవల్లో నేను లేను కానీ…ఇంకో మాటడుగు.

సినిమాలో ఇంకేమి నచ్చాయి నీకు?
1) ముందే చెప్పినట్లు రొడ్దకొట్టుడు మాఫియానో ఫ్యాక్షన్ కథ కాక, భావావేశాలకు అవకాశం ఉన్న కథ
2) రెండు పాటలు చిత్రీకరణ బాగుంది
3) కూతురు లేచిపోయిందన్న బాధతో ప్రకాష్‌రాజ్ చిత్తుగా తాగేసి, అల్లు అర్జున్‌తో తన కూతుర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పే సన్నివేశం అధ్బుతం. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు ఉన్నా సినిమా ఇంకా బలంగా నిలబడేది.
4) “ఉద్యోగం లేకుండా, జేబులో రెండు వేలు కూడా లేకుండా పారిపోయి కాపురం ఎలా పెడతార్రా” అని ప్రకాష్ రాజ్ అర్జున్‌ను నిలవదీసే సన్నివేశం బాగుంది
5) ఆర్య సమాజంలో అల్లు అర్జున్,ఆలి, ప్రకాష్‌రాజ్ ల మధ్య నడిచే సన్నివేశం చిరంజీవి కూతురు-శిరీష్‌లను గుర్తు తెస్తుంది
6) ఓ సి-గ్రేడ్ చెత్త లాడ్జిలో కూతురు పదైదు రోజులు తన ప్రియుడితో ఉందని తెలిసిన సన్నివేశంలో ప్రకాష్‌రాజ్ నటన

సినిమాలో నచ్చనిదేమిటి?
1) సినిమా మొదటి నుంచే అల్లూ అర్జున్ విలన్ లాగా, ప్రకాష్‌రాజ్ కథానాయకుడిగా అనిపించాడు. ప్రేమ జంటని లేచిపొమ్మని ప్రోత్సాహం ఇవ్వడం సహాయం చెయ్యడం తప్పితే వేరే పని ఏదీ లేనట్టుంది హీరోగారికి.
2) షీలా అల్లూ అర్జున్‌ను హఠాత్తుగా ఎందుకు ప్రేమించడం మొదలుపెట్టిందో ప్రేక్షకుడికి అర్థం కాదు.
3) కొన్ని పాటలు సందర్భం లేకుండా ఇరికించినట్లు అనిపించింది
4) క్లైమాక్స్ నాకైతే ఏమర్థం కాలేదు. పిల్లలు లేచిపోతే బాధ పడే పెద్దల కథో లేక ప్రేమించినవాళ్ళని పెద్దవాళ్ళు ఆదరించాలి అనే కధో స్పష్టం కాకుండా పోయింది. ఇది భాస్కర్ చేసిన అతిపెద్ద తప్పిదం.
5) ఈ మధ్య సినిమాలలో కథ తక్కువ కథనం ఎక్కువ అయ్యింది. ఇలా సినిమాలు తీయటం ఎంత రిస్కో మొన్న ‘కొండవీటి దొంగ’ సినిమా చూస్తే అర్థం అయ్యింది. ఈ సినిమాలో కథ ఒక్క నిముషం కూడా ఆగక చక చక పరుగులు తీస్తూ ప్రేక్షకులను ఆలరిస్తుంది. నవతరం దర్శకులు కొత్త సినిమా తీసే ముందు ఇలాంటి పాత సినిమాలు ఇంకో సారి చూస్తే మంచిది

ఇంకేంటి విశేషాలు?
1) మొదటి సినిమాతో సూపర్‌హిట్టు కొట్టిన దర్శకుల రెండో సినిమా ఫట్ అనే నానుడికి భాస్కర్ మరింత బలం చేకూర్చాడు. కాకుంటే రాజమౌళీ ఇందుకు అతీతుడు.
2) ఈ సినిమాతో తన కెరీర్‌ గాడిలో పడుతుందన్న షీలా ఆసలు అడియాసలయ్యాయి
3) అల్లూ అర్జున్ చాలా బాగా నటించాడు, అవార్డు వస్తుంది అనే వాళ్ళు, పాత చిరంజీవి సినిమాలు చూసి అసలు నటన అనగా ఏమి అని తెలుసుకోవచ్చు.
4) నిర్మాత ‘దిల్’రాజుకు మున్నా తరువాత ఇంకో నిరాశాజనక ఫలితం
5) ఓ పాటలో అర్జున్ డ్యాన్సులను ఇరగదీశాడు
ఇంకేనా గుర్తొస్తే చెబుతాలే

హమ్మయ్య…మొత్తానికి ఒక సినిమా గురించి చెప్పావు…బొబ్రచసి గురించి చెప్పు..
ఇప్పటికే ఎక్కువైంది. దాని గురించి రేపు చెబుతాలే… ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆ సినిమాను ధర్మవరపు సుబ్రమణ్యం కోసం చూడాలి. కృష్ణ భగవాన్, కోవై సరళా, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్యం లాంటి హాస్య చక్రవర్తులు కొన్ని సన్ని వేశాల్లో ఇరగదీశారు. పిల్లలతో వెళ్ళడం మంచిది కాదు.
(సశేషం)


ఇలాంటివే మరిన్ని సినిమా విశేషాలు:

1) ‘జల్సా’ సినిమా సమీక్ష
2) వామ్మో… ఆపదమొక్కులవాడు
3) అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే…..

ప్రకటనలు

23 thoughts on “పరుగు సినిమా సమీక్ష

  1. నవతరం దర్శకులని పాత సినిమాలు చూడమంటున్నారు.. అది చూస్తే, ఇంకేముంది. మన కధ కంటే ఇదే బావుంది అని మళ్ళీ దాన్నే రీమేక్ చేసేస్తారు… ఇప్పుడు వచ్చేవాళ్ళలో చాలా మంది, ఎంత తొందరగా హిట్ కొట్టేద్దామా అనుకుంటున్నారు తప్ప, దానికి సరైన పధ్ధతిలో మాత్రం వెళ్ళట్లేదు..

  2. ఈ సినిమా రివ్యూ వ్రాసిన కొన్ని గంటలకే CNN-IBNలో ఈ వార్త చదవాల్సి వచ్చింది:

    http://www.ibnlive.com/news/armyman-shoots-daughter-for-marrying-lover/65163-3.html?xml

    ఈ సినిమాలో లాగానే, తండ్రి అనుమతి లేకుండా ప్రియుడిని పెళ్ళాడినందుకు, కన్న తండ్రే కూతురుని కాల్చి చంపేశాడంట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s