ఫైర్‌ఫాక్స్ 3.0 డౌన్లోడ్ చేద్దాం…రా

మంట నక్క అని ముద్దుగా పిలుచుకొనే FireFoxకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోజిల్లా వారు ఒక గిన్నీసు రికార్డును స్థాపించాలని సంకల్పించారు. ఆ రికార్డు ఏమంటే…24 గంటల్లో ఎక్కువ సార్లు Download చేసుకున్న softwareగా FireFox3.0ను నిలపాలను. పద్నాలుగు వేల మెరుగులు దిద్ది ఉచితంగా అందరికీ అందించబోతున్న FireFox3.0 ను అందరూ Download చేస్తారు కదూ? ఆ తేదీ ఎప్పుడన్నది త్వరలో తెలియజేస్తారు.

పూర్తి వివరాల కోసం ఈ లింకును చూడండి: http://www.spreadfirefox.com/en-US/worldrecord/

ప్రకటనలు

మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము?

ఓ రాజా! మీ మనస్సును ఆలోచనా మేఘాలు కమ్ముకుని ఉన్నాయని అనిపించుచున్నది…….

నిజమే మంత్రీ…మనవుడు కడు విచిత్రమైన జీవి. విశ్వంలోని సంక్లిష్టతనంతా మనస్సులో నింపుకొని ఉన్నాడు. ఒకరు ఉన్నటుల మరొకరు ఉండజాలరు కదా. ఇన్ని మాటలు యేల, ఒక తల్లి కడుపున పుట్టిన సంతానం పరస్పరం వ్యతిరేక భావాలు కలిగి ఉండుట చూచుచున్నాము. హ్హా…..మా మనస్సు ఏన్నో వేల ఆలోచనలతో కల్లోలము అగుచున్నది. మానవుల సృష్టిలో ఎందుకీ వైరుధ్యము?
రాజా..ఈ వైరుధ్యమునకు కారణము సంస్కారము.

మనుజులకు ఈ సంస్కారములు ఎలా కలుగుచున్నవి?

చేసిన కృతములు మనస్సుపై ముద్ర వేయుట చేత.

మనుజులు వివిధ కృతములకు ఎలా పూనుకొనుచున్నారు?

ఎవరి ఆలోచనా దృక్పథాలు వారికి ఉండుట చేత.

భిన్న దృక్పథాలు ఏలా ఏర్పడుచున్నవి?
ఎవరి స్మృతి వారికి ఉండుట చేత.

స్మృతులు ఎందుకు కలుగును
చేసిన కర్మల ఫలితములు కదా మళ్ళీ మళ్ళీ స్మృతుగా వచ్చునవి.

ఆహా…లెస్స పలికితిరి మంత్రి…మరి మన కర్మలు పరిశుద్దమైనచో మన స్మృతి, దృష్టి, వృతి, కృతి తద్వారా మన సంస్కారములు కూడా పరుశుద్దమగును.

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

మరికొన్ని తవికలు:

పరుగు సినిమా సమీక్ష

హల్లల్లో నవీన్..ఎలా ఉన్నావ్?
బ్రహ్మాండంగా ఉన్నాను.

వారాంతం ఏమి చేశావ్?

వారాంతంలో నేను త్….

తినడం పడుకోవడం టీవీ చూడటం తప్పించి ఇకేవన్నా చేశావా అని నా ఉద్దేశం!!

:) రెండు తెలుగు సినిమాలు చూశాను, అదీ ధియేటరుకు వెళ్ళి

ధైర్యవంతుడివే…అందులో కంత్రీ సినిమా ఉంది ..కరెక్టేనా?
శుద్ద తప్పు. రివ్యూలు చదవకుండా తెలుగు సినిమాకు వెళ్ళడమా..నోవే..

సరే నువ్వే చెప్పు ఏమేమి సినిమాలో.

శనివారమేమో పరుగు సినిమాకు వెళ్ళా, ఆదివారమేమో బొబ్రచసి సినిమాకెళ్ళాను

ఏబ్రాసి లాగా ‘బొబ్రచసి‌’ ఏమిటి … తెలుగు సినిమా పేర్లు ఇలా కూడా వస్తున్నాయా..ఈ మధ్యన?

అమాయకుడా…నువ్వు హిందీ చిత్రాలు ఫాలో కావనుకుంటా. ‘బొబ్రచసి‌’ అంటే బొమ్మానా బ్రదర్స్ చందనా సిస్టర్స్.

ఓహో అదా సంగతి. పరుగు సినిమా ఎలా ఉంది?

పర్లేసు…తల నొప్పైతే రాదు.

అసలు మీ ఊర్లో అన్ని తెలుగు సినిమాలు ఆడుతూండగా, పరుగే ఎందుకు వెళ్ళాలనుకున్నావు?

మూడు కారణాలు
1) హీరోను అనుకొని కథ అభివృద్ది చేసిన సినిమా కాదిది. కథ అనుకొని నటులను ఎంపిక చేసిన సినిమా ఇది.
2) లేచిపోయిన కూతురు గురించి తండ్రి పడే వేధన చూపాడన్నారు…సరే కథా బలం గల సినిమా కదా అనిపించింది.
3) ఇది మామూలుగా వచ్చే తెల్ల చొక్కాలు, వంద సుమోలు, ఢిష్యుం ఢిష్యుం సినిమా కాదు.

పదో తరగతిలో ఐదు మార్కుల ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్టు చెప్పారు…బాగుంది. ఇక సినిమా విశేషాలేమైనా చెబుతారా?

ఆకాశంలోని నక్షత్రాలు, భారతీయ సినిమాలోని ప్రేమ కథలు ఎవ్వరూ లెక్కపెట్టలేరు. ప్రేమ , ప్రేమ అండ్ కో., ప్రేమ ఎంతమధురం, ప్రేమ కధ, ప్రేమ కానుక, ప్రేమ కిరీటం, ప్రేమ కోసం, ప్రేమ ఖైదీ, ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం, ప్రేమ చేసిన పెళ్ళి, ప్రేమ జీవులు, ప్రేమ తపస్సు, ప్రేమ దీపాలు, ప్రేమ నక్షత్రం, ప్రేమ నాటకం, ప్రేమ పంజరం, ప్రేమ పల్లకి, ప్రేమ పిచ్చోళ్ళు, ప్రేమ ప్రయాణం, ప్రేమ బంధం, ప్రేమ మందిరం, ప్రేమ మూర్తులు, ప్రేమ యుద్ధం, ప్రేమ విజేత, ప్రేమ సంకెళ్ళు, ప్రేమ సామ్రాట్, ప్రేమ సింహాసనం, ప్రేమ-పగ, ప్రేమంటే ఇదేరా, ప్రేమకానుక, ప్రేమకు వేళాయెరా, ప్రేమతరంగాలు, ప్రేమద్రోహి, ప్రేమనగర్, ప్రేమపుస్తకం, ప్రేమలు – పెళ్ళిళ్ళు, ప్రేమలేఖలు , ప్రేమలో ప్రమాదం, ప్రేమవిజయం, ప్రేమశిఖరం, ప్రేమాభిషేకం, ప్రేమాయణం, ప్రేమించానునిన్నే, ప్రేమించి చూడు , ప్రేమించి పెళ్ళి చేసుకో, ప్రేమించిచూడు, ప్రేమించు పెళ్ళాడు, ప్రేమించుకుందాం రా, ప్రేమించేది ఎందుకమ్మా, ప్రేమించేమనసు, ప్రేమే దైవం, ప్రేమేనాప్రాణం, ప్రేయసి రావే, ప్రేమ చరిత్ర……………..లాంటి సినిమాలు వేరైనా కథ ఒక్కటే.

(నీరసంగా…) ఉపోద్ఘాతంలోనే ఊరంతా తిప్పించావు, అసలు కథ ఎప్పుడు చెబుతావు నాయనా!!
మధ్యలో పుల్లలెయ్యకుండా చెప్పేది విను ముందు…

చెప్పు…అడిగాక తప్పుతుందా.

ఈ పరుగు సినిమా కూడా అదే ప్రేమ కధే, కాకుంటే ఇది ఓ తండ్రి కోణం లో నుంచి చూపిన కథ. సాధారణంగా ప్రేమ కథల్లో మొదట హీరో హీరోయిన్ల పరిచయం, పరిచయం ప్రేమగా మారటం, ఆ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవటం లేదా పరిస్థితులు అనుకూలించకపోవటం, దాంతో హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ కథానాయకుడు కథానాయికను స్నేహితుల సాయంతో లేపుకెళ్ళిపోవడం చూపుతారు (జయం సినిమా గుర్తుందా?). లేచిపోయిన జంట మీద సానుభూతి సంపాదించడానికి కథానాయికను పెళ్ళీ చేసుకోబోయే పెళ్ళికొడుకు మహాక్రూరుడో, దుర్గుణ సంపన్నుడిగానో చూపుతారు. కానీ నిజ జీవితంలో ఇలాంటి విలన్లు
అరుదు. రుక్మిణీ కళ్యాణం సినిమాల నాటి నుంచి ఇలాంటి సన్నివేశాలను చూసి చూసి ప్రేక్షకులకు….. లేచ్‌పోవటం మరీ అంత బ్యాడేమీ కాదు, పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోతే పాపం పసి ప్రేమికులు ఏమి చేస్తారు మరి, ప్రేమను గెలుచుకోవటం ప్రేమికుల కర్తవ్యం, ప్రేమే జీవితం లాంటి భావాలు ప్రేక్షకుల స్మృతిలో నిలచిపోయాయి. నిజ జీవితంలో సినిమా జనాలతో సహా చాలా మందికి స్పూర్థిని ఇచ్చాయి కూడా. నాగార్జున నటించిన ‘సంతోషం’లాంటి కొన్ని సినిమాలు మాత్రం ఒక జంట లేచిపోవటం ఆ జంట సమస్య కాదని, అది రెండు కుటుంబాల గౌరవం సమస్యని సున్నితంగా చూపాయి.

(చప్పట్లు కొడుతూ) శభాష్…నువ్వొద్దని పుల్లెయ్యకుండా ఉండలేకపోతున్నా… నీ ఉపన్యాసం బాగుంది కానీ, అసలు పరుగు సినిమా కథ చెప్పవయ్యా బాబూ.
చూడు మిష్టర్…ఐ విల్ సీ మూవీ విథ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ వాట్ మెస్సేజ్ హీ ఈస్ కన్వేయింగ్. సో ఎక్స్‌ప్లైనింగ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ ఆర్ నెసెస్సరీ బిఫోర్ ఐ టెల్ యూ ద వొరిజిన పరుగు స్టోరీ…వోఖే? వైదివే యూకెన్ హ్యావ్ దిస్ కూల్ డ్రింక్స్ మీన్ వైల్ యూ లిజన్ టు మై లెక్చర్.

నీ అబ్జర్వేషన్స్ మడిచి…టపా చివర్లో పెట్టుకో. ఇప్పుడు కథ చెప్పు.
వోఖే…యాజ్ యూ లైక్.

ధ్యాంక్స్….కథ మొదలు పెట్టబోతున్నందుకు మరియి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేసునందుకూనూ…
అనగనగా ఓ పల్లె‌లో ఓ ప్రకాష్‌రాజ్. ప్రకాష్‌రాజ్ అంటే సన్నా బన్నా మనిషా…ఆ ఊరికే పెదరాయుడన్న మాట. భార్య అందమైన ఇద్దరు కూతుర్లుని ఇచ్చి చనిపోయింది. పెద్ద కూతురు పెళ్ళి సీనే సినిమాలో మొదటి సీనన్న మాట. లైట్లు, తోరణాలతో అలంకరింపబడిన పెళ్ళి ఇళ్ళంతా జోకులేసుకుంటున్న స్నేహితులతో, ఎర్పాట్లు చూస్తున్న బంధువులతో హడావుడిగా ఉంటుంది. ప్రకాష్‌రాజ్ పెద్ద కూతురు, ఇప్పుడు పెళ్ళి కూతురు ఐన పూనమ్ బాజ్వా గౌరీ పూజ చేసి చీర మార్చుకోవడానికని వెళ్ళి అట్నుంచి అటే ఓ పేద హ్యాండ్సమ్ గైతో పరారయిపోతుంది. ఈ వార్త విని హతాశ్యుడైన తండ్రి హడావుడిగా రైల్వేస్టేషన్లను గాలించినా లాభముండదు. అప్పటికే ప్రేమికుల జంట జంప్‌ అన్న మాట. ఆ జంపైపోయింది కూడా అదే ఊరికి చెందిన బాబూ అన్న కుర్రాడితో అని తెలుస్తుంది. ఆ జంటెక్కడుందో కనుక్కోవడానికి బాబు స్నేహితుల్నంతా తన్ని తీసుకొస్తారు. ఆ జంటెక్కడ ఉందో చెప్పమని ఓ స్టోర్రూములో బంధిస్తారు. ఆ బంధింపబడిన వారిలో ఒకడు మన హీరో(?) అల్లూ అర్జున్. మరుసటి రోజు తెల్లవారే స్నేహితులంతా పారిపోవాలని చూస్తారు. ఆ పారిపోయే మార్గంలో మన అల్లూకి ప్రకాస్‌రాజ్ రెండో కూతురు షీలా పొగమంచులో నడుకొంటూ, చలికి వణుకుతూ శాలువాతో యువరాణిలా కనిపిస్తుంది. అంతే..అప్పటి దాకా ఒకటే పరిగెత్తిన హీరో కాళ్ళకు బ్రేక్స్. మళ్ళా తనను బంధించిన చోటుకు వచ్చేసి, తన యువరాణి సాక్షాత్కారం పొందేంత వరకూ అక్కడ నుండి కదలకూడదనుకుంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా పూనం బాజ్వా – బాబు జంట వ్రాసుకున్న ఉత్తరాలు అర్జున్ చేతిలో పడతాయి. అందులో షీలాకు సంబంధించిన సమాచారం ఉండటంతో, తనను అనుమానించి అక్క లేచిపోవాటానికి సహాయం చేసింది తనే అనుకుంటారని షీలా భయపడుతుంది. అర్జున్ దగ్గరున్న ఆ ఉత్తరాలు ఆమె తిరిగి లాక్కోవటం ఓ ప్రసహనం. ఈ క్రమంలో పెద్ద కూతురు లేచిపోవటానికి సహాయం చేసింది మన అల్లూ అర్జున్ అని ప్రకాస్‌రాజ్‌కి తెలిసిపోతుంది. అక్కడి నుంచి ‘నా కూతురెక్కడ ఉందిరా చెప్పరా బాబూ’ అని ప్రకాష్‌రాజ్ అర్జున్‌ను బ్రతిమాలుకోవటం, ‘వాళ్ళేదో లేచిపోయి ఆనందంగా ఉంటే మధ్యలో నీ గోలేంటి’
అని అర్జున్. చేసింది చాలక చిన్న కూతురుని కూడా ప్రేమించేటట్టు చేసి, ఆమెను కూడా లేపుకెళ్ళిపోయే ప్రయత్నం. అసలు తండ్రి లేచిపోయిన కూతురు జాడ తెలుసుకున్నాడా? పెద్ద కూతురు పరిస్థితి ఏంటి? షీలా అర్జుజ్‌ను ప్రేమించిందా? వారి ప్రేమను ఆమె తండ్రి ఆమోదించాడా? లేక వాళ్ళు లేచిపోయారా? అర్జున్ తన తప్పు తెలుసుకున్నాడా అన్నది మిగిలిన కథ.

భేతాళ కథలో లాగా చివర్లో ఆ ప్రశ్నలేంటి? ఆ క్లయిమాక్సు ఏదో కాస్త చెప్పరా బాబూ.

కథలో ఎస్సెన్సు మరియు సస్పెన్సు కూడా చెప్పిన్నట్లౌతుందని సందేహించా…సరే నీకోసం క్లుప్తంగా చెప్తా. ప్రకాష్‌రాజ్ పెద్దకూతురుని హైదరాబాదులో కలుసుకుంటాడు, కూతురేమో ప్రియుడి చెయ్యి పట్టుకొని “నా దారి నేను చూసుకున్న తరువాత కూడా నన్ను కుక్కలా వెంబడిస్తావేం” అని కసురుకుంటుంది. మనసు విరిగి పల్లెకు తిరిగి వచ్చేస్తాడు తండ్రి. కనీసం చిన్న కూతురు కైనా పెళ్ళి చేసి ముచ్చట తీర్చుకుందాం అని అనుకుంటాడు. ఇంతలో హీరో హీరోయిన్ను ప్రేమించుకుంటున్నారని తెలిసి ట్రూ రిపెంటెన్సు కలగడం చేత … తూచ్ ఈ పెళ్ళి క్యాన్సిల్ అనేసి…అర్జున్ చేతిలో చిన్న కూతురి చెయ్యి పెట్టేస్తాడు.

ఒక్క నిముషం…చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి నాకు. ఈ కథలో తప్పెవ్వరు చేశారు? ఎవరు తప్పు దిద్దుకున్నారు? అసలు కథ చెప్పదలుచుకున్నదేమిటి? లేచిపోవడం తప్పనా లేక బిడ్డలు ఎప్పుడు లేచిపోతారో కనుక్కొని దానికి ముందే వారికి పెళ్ళి చేసెయ్యాలనా? అంతా తిక మకగా ఉంది.
వురేయ్…కథ విన్న నీకే ఇన్ని సందేహాలొస్తే…నలభై రూపాయలు పెట్టి ధియటర్లో సినిమా చూసిన నాకు ఎన్ని సందేహాలు వచ్చుండాలి

సందేహాలది ఏముంది కానీ … ఈ విషయంలో నీ అభిప్రాయమిటో చెప్పు?

లేచిపోవటం గురించి లెక్చరిచ్చేంత లెవల్లో నేను లేను కానీ…ఇంకో మాటడుగు.

సినిమాలో ఇంకేమి నచ్చాయి నీకు?
1) ముందే చెప్పినట్లు రొడ్దకొట్టుడు మాఫియానో ఫ్యాక్షన్ కథ కాక, భావావేశాలకు అవకాశం ఉన్న కథ
2) రెండు పాటలు చిత్రీకరణ బాగుంది
3) కూతురు లేచిపోయిందన్న బాధతో ప్రకాష్‌రాజ్ చిత్తుగా తాగేసి, అల్లు అర్జున్‌తో తన కూతుర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పే సన్నివేశం అధ్బుతం. ఇలాంటి సన్నివేశాలు ఇంకో రెండు మూడు ఉన్నా సినిమా ఇంకా బలంగా నిలబడేది.
4) “ఉద్యోగం లేకుండా, జేబులో రెండు వేలు కూడా లేకుండా పారిపోయి కాపురం ఎలా పెడతార్రా” అని ప్రకాష్ రాజ్ అర్జున్‌ను నిలవదీసే సన్నివేశం బాగుంది
5) ఆర్య సమాజంలో అల్లు అర్జున్,ఆలి, ప్రకాష్‌రాజ్ ల మధ్య నడిచే సన్నివేశం చిరంజీవి కూతురు-శిరీష్‌లను గుర్తు తెస్తుంది
6) ఓ సి-గ్రేడ్ చెత్త లాడ్జిలో కూతురు పదైదు రోజులు తన ప్రియుడితో ఉందని తెలిసిన సన్నివేశంలో ప్రకాష్‌రాజ్ నటన

సినిమాలో నచ్చనిదేమిటి?
1) సినిమా మొదటి నుంచే అల్లూ అర్జున్ విలన్ లాగా, ప్రకాష్‌రాజ్ కథానాయకుడిగా అనిపించాడు. ప్రేమ జంటని లేచిపొమ్మని ప్రోత్సాహం ఇవ్వడం సహాయం చెయ్యడం తప్పితే వేరే పని ఏదీ లేనట్టుంది హీరోగారికి.
2) షీలా అల్లూ అర్జున్‌ను హఠాత్తుగా ఎందుకు ప్రేమించడం మొదలుపెట్టిందో ప్రేక్షకుడికి అర్థం కాదు.
3) కొన్ని పాటలు సందర్భం లేకుండా ఇరికించినట్లు అనిపించింది
4) క్లైమాక్స్ నాకైతే ఏమర్థం కాలేదు. పిల్లలు లేచిపోతే బాధ పడే పెద్దల కథో లేక ప్రేమించినవాళ్ళని పెద్దవాళ్ళు ఆదరించాలి అనే కధో స్పష్టం కాకుండా పోయింది. ఇది భాస్కర్ చేసిన అతిపెద్ద తప్పిదం.
5) ఈ మధ్య సినిమాలలో కథ తక్కువ కథనం ఎక్కువ అయ్యింది. ఇలా సినిమాలు తీయటం ఎంత రిస్కో మొన్న ‘కొండవీటి దొంగ’ సినిమా చూస్తే అర్థం అయ్యింది. ఈ సినిమాలో కథ ఒక్క నిముషం కూడా ఆగక చక చక పరుగులు తీస్తూ ప్రేక్షకులను ఆలరిస్తుంది. నవతరం దర్శకులు కొత్త సినిమా తీసే ముందు ఇలాంటి పాత సినిమాలు ఇంకో సారి చూస్తే మంచిది

ఇంకేంటి విశేషాలు?
1) మొదటి సినిమాతో సూపర్‌హిట్టు కొట్టిన దర్శకుల రెండో సినిమా ఫట్ అనే నానుడికి భాస్కర్ మరింత బలం చేకూర్చాడు. కాకుంటే రాజమౌళీ ఇందుకు అతీతుడు.
2) ఈ సినిమాతో తన కెరీర్‌ గాడిలో పడుతుందన్న షీలా ఆసలు అడియాసలయ్యాయి
3) అల్లూ అర్జున్ చాలా బాగా నటించాడు, అవార్డు వస్తుంది అనే వాళ్ళు, పాత చిరంజీవి సినిమాలు చూసి అసలు నటన అనగా ఏమి అని తెలుసుకోవచ్చు.
4) నిర్మాత ‘దిల్’రాజుకు మున్నా తరువాత ఇంకో నిరాశాజనక ఫలితం
5) ఓ పాటలో అర్జున్ డ్యాన్సులను ఇరగదీశాడు
ఇంకేనా గుర్తొస్తే చెబుతాలే

హమ్మయ్య…మొత్తానికి ఒక సినిమా గురించి చెప్పావు…బొబ్రచసి గురించి చెప్పు..
ఇప్పటికే ఎక్కువైంది. దాని గురించి రేపు చెబుతాలే… ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఆ సినిమాను ధర్మవరపు సుబ్రమణ్యం కోసం చూడాలి. కృష్ణ భగవాన్, కోవై సరళా, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రమణ్యం లాంటి హాస్య చక్రవర్తులు కొన్ని సన్ని వేశాల్లో ఇరగదీశారు. పిల్లలతో వెళ్ళడం మంచిది కాదు.
(సశేషం)


ఇలాంటివే మరిన్ని సినిమా విశేషాలు:

1) ‘జల్సా’ సినిమా సమీక్ష
2) వామ్మో… ఆపదమొక్కులవాడు
3) అనసూయ నాకు ఎందుకు నచ్చిందంటే…..

మంచి నీటి పొదుపునకు 10 చిట్కాలు


నీటి
చుక్క
విలువ
ఎంత?

నీటి చుక్క

బావిలో నుంచి నీళ్ళు తోడుకున్నంత?
నీళ్ళ మోటారు స్విచ్చి ఆన్ చేసినంత?
క్రెడిట్‌ కార్డులతో నీటి బిల్లులను చెల్లించేంత?
మునిసిపల్ ట్యాంకర్ల దగ్గర ఖాళీ బిందెలతో పోట్లాడుకునేంత?
రెండు రాష్ట్రాల మధ్య వైరమంత

తన కోసం చూసే రైతు గుండెలోని ఆశంత?
వేల కోట్ల జలయఙ్ఞమంత?
రోజు అంతా లోటా నీళ్ళతో గడిపేంత?

గుక్కెడు నీళ్ళ కోసం ప్రాణాలు తీసేంత?
దేవుని కన్నీరంత?
…ఇంతకూ నీటి విలువ ఎంత?

పదైదేళ్ళ ముందు మదనపల్లె ఎలా ఉండేది!! స్వర్గంలా ఉండేది కాదూ… పచ్చగా కళ కళలాడే పంటలు, ఎక్కడ త్రవ్వితే అక్కడ పడే నీళ్ళు, ఊరు చుట్టు పక్కల పెద్ద పెద్ద చెరువులు, ఎంత భగ భగలాడే ఎండాకాలంలో ఐనా చెమట పట్టని వాతావరణం, రెండు మూడు నెలలు ఒకటే వర్షాలు, వర్షాకాలంలో మినీ గోదావరిని తలపించే బహుదా కాలవ, అధ్భుతమైన చల్లటి వాతావరణం, రాయచోటి..చిత్తూర్లలో నీళ్ళు కొనుక్కుంటారంటా అని ఆశ్చర్యంగా చెప్పుకునే జనాలు, మురుగుకాలవలను శుభ్రం చెయ్యటాని వీధికో ట్యాంకరు నీళ్ళు ఉపయోగించే మునిసిపాలిటీ.

మరి ఇప్పుడో…

వేలకు వేలు అప్పు తెచ్చి వందల అడుగులు త్రవ్వినా బయటపడని నీటి చుక్క, కిలోమీటర్లు నడిచి..జనాలతో పోట్లాడితే..అతి కష్టం మీద దొరికే బిందె నీళ్ళు, కంటి మీద కునుకు లేకుండా అర్థతాత్రి ఐనా..మునిసిపల్ నీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కళ్ళు, కలుషితం ఐపోయిన ఉప్పు నీటినే వాడుతూ విధిలేక అనారోగ్యాన్ని ఆహ్వానించే అసహాయ జనాలు, ఒక బిందె నీళ్ళకోసం హత్య చేసే జనాలు, వేలకు వేలు పోసి కొనే వాటర్ ఫిల్‌టర్లు………………..

పదేళ్ళలో ఎంత మార్పు!!

పదైదేళ్ల ముందు మా ఇంట్లోనే ఇరవై మంది ఉండే వాళ్ళం, ఐనా నీటికి ఎప్పుడూ కట కట లేదు. ఇంట్లోనే బావి ఎప్పుడూ నీళ్ళతో నిండుగా ఉండేది. ఆ మాటకొస్తే చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంట్లోనూ ఒక బావిని చూడచ్చు (నదులు ఏవీ లేవు కదా :(). ఇప్పుడు ఎవరైనా బంధువులు వస్తే, డబ్బులుపెట్టి స్పెషల్‌గా నీళ్ళ ట్యాంకర్ తెప్పించాల్సిందే. ట్యాంకర్ నీళ్ళు 350రూపాయలు. మదనపల్లెలో ఇప్పుడిది లాభసాటి వ్యాపారం. పరిస్థుతులలో ఇంత విపరీతమైన మార్పులు జరిగినా, దీని గురించి జనాలు ఎందుకు ఆలోచించటం లేదో నాకు అర్థం కావటం లేదు. Who Moved my Cheese పుస్తకంలో చెప్పినట్టుగా ‘నీళ్ళు అనేది తరగని గని. మనం ఎంత వాడినా, ఎలా వాడినా, ఏమి చేసినా .. రేపటికి నీళ్ళు తప్పక ఉంటాయి‘ అన్న భ్రమలో ఉన్నారనుకుంటా అమాయక జనాలు. ముందంటే మనం పారబోసిన నీళ్ళు మళ్ళీ భూమిలో ఇంకి భూగర్భ జలాలల్లో కలిసేది. ఇప్పుడా పరిస్థితి లేదు…ఆవిరైన నీళ్ళు మళ్ళీ వర్షం రూపంలో రావటం లేదు. అందుకే కాసులు పోసి కొనుక్కుంటున్న నీళ్ళను ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాల్సిన రోజులొచ్చేశాయి. వేసవిలోనే కాదు, ఏ కాలంలో ఐనా..ఎప్పుడైనా నీటిని పొదుపుగా/సమర్థంగా వాడుకోవటం మన బాధ్యత. భవిష్యత్తులో నీరు బంగారం కన్నా విలువైనది అవుతుందేమో ఎవరికి తెలుసు.

ఇంట్లో నీళ్ళను పొదుపుగా వాడటానికి నాకు తెలిసిన చిట్కాలు కొన్ని పంచుకుంటున్నాను

 1. బచ్చల్లో నీళ్ళు తోడుకోవడానికి పెద్ద పెద్ద చెంబులు, మగ్గులూ కాక చిన్న మగ్గులు ఉపయోగించండి. పెద్ద మగ్గులో నీళ్ళు తీసుకున్నప్పుడు, అవసరమున్నా లేకున్నా అందులో మీగిలిన నీరంతా పారబొయ్యటం మనకు అలవాటే. చిన్నవి ఉపయోగించి చూడండి, ఆశ్చర్యంగా ఆ చిన్న మగ్గులోని నీరే చాలా అవసరాలకు సరిపోతుంది.
 2. ఇల్లు అలికిన మురికి నీళ్ళను, బట్టలుతికిన నీళ్ళను కాలువలో పారబోసే బదులు వాటిని మొక్కలకో, టాయ్‌లెట్లోనే పొయ్యచ్చు.
 3. స్నానం చెయ్యడానికి ఇక అందరూ షవర్‌బాత్ గురించి, తొట్టిలో నుంచి, అండా నుంచి నేరుగా పోసుకోవడం గురించి మరచిపోవడం మంచిది. ఒక బక్కెట్లో నీళ్ళు తోడుకొని, వాటితోనే స్నానం ముగించడం మంచిది. తలకు పోసుకోవడానికైతే ఇంకో అర బక్కెట్టు గ్రాంటెడ్. ఒక్క సారి షవర్‌బాత్‌లో ఉపయోగించే నీరు దాదాపు ముప్పయ్ బక్కెట్లు ఉంటుంది.
 4. లీకైయ్యే నీటి పైపులను, కొళాయిలను అశ్రద్ద చెయ్యక రిపేరు చేయించండి.
 5. కార్లు, బైకులూ కడగటానికి పైపుల ద్వారా కాక, బక్కెట్లో నీళ్ళు తెచ్చుకొని వాటితో కడగటం మంచిది. పైపులలో నుంచి ఎంత నీళ్ళు పోయినా, మనకు లెక్క తెలియదు. కార్లు కడగటానికి కూడా ఎదైనా డ్రై వాష్ పద్దతి ఉంటే బాగుండు :)
 6. మీ ఇంట్లో స్థలం ఉంటే తప్పక ఇంకుడు గుంటను త్రవ్వించండి (rainwater harvesting). వీలైతే మీ బచ్చల్లో నుంచి వచ్చే నీరును, ఈ గుంటలోకి మళ్ళించవచ్చు. దీని ద్వారా మీ ఇంట్లో నుంచి బయటకెళ్ళే నీరు మురికి కాలవలలో కలవక నేరుగా భూమిలోకే ఇంకిపోతాయి.
 7. కొళాయి పూర్తిగా తిప్పేస్తే మనకు అవసరమైనదానికన్నా ఎక్కువ నీళ్ళు వస్తాయి, కాబట్టి ఎప్పుడూ కొళాయి కొద్దిగా..అవసరమైనంత మాత్రమే తిప్పండి.
 8. మామూలుగా మనం భోజనం సమయంలో అవసరం ఉన్నా, లేకున్నా అందరికీ తలా ఒక లోట ఇచ్చి…అందులో నిండుకూ నీళ్ళు పోస్తాము. కొందరు భోజనం చేసేటప్పుడు అస్సలు నీళ్ళు త్రాగరు (నా లాగన్న మాట), అలా వారు వదిలేసిన నీళ్ళు పారేసే బదులు మొక్కలకు వాడవచ్చు.
 9. పళ్ళు తోముకునేటప్పుడో, పళ్ళాలు కడిగేటప్పుడో సింకు కొళాయిలో నీళ్ళు అలానే వదిలేయటం చాలా మందికి అలవాటు. నీళ్ళు వాడనప్పుడు వాటిని వృధా చెయ్యక, కొళాయిల్ని కట్టెయ్యండి.
 10. వాడినా వాడకున్నా రోజూ తువాలును (సౌకము), లుంగీ గట్రాలను ఉతికేదానికి వెయ్యటం మానుకోండి.

ఈ విషయంలో పాఠకులు తమ అనుభవాల నుంచి నేర్చుకున్న చిట్కాలు పంచుకోవచ్చు.


ఇలాంటివే మరిన్ని పూతరేక్స్:

‘జల్సా’ సినిమా సమీక్ష

విజ్యువల్ యెఫెక్ట్స్ ఆస్కార్ గెలుచుకొన్న ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్‘ నిర్మించడానికి కేవలం సంవత్సరం పట్టిందంట. మరి మన పెద్ద హీరోలకు తొడకొట్టే మామూలు సినిమాలు పూర్తి చెయ్యటానికి కూడా ఎందుకు అంత సమయం పడుతుందో మన దర్శకులకు ఎరుక. ఆనాటి నిప్పురవ్వ నుండి ఈనాటి సైనికుడు, జల్సా వరకు ఇదే తంతు. తమ హీరో సినిమా ఆలస్యమైయ్యే కొద్దీ అభిమానల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోవడం, దానికి తగ్గట్టే మార్కెటింగ్ మేనేజర్ లాంటి నిర్మాత లేని హైప్ సినిమాకు తెప్పించడం, మంచి రేటుకు సినిమాను అమ్ముకున్న తరువాత వందల కొద్దీ థియేటర్లలో విడుదల చెయ్యటం మామూలయిపోయింది. ఈ ‘వందలు’ సంఖ్య నిర్ణయించడానికి రెండు ప్రాతిపదికలు ఉన్నాయి. ఇంతకు ముందు ఎగస్పార్టీ హీరో సినిమాల కన్నా ఎక్కువ థియేటర్లు ఉండాలి, జనాలు ఇది బోకు సినిమా అని తెలుసుకునే లోపే మన పెట్టుబడి మనకు తిరిగి వచ్చెయ్యాలి. ఇందులో భాగమే మొదటి రెండు వారాలు ఇష్టమొచ్చిన రేటుకు టిక్కెట్టును అమ్ముకునే అధికారం, అవకాశం థియేటర్లకు కట్టబెట్టడం. వీటన్నిటి పైనా మొదటి ఆట టిక్కెట్ల వేలం, రాజకీయ నాయకుల గాలం వగైరా వగైరా. రెండు సంవత్సరాలు కాసుకొని, విడుదల రోజున ధియేటరు గేట్ల దగ్గర తోసుకొని, వందలు విదిలించి ‘వదిలించు”కొని’ సంపాదించిన టిక్కెట్టుతో విజయ గర్వంతో ధియేటర్లోకి అడుగుపెడతాడు సగటు అభిమాని. భీభత్సమైన వెరైటీగా సినిమా టైటిల్స్ పడేటప్పుడు ….అభిమానుల గోల,ఈలలు సినిమా మొదలైన తరువాత తగ్గుతాయి. ధియేటర్లోకి వెళ్ళేటప్పుడు, నైలు నదిని దాటే జీబ్రాల్లా చెంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళిన అభిమాని, తిరిగి వచ్చేటప్పుడు నాలుగు లంకణాలు చేసి…నెత్తి మీద సమ్మెటతో పదిసార్లు కొట్టిచ్చుకున్న బాపతులా ఉంటాడు.

ఉరేయ్…సినిమా ఎట్లుంది రా అని అడిగితే …వాళ్ళిచ్చే కొన్ని జవాబులు చూడండి:

 1. ధియేటర్ ఫుల్లు రష్షు రా, డైలాగులేమీ ఇనపడలా
 2. సెకండాప్ బాగుంది రా
 3. మూడు డ్యాన్సులు బాగున్నాయ్ రా
 4. ఫరవాలేదు…ఒక్క సారి చూడచ్చు
 5. ఊర్లో సినిమాలు చూసేకి ఇంకేమీ మిగలకపోతే, దీన్ని చూడొచ్చు.
 6. ఏమీ ఎక్స్పెక్టేషన్సు పెట్టుకోకుండా చూస్తే…బాగుంటాది రా. లేకుంటే ల్యా.

ఏమీ సరుకులేని సినిమాల్లో కూడా ఇలా ఏదో ఒక మంచిని చూస్తూ, హీరోలను ప్రోత్సహిస్తున్న తెలుగు అభిమానులు చాలా గొప్పవాళ్ళు. మరి ఆ అభిమానాన్ని నిలబెట్టుకునే సత్తా మన హీరోలకు ఉందా?

ఇప్పుడు అసలు విషయం జల్సా సినిమాకు వద్దాం.

ఆర్థిక, సామాజిక, ఆరోగ్య కారాణాల రీత్యా సంజయ్ సాహు అనబడే పవన్ కళ్యాణ్ కుటుంబాన్నంతా పోగట్టుకుంటాడు. దీంతో గుండెల్లో భూస్వాముల పట్ల అణిగి ఉండే కోపం బయటకు తన్నుకొచ్చి నక్సలైట్లలో చేరుతాడు. కొరియర్ స్థాయి నుండి లీడర్ స్థాయికి ఎదిగిన పవన్, ప్రకాష్‌రాజ్ అనబడే ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన దారుణ ఎన్కౌంటర్లో తోటి నక్సలైట్లనంతా పోగట్టుకుంటాడు. తరువాత లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోతాడు. కమలినీ ముఖర్జీ అనబడే ప్రకాష్‌రాజ్ కూతురు, మన పవన కళ్యాణ్‌ను ప్ర్రేమిస్తుంది. కానీ మన పోలీస్ ప్రకాష్‌రాజ్ ఇడియట్ సినిమా తరువాత కూడా మారకపోవడంతో పెళ్ళికి ఒప్పుకోడు. ఇట్సాల్రైట్ అని..సింపుల్‌గా తండ్రి చెప్పిన వాడినే పెళ్ళి చేసుకొంటుంది. దాని తరువాత మన పవనేమో..పగలు కాలేజీలో చదువు, రాత్రి బారులో మందు కొట్టడంలో బిజీగా ఉంటాడు. ఇప్పుడు అసలు వీరోఇన్ల ఇంట్రడక్షన్. హీరోఇన్లంటే ఎవరో కాదు, మన ఇలియానా, పార్వతీ మెల్టన్లే.
ఇప్పుడు మీకో చిన్న జీ.కే ప్రశ్న
1)సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోఇన్లను ఇట్రడ్యూస్ చెయ్యటానికి అనువు గల సీను ఏది?
a)బీచిలోనో/స్విమ్మింగు పూల్లోనో పొట్టిబట్టలతో తడుస్తూ వయ్యారంగా బయటకు రావటం
b)ట్రాక్ సూట్లతో ఏ జిమ్ములోనో అందాలను విరజిమ్మటము లేదా స్లో మోషన్లో టెన్నీసు ఆడటము
c)ఏ గూండా కంట్లోనో పడి రేప్‌కు గురికావటము (ఇది పాత పద్దతి. గూండా వికటాట్టహాసం మాని ముట్టుకునే లోపే ఠంచనుగా హీరో వచ్చేస్తాడులెండి)
d)ఇంకో క్రియేటివ్ పద్దతి
సాధారణంగా తెలుగు దర్శకులు మొదటి మూడు పద్దతులను ఎంచుకుంటారు. ఎప్పుడూ లేనిది, మన త్రివిక్రముడు రెండు, మూడు పద్దతులను కలిపి ఎంచుకున్నాడు. రెండోది మూడో దానికి కారణమౌతుందన్నమాట. షరా మామూలుగా…గూండాలు రేప్ చెయ్యబోతే ఇలియానా, పార్వతీ ఇద్దరూ కూడా పవన్ దగ్గరకు పరిగెడతారు. పవనేమో…గుద్దుకో గూండాను పడగొడతాడు. అది చూసిన ఈ బ్యూటీలు, వీడు నా వాడే అని ఎవరికి వారు అనేసుకుంటారు. మొదట…పార్వతి ‘ఐలవ్యూ’ అని ప్రొపోజ్ చేస్తే, పవన్ ప్రవరాఖ్యుడిలా ‘ఛీ..పో..నువ్వు నాకు నచ్చలేదు’ అంటాడు. లైన్ క్లియరైపోవడంతో, పవన్‌ను పడేద్దామని ఇలియానా ఫస్టాఫంతా ప్రయత్నిస్తూంటుంది. మధ్య మధ్యలో..దామోదర్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు పవన్‌ను చంపాలని చూస్తూంటాడు. ఇలియానాకు ప్రేమ వరం ఇచ్చాడా, దామోదర్‌రెడ్డి ఎందుకు చంపాలనుకున్నాడు? అతని హత్యా ప్రయత్నాలను హీరో తిప్పికొట్టగలిగాడా అన్నదే మిగతా కథ.

నచ్చినవి:

 1. పవన్ నటన చాలా బాగుంది. చాలా హుషారుగా నటించాడు. బావోద్వేగాలు కూడా చాలా బాగా చూపించాడు.
 2. సినిమాటోగ్రఫీ అదరహో. ముఖ్యంగా పోరాట దృశ్యాల్లో.
 3. హీరోయిన్లను పాటల్లో కానీ, సీన్లలో కానీ ఎక్కడా అసభ్యంగా చూపకపోవడం. పవన్ కళ్యాన్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయుడు. ఇతని సినిమాల్లో ఆడవారిని అసభ్యంగా చూపరు.
 4. మాటలు కొన్ని బాగా నచ్చాయి. ఉదా:
 • బడికి నాలుగు కి.మి దూరంగా, ప్రభుత్వాస్పత్రికి ఎనిమిది కి.మీ దూరంగా, దురదృష్టానికి దగ్గరగా బ్రతుకుతున్నారు
 • పంటను పురుగు ఆశించింది. పురుగుల మందు చల్లాడు, పని చెయ్యలేదు. పురుగుల మందు తను తాగాడు, ఈ సారి పని చేసింది.
 • ఆకలైనా తినకుండా ఉంటే అది ఉపవాసం, నిద్రొచ్చినా పడుకోకుండా ఉంటే అది జాగరణ, చంపే అవకాశం వచ్చినా వదిలేస్తే అది మానవత్వం
 • రవి పార్కులాంటోడు. ఒక వారం చూస్తే, మరి కొత్తగా చూడటానికేమీ ఉండదు. సంజయ్ అలా కాదు, జీవితంలో ప్రతి రోజూ ఏదో కొత్తదనం చూపిస్తాడు.
 • నేనూ ఈ మధ్యే మార్గదర్శిలో చేరాను, ఒక తుపాకీ కొన్నాను

నచ్చనివి:

 1. అసలు నేను ఇక్కడ కథను సాధ్యమైనంత లీనియర్‌గా చెప్పాను. సినిమాల్లో కథంతా కలగాపులగంగా ఉంది.
 2. త్రివిక్రముడికి మాటల రచయితగా మాత్రమే మార్కులు పడతాయి. స్క్రీన్‌ప్లే లో ఘోరంగా విఫలం అయ్యాడు.
 3. గండరగండల్లాంటి హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, ఆలీ‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు
 4. ఇలియానాకు కొన్ని పాటల్లో మేకప్ విపరీతంగా ఉండి, ఎబ్బెట్టుగా ఉంది
 5. పాటలు, డ్యాన్సులు జస్ట్ ఓఖే. సూపరు..అనేంతగా ఏమీ లేదు.
 6. చాలా సీన్లు ఇల్లాజికల్‌గా, సిల్లీగా, అసంపూర్తిగా ఉన్నాయ్
 7. ఇది A సర్టిఫైడ్ సినిమా, హింస చాలా ఉంది సినిమాలో
 8. కథనంలో ట్విస్టులు ఎక్కువైయ్యాయి

అవీ-ఇవీ:

 1. ఇలియానా అంటే ఆంధ్రాలో కుర్రాళ్ళు ఎలా పడిచస్తారో, పార్వతి మెల్టన్ అంటే మళయాళీ కుర్రాళ్ళు అంతకంటే ఎక్కువ పడిచస్తూన్నారంట.
 2. మొదటి వారంలో 21కోట్లు, రెండు వారాల్లో 32కోట్లు వసూలు చేసిందని గీతా ఆర్ట్స్ ఉవాచ

చివరగా:

* ఈ ఆదివారం ఏదో సినిమాకు తప్పని సరిగా వెళ్ళాలి అంటే, ఈ సినిమాకు ఒక్క సారి వెళ్ళవచ్చు

ఆనందానికి 10 సూత్రాలు

జీవితమే అనందమయం

తరాలు తిన్నా తరగని ధనముంది
ఎదటి మనిషిని ఎదిరించే ధైర్యముంది

ముప్పొద్దులా ఘుమఘుమలాడే తిండుంది
విశ్వకర్మే విస్తుపోయేంతటి భవనముంది

ఊరంతా గొప్పగా చెప్పుకునే పేరుంది
అందరూ జేజేలు పలికే ప్రఖ్యాతుంది

ఇంట్లో ఎదురూచూసే భార్య ఉంది
మురిపించి మరపించే సంతానముంది

తప్పు చేస్తామని చూచే సంఘముంది
పలకరిస్తే పులకరించే స్నేహముంది

అనుభూతుల్ని దాచుకొనే మనస్సుంది
అంతరిక్షంలోకి ఎగరగలిగే విఙ్ఞానముంది

కానీ వస్తూ..పోతూ..
మనతోనే ఉన్నట్టనిపిస్తూ..
అంతలోనే మాయమైపోతూ..
ఉన్నదని భ్రమించేలోపే లేదన్న చేదు నిజాన్ని తెలియజేస్తూ
ఎండమావిలాంటి అందమైన “ఆనందం”, జీవితంలో అచ్చంగా మన సొంతమౌతుందా?

****************************************

“ఎందుకు లేదు…ఎప్పుడూ నేను ఏ టెన్షన్సు లేక ఆనందంగానే ఉంటానే” అంటారా…అలా అనే వాళ్ళకు నా శతకోటి అభినందనలు. జన్మ జన్మల పుణ్యఫలం మీ ఆనందం. అలాగే ఉండండి…నలుగురునీ అలాగే ఉంచండి.

****************************************
మొన్న కొత్తపాళీగారు తమ బ్లాగులో “జీవిత పరమార్థం” గురించి అడిగినప్పుడు దాదాపు అందరూ “ఆనందం”గా ఉండటమే అని సమాధానం వ్రాశారు. మనకు ఆనందంగా ఉండటం ముఖ్యం అని తెలుసు, కానీ ఎలా ఉండాలో తెలియదు.
జీవతమంతా ఆనందంగా ఉండాలని లేనిదెవ్వరికి?

మీ ఇంటి వెనక ఓ పెద్ద గొయ్యి ఉందనుకొందాం. చిన్నప్పట్నుంచి రోజూ కొంత చెత్త వేస్తూ వస్తున్నారనుకుందాం. పెద్దయ్యే పాటికి ఆ గొయ్యి ఏమౌతుంది? చెత్తతో నిండిపోదూ? అసలు ఆ చెత్తను పొయ్యడానికి ‘పెద్ద’ గొయ్యి అయినా సరిపోతుందా? సరిపోదు, మనమే వీలైనప్పుడంతా ఆ చెత్త తీసేస్తూ మునిసిపాలిటీ ట్రాక్టర్లో వేస్తూ ఉండాలి, అప్పుడే గొయ్యి ఖాళీగా ఉండి…ఏ వర్షమో పడ్డప్పుడు నీళ్ళు నిండుతాయి…భూమి దాహాన్ని తీరుస్తాయి. మన మనస్సు కూడా సరిగ్గా గొయ్యి లాంటిదే. చిన్నప్పట్నుంచి చెడు ఆలోచనలు, తప్పు ఆలోచనలు (negative thinking) అనే చెత్తను మన మనస్సనే గొయ్యిలో వేస్తూనే ఉన్నాం? మరి ఆనందమనే వర్షానికి వచ్చే నీరు నింపుకోవడానికి…అనుభూతి చెందటానికి మన మనస్సులో ఖాళీ ఏది? మనలోనే ఎన్నో వికారాలను నింపుకొని మన ఆనందాని మనమే చిదిమేసుకుంటాం. అసలు మనం ఆనందంగా ఉండాలంటే మొదటి మెట్టు మనలో లోపాలు ఉన్నట్టు మనం తెలుసుకోవడం, మనం పరివర్తన చెందాలన్న బలీయమైన కోరిక కలగడం.

సదా ఆనందంగా ఉండాలంటే, మనలో కొన్ని గుణాలు నింపుకోవాలి, అలవాట్లు చేసుకోవాలి. ఆనందంగా ఉండటానికి నా అనుభవం నేర్పిన ఓ పది పాఠాలను మీతో పంచుకుంటున్నాను.

1) అందరిలోని మంచినే చూస్తూండాలి
2) సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి
3) చెడులో కూడా మంచినే చూడాలి
4) వ్యర్థాన్ని సమర్థంగా చేసుకోవాలి
5) నిందా స్థుతులలో ఒకటిగా ఉండాలి
6) సహనశీలతా గుణం చాలా మంచిది
7) అపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి
8) సమస్యలు మనలను వదలవు, మనమే వాటిని వదిలెయ్యాలి
9) అందరి స్వభావ సంస్కారాలతో కలసిపోవాలి. (Flexible and adaptable)
10) మాట మధురంగా ఉండాలి

Stephen Covey 8th habbit లాగా, పైన వ్రాసిన ఒక్కో వాక్యం గురించి ఒక్కో పుస్తకం వ్రాయొచ్చు. పుస్తకం వ్రాయలేకపోయినా..కనీసం ఓ టపా అన్నా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

యూట్యూబ్లో దుమ్ము రేపుతున్న చిరంజీవి వీడియోలు :)

ఓ వీడియోని 9,113,536 సార్లు చూశారు. 18291 వ్యాఖ్యానాలు వ్రాశారు. 18291 సార్లు రేటింగు ఇస్తే, సుమారుగా 4/5 రేటింగు వచ్చింది ఈ వీడియోకి. ఈ నంబర్లు మన చిరు డ్యాన్సాడిన ఓ పాట వీడియోదంటే నమ్మగలరా? చిన్నప్పుడు దొంగ సినిమాను చౌడేపల్లెలో చూశా. అప్పుడు చిరంజీవి చేసిన పోరాటాలు, నృత్యాలు విపరీతంగా నచ్చేశాయి. అందులో ‘గోలీమార్…మార్..మార్’ అనే పాట ఒకటుంది. అప్పుడది బాగా అనిపించినా, పెద్దయ్యేసరికి అది మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ కాపీ అని తెలిసింది. ఈ రోజు చిరంజీవి వీడియోల కోసం వెతుకుతూంటే, ‘Indian Thriller’ అని ఒక వీడియో…అందులో మన చిరు బొమ్మ. ఏంటో చూద్దాం అని తెరిచా, చూస్తే, మన పాట. అలాగే క్రిందన రేటింగు, వ్యూస్, కామెంట్లు చూసేసరికి కళ్ళు తిరిగాయి. ఒక తెలుగు వీడియోకి పద్దెనిమిది వేల వ్యాఖ్యలా……………………….వామ్మో. ఖచితంగా 80% విదేశీయులవే అయ్యుంటాయి.

వ్యాఖ్యల్లో మాత్రం పాటను యేకేశారు..చండాలమైన కాపీ, భయంకరం అంటూ ఇష్టమొచ్చినట్టూ కామెంటేశారు. మచ్చుకు కొన్ని కామెంట్లు చూడండి:

 1. That’s the funniest thing I’ve ever seen
 2. this is not even close to MJ’s work….and thrller is supposed to be scary you guys are making it look lame…
 3. thanks god i am not indian
 4. hahaha!!…why the woman scare??? the woman must laugh becuase the dance steps are very ridiculous and funny,, but i really enjoy the video..

పైన వ్రాశిన కామెంట్ల కంటే క్రిందన చూపించిన జాలి భయంకరంగా ఉంది:

 • I still think this whole music video is some kind of joke about western music. Cause, honestly? Who makes something this bad on purpose?

పాటను తిట్టారు కానీ, చిరు డ్యాన్సు చాలా మందికే నచ్చినట్టుంది:

 • I love how the pounding synth music starts and he begins the shoulder action. It’s so awesome. goli ma ma. i like it when he’s humping the air.. at 2:19

ఒకతనికి ఇది ఎంతగా నచ్చిందంటే…తన భాష కాకపోయినా సాహిత్యాన్ని వ్రాయడానికి ప్రయత్నించాడు:
Goli maaaaaaar… goli maar!
Goli mar-mar-mar-mar-mar-mar-(mar).
Goli mar-mar-mar-mar-mar-(mar)…..
Kashno rau kaugileste yenche staavooo…
Ne pali manta meste yee maltovooo…..
Kandaru padda kane shungaa.. raamaaaa…
Valkunga guda yesta vaya raamaaa…
Goli maar!
Goli.. mar-mar-mar-mar-(mar)….
Rrrrrgrrryyaaaaayaaaaa!

చూసిన చాలా మందికి, ఇంత సిల్లీ వీడియోకి ఇన్ని హిట్లు, వ్యాఖ్యలు ఎందుకో అర్థం కాక అయోమయానికి గురయ్యారు:

 • i cant help but wonder ..why so many views?! i have lost brain cells…ahahaha

ఇక్కడా తమిళ వాసనే :(

 • this is in tamil not hindi

వ్యాఖ్య వ్రాసిన జనాల్లో సగం మంది, కేరళ భామ రాధ అందానికి ఫ్లాటయిపోయారు. ఈ విషయంలో మాత్రం అందరిదీ ఏకాభిప్రాయం :)

 • HEY INDIAN MICHAEL JACKSON! You’re girlfriend is a bumblebee…

ఇంకోడు పాటలు వ్రాయడంతో సరిపెట్టుకోకుండా ఏకంగా, పాటను ఆంగ్లంలో అనువదించే ప్రయత్నం చేశాడు :) దీనికి ఇరవై లక్షల పైన హిట్లు…పది లక్షల తిట్లు ;)


——————–
నా నార్వే స్నేహితుడు ఓ మాటన్నాడు. ఎందుకు మీ పాటల్లో విదేశీ ట్యూన్లు కాపీ కొడతరు, అనుకరించడానికి ప్రయత్నిస్తారు, మీకంటూ సొంత సంగీతం, శైలి లేదా అని. మీకంటూ సొంతంగా కళను ప్రదర్శించకపోతే ప్రపంచం మీ వైపు తిరిగి కూడా చూడదు అని.