‘రెడీ’ సినిమా సమీక్ష

దాదాపు రోజూ…మా కంపెనీ క్యాంటీన్లో సాయంకాలం ఉపాహారం తిందామని వెళ్తాను. అక్కడ చూస్తే మెనూలో పానీ పూరీ, మసాలా పూరీ, సమోసా ఛాట్, కట్లెట్ ఛాట్…వగైరా వగైరా అని వ్రాసుంటాయ్. పానీ పూరీ అంటే పూరీలను నలపడు, మసాలా పూరీ ఐతే పూరీలను నలుపుతాడు, దహీపూరీ అంటే పానీపూరీలో పానీ బదులు పెరుగు పోస్తాడు, ఇక గ్రేవీలో సమోసా నలిపితే సమోసా ఛాట్, కట్లేట్ నలిపితే కట్లెట్ ఛాట్, నన్ను నలిపితే నవీన్ ఛాట్. ఇలా పై పదార్దాలు మారినా అందులో ఉన్న పూరీలూ…గ్రేవీ ఒక్కటే, తేడా యేం లేదు. ఇలా నటులు…డైరక్టర్లు మారినా మన తెలుగు సినిమా కథ ఒక్కటే అన్నట్టు తయారైంది. ఐనా తెలుగు సినిమాలు అందులోని కథలు అన్న విషయం మీద నా ఏడుపు ఇక్కడెందుకు కానీ, అసలు విషమైన ‘రెడీ’ సినిమా సమీక్షకొద్దాం. ఈ సినిమా కథ చెబితే మీకు గుడుంబా శంకర్, ఆట, ఢీ, దిల్, కృష్ణ, వినోదం, సీమ శాస్త్రి లాంటి సినిమాలు గుర్తుకు రావటం సహజం. కానీ ఖచ్చితంగా ఏ సినిమా ప్రభావం దీని మీద ఉంది అంటే చెప్పలేం, కథను పోల్చలేకుండా కుట్టాడు శ్రీనూ వైట్ల.

కథేంటంటే…

మన హీరో చందు (రామ్) ధనవంతులైన ముగ్గరు (నాజర్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్) అన్నదమ్ముల ఏకైక వారసుడు. చాలా సినిమాల్లో హీరోలకున్నట్టే, ప్రేమికులకు రిజిస్టార్ ఆఫీసులో పెళ్ళి చేసే అలవాటు ఇతనికుంటుంది. ఒక సారి పెళ్ళిమండపంలో నుంచి మరదలైన తమన్నాను(హ్యాపీ డేస్ పిల్ల)తీసుకొచ్చేసి ఆమె ప్రియుడు (నవదీప్)తో రిజిస్టార్ ఆఫీసులో పెళ్ళి చేసేస్తాడు. ఈ విషయం తెలిసి ఇంట్లో పెద్దలు…బయటకు ఫో అంటారు. కుక్క తోక వంకర అన్నట్టు బుద్ది మారని మన ‘రామ్’ ఇంకో స్నేహితుడికి కూడా ఇలానే పెళ్ళి చెయ్యాలని కళ్యాణ మంటపానికి వెళ్ళి పెళ్ళికూతురును (జెనీలియా) తీసుకొచ్చేస్తాడు. తర్వాత జెనిలియా తను అనుకున్నట్లు స్నేహితుని ప్రియురాలు కాదని తెలిసి వస్తుంది. డాక్టరు ఇచ్చింది రోగి కోరింది ఒకటే అన్నట్లు మన జెన్నీకి కూడా ఈ పెళ్ళి ఇష్టం ఉండదు. అనుకోకుండా ఐనా పెళ్ళి తప్పించినందుకు రామ్‌కు జెన్నీ నెనర్లు తెలుపుతుంది. ఫోతే ఫోన్లే హమ్మయ్యా అనుకునే లోపే రాక్షసుల్లాంటి ఫ్యాక్షనిస్టులు కొందరు సుమోల్లో కత్తులు తిప్పుకొంటూ రామ్ & కో వెంట పడతారు. వీళ్ళెవరు రా మధ్యలో అంటే జెనీలియా బ్యాక్‌ గ్రౌండ్ గురించి తెలుసుకోవలసి ఉంటుంది. జెనీలియాకు 100కోట్ల ఆస్తి ఇచ్చేసి అమ్మా నాయనా చనిపోయి ఉంటారు. ఇక జెనీలియా మేనమామలు (కోటా శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి) ఇద్దరూ ఆ ఆస్తి కొట్టెయ్యటాని జెనిలియాను తమ కోడలు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూంటారు. ఆ ఫ్యాక్షనిస్టు రౌడీల నుండి పలు మార్లు రక్షించిన రామ్‌ మీద మనసు పారేసుకుంటుంది, కానీ పెళ్ళి మాత్రం తన తన కీ.శే లైన తల్లిదండ్రుల కోరిక మేరకు మేనమామలే దగ్గరుండి జరిపించాలంటుంది. సరే అని హీరో విలన్ల ఇంటిలో బ్రహ్మానందం సాయంతో చేరి, వారిని బకరాలను చేసి వారి చేతుల మీదుగానే జెన్నీను పెళ్ళి చేసుకుంటాడు. ఇదీ కథ…

మొత్తానికేమంటానంటే…

బ్రహ్మానందం క్యామెడీ సూపరంటాను. సినిమా చూస్తే మన బ్రహ్మీకోసమే చూడాలంటాను. మెక్‌డోవెల్ మూర్తి పాత్రలో మనల్ని నవ్వుల్లో ముంచి మనల్ని నరికేస్తాడంటాను. ఏంటో ఈ సంవత్సరం హిట్టైన అన్ని సినిమాల్లోనూ బ్రహ్మానందం ప్రముఖ పాత్రపోషిస్తున్నాడు. క్యామెడీ పండించడంలో పది PHDలు తీసేసుకున్నంత పరిణితి సాధించాడనిపిస్తుంది. అసలు డైలాగులేమీ చెప్పకుండా ఎక్స్‌ప్రెషన్లతోనే అంతగా నవ్వించడమంటే సామాన్యమా!!! మొదటి సగం సినిమా ఫరవాలేదనిపించినా…రెండో సగంలో బ్రహ్మానందం వచ్చి మొత్తం థియేటర్నే నవ్వుల్లో ముంచేశాడు. చివరి ముక్కాలు గంట సినిమాను కాపాడింది. ఈ సినిమా విజయవంతం అయ్యిందంటే, అది మెక్‌డోవెల్ మూర్తి, చిట్టి రాయుడు, జూ.చిట్టి రాయుడు పాత్రలే కారణం.

ఈ సినిమాలో ఏవి నచ్చాయంటే….

 1. బ్రహ్మానందం
 2. బ్రహ్మానందం
 3. బ్రహ్మానందం
 4. బుల్లి ఫ్యాక్షనిస్టు జూ.చిట్టి రాయుడుగా మాస్టర్ భరత్ (వెంకీ సినిమాలో ట్రైన్ సన్నివేశంలో ఓ పిల్లవాడు మందు కొట్టి అల్లరి చేస్తాడే..) అద్భుత నటన. ఇంత చిన్న వయసులో క్యామెడీని ఇంత అద్భుతంగా పండించడం అరుదే.
 5. మనకున్న అద్భుత నటుల్లో జయప్రకాష్‌రెడ్డి ఒకడు. క్రౌర్యం, రౌద్రం ఎంతలా చూపగలడో, హాస్యం అంతకంటే బాగా పండించగలడు..దానికి ఈ సినిమానే సాక్షి. రాయలసీమ యాసను ఇంతకన్నా బాగా పలక గల నటుడు నేను చూడలేదు. ఆనందం సినిమాల్లో హీరో గ్యాంగును దడ దడలాడించే యస్సయ్‌గా, ఓ..చినదానాలో ఇద్దరు కూతుర్ల తండ్రిగా, దుబాయ్..శీనులో “వీడెవడ్రా మూత మందుకే, గాడ్జిల్లాలా అరుస్తున్నాడు” అనే విలన్‌గా ఇతను పండించిన హాస్యాన్ని మరువగమా?

ఈ సినిమాలో నాకు నచ్చనివి….

 1. కథ మంచి ఊపులో ఉండంగా పాటలు అనవసరంగా వస్తాయి.
 2. నేపథ్య సంగీతం బాగున్నా, పాటలలు అంతగా బాగోలేదు
 3. ఎడిటింగ్ బాగోలేదు.
 4. అనవసరమైన ఫుట్‌బాల్ గేమ్
 5. కోటా శ్రీనివాసరావు పక్కనుండి సెటైర్లేసే మనిషి (జెమిని కార్యక్రమం, టకాల్ టకాల్ ఢమాల్ డమాల్‌లో వాస్తాడే..అతను) బదులు కృష్ణ భగవాన్ ఉండుంటే…ఇంకా అద్దిరిపోయేది.

జనాలు పగలబడి నవ్విన కొన్ని సంభాషణలు/సన్నివేశాలు ఏవంటే…..

 1. వదిలెయ్యండి వాడి పాపాన వాడే పోతాడు (బ్రహ్మానందంతో ధర్మవరపు సుబ్రహ్మణ్యం) వీడి పాపానికి నేను పోయేటట్టున్నాను (బ్రహ్మానందం)
 2. ఈ ముసలోడికి పెట్టాల్సింది దండం కాదు…పిండం (మాస్టర్ భరత్)
 3. నా లాగా స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్లు మీకు ఐస్క్రీములు, బిస్కట్లు కొనిస్తార్రా….ఉన్నది ఒకటే మ్యాన్..అది చిట్టి మ్యాన్ (స్నేహితులతో మాస్టర్ భరత్)
 4. సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేసుకొన్న ముమైత్‌ఖాన్లా ఉన్నావ్‌రా (సునీల్‌తో తనికెళ్ళ భరణి)
 5. యమ్మెస్.నారాయణ కుక్క పేరు పూజా అనుకొని తికమక పడే సన్నివేశం
 6. బ్రహ్మానందం కనిపించిన ప్రతి ఒక్క సన్నివేశం
 7. జూ.చిట్టి రాయుడు కనిపించిన చాలా సన్నివేశాలు..ప్రత్యేకంగా స్పైడర్‌మ్యాన్ సన్నివేశం.
 8. సునీల్ భరతనాట్యం సన్నివేశంలో తనకు తానే చెంపకు కొట్టుకొనే సన్నివేశం.

ఇంకా కొన్ని విశేషాలేవంటే….

 1. దర్శకుడు శ్రీనువైట్లకు ఇది వరుసగా మూడో విజయవంతమైన సినిమా. ఢీ, దుబాయ్ శీను తరువతా వచ్చిన సినిమా ఇది. దీంతో రామ్‌చరణ్ తేజ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందని వినికిడి. ఇప్పటికే నాగార్జునతో ‘కింగ్’ అనే సినిమా మొదలవ్వగా, వెంకటేష్‌తోనూ సినిమా ఉందని సమాచారం.
 2. దేవిశ్రీ ప్రసాద్‌తో మూడో సారి పని చేశాడు. ఇంతకు ముందు, ఆనందం, అందరి వాడు వచ్చాయి
 3. జగడం పరాజయం తరవాత ఈ విజయం రామ్‌కు పెద్ద రిలీఫ్
 4. కథానాయకుడి సెల్‌ఫోన్ యొక్క రింగ్‌టోన్ భలే ఉంది. దావీశూక సినిమాలో అన్నగారు చెప్పిన “ఏమంటివి ఏమంటివి…” డవిలాగే…ఈ రింగ్ టోన్. ఈ రింగ్ టోన్‌కి ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంది.

చివరగా…

మదనపల్లెలో సోమవారం కూడా హాలు నిండింది కాబట్టి…ఈ సినిమా హిట్టే లెఖ్ఖ. ఈ వారాంతానికి మీరి టిక్కెట్టి ఇప్పుడే బుక్ చేసుకోవచ్చును.


అన్నట్టు…నా బ్లాగులో ఇది 200వ పోస్టు,  …. దీని గురించి మరో టపా వ్రాయాలి.


ఇలాంటివే మరిన్ని సినిమా విశేషాలు:

1) ‘పరుగు’ సినిమా సమీక్ష
2) ‘జల్సా’ సినిమా సమీక్ష
3) వామ్మో… ఆపదమొక్కులవాడు
4) అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే…..

ప్రకటనలు

20 thoughts on “‘రెడీ’ సినిమా సమీక్ష

 1. మొత్తానికి అమ్మాయి వేసుకున్న మినీ స్కర్ట్ లాగా తెలిసి తెలియనట్టు సినిమా ఓ మోస్తరుగా చెప్పేసారు. బావుంది.

  200 టపాల సందర్భంగా కుడోలు. (kudos)

 2. కాంటీన్లో పూరీని తెలుగు సినిమాతో పోలిక ఒక పొలి కేక! సినిమా ముందు ఈ పూరీల గొడవ ఏందబ్బా అనుకున్నా..చాలా కరక్ట్ గా చెప్పారు.సినిమా బాగుంది అనేలా తీసాడు,నాకయితే మొదటిసారి చూసినపుడే రెండోసారి చుస్తున్నానా? అనిపించింది! కామెడీ తుక్కు లేసింది,జయ ప్రకాష్ కర్నూల్ యాస అద్భుతం!

 3. సమీక్ష బాగుంది.కామెడీ అదిరిందని అందరూ అంటున్నారు.అసభ్యత లేని హాస్యం రావడం శుభసూచకం.
  అన్నట్టు దేవీశ్రీ తో శ్రీని వైట్ల ఇంకా చాలానే చేసాడు.నాకు గుర్తున్నది సొంతం అన్న సినిమా.పాటలు చాలా బాగుంటాయి.

 4. భలే క్యామెడీ. నేనూ తెగ నవ్వుకున్నాను. మాస్టర్ భరత్ సింబ్లీ సూపరు. ఈ సినిమా గురించి రాయాలనుకుని అనుకుని అనుకుంటూవుండగానే అది పాతబడిపోయింది. మీ సమీక్ష సూపరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s