మనసుల మెలఁపు (Awakening of Hearts)

చిరునవ్వులా నిలిచింది విశ్వం నీ స్పర్శకు, దేవా!
బ్రహ్మాండపు ఊట పోసి,
జ్ఞానపు విత్తనాలు నాటి,
మనసుల తోటలో
ప్రేమ పూల విరియించాలని ఆశించావు

కానీ నువ్వు చూడు, దేవా!
ఎండలు కరుస్తున్నాయి,
అహంకారపు ఎండలు …
స్వార్థపు పురుగులు కాపు కాస్తున్నాయి,
కామం అనే అగ్ని గుల్మాలు గుండెల్లో మండుతున్నాయి.

అసహనపు గాలి వీస్తుంది,
మంచితనం అనే చిన్న మొక్కలను వంచిస్తుంది.
మోహం అనే చీడ మనల్ని బలహీనులను చేస్తుంది.

కన్నీటి సముద్రాలు నిండి కరుణ ఎండిపోతోంది,
సహోదరత్వం అనే వృక్షం నేలకొరుగుతోంది.
బాధ్యత అనే కానుక
స్వార్థపు అలలకు కొట్టుకుపోతున్నది.

మానవత్వం మరుగున పడుతోంది,
ద్వేషం పతాకాలు ఎగురుతున్నాయి.
నిజాయితీ అనే దిక్కు తప్పిపోయి,
అబద్ధపు చీకటి అలుముకుంటోంది.

కానీ దేవా, ఈ నిరాశ కాదు నా ప్రార్థన.
మనసుల మట్టిలో మంచితనం నాటి,
దయ, క్షమ, సత్యం అనే విత్తనాలను చల్లు.
ఆ విత్తనాలు మొలకెత్తి, ప్రేమ పరిమళించే పూలు విరియించు.

కలిసి కలుపుకుని, మంచితనం పాట పాడుకుందాం, దేవా!
మా భావాలకు వివేకం అనే దీపం వెలిగించు.
భూమి అంతా తోటగా మారాలని,
ప్రేమ, శాంతి, సహోదరత్వం పరిమళించాలని
నీ దివ్య కరుణను మేము కోరుకుంటున్నాము.

ప్రతిబింబాల నృత్యం

న్యాయం, హేతువు పక్కనబెట్టి
భావోద్వేగాలతో చెలరేగితే
సమాజం దశ దిశ మారిపోతుందా?
మీడియా ఒక మాయాలోకం
కల్పిత కథనాల ప్రపంచం
నిజాలు మరుగు చేసి
మనసుల్లో విషబీజాలు నాటే
ఒక యంత్రం

యువతే భవిష్యత్తు
వారి ఆలోచనలే దిక్సూచి
అనుభవం, జ్ఞానం వృద్ధుల కాణాచి
దాని విలువ తెలుసుకోవాలి కనులు తెరచి
పనికిరాని చెత్త నియమాలు మరచి
సత్యం, న్యాయం, మానవత్వం నడిపించే
కొత్త దారిలో మనం ముందుకు సాగిలి

కుళ్ళుతో నిండిన స్వార్థ రాజకీయాలకు
కొమ్ముకాసే మీడియా వ్యాపారాలు
కల్లోలాలతో ద్వేషం పెంచే న్యూస్ ఛానెళ్ళు
అబద్ధాల హోరులో అసత్య ప్రచారాల యావలో
టీ.యార్.పి లే ధ్యేయాలు, భావోద్వేగాలే ప్రమాణాలు
పాత్రికేయుల కలం, ఎవరి పక్షాన రాస్తుందో?
సోషల్ మీడియా సందడిలో, నిజమెక్కడ దాక్కుందో?
నిస్తేజమైన సమాజాన్ని మేల్కొలిపి
నిజాన్ని వెలికితీసే ప్రయత్నమెక్కడో?

చచ్చుబడిన చైతన్యంతో
మూగబోయిన జనానికి
మేలుకొలుపు కావాలి
నిజాన్ని వెలికి తీసే ధైర్యం ఉండాలి
భావోద్వేగాల అగ్నిగుండం దాటి
హేతువు వెలుగు చూడాలి,
ప్రశ్నించాలి, పోరాడాలి,
నిజాయితీ, న్యాయం, సత్యం జెండా ఎగురవేయాలి
స్వార్థం, ద్వేషాలు దూరంగా ఉంచి
ప్రేమ, ఐక్యత పెంపొందించాలి
సమాజం మంచి దిశగా
అడుగులు వేయడానికి
మనమే మార్పు
మనమే వెలుగు
మనమే భవిష్యత్తు
మనమే సమాజం

శుభోదయం

Poetry on Beautiful morning

కొమ్మలు తాకిన సూర్యకిరణాల కాంతిలో
అలరారే పుష్పాల సుగంధపు గాలిలో
కోయిలల గానం చెవులను చేరగా
పిల్లగాలి మనసును మృదువుగా తాకగా

వెన్నెల చుక్కల మెరుపుల వీడ్కోలులో
ప్రకృతి జీవనం తన సౌందర్యం చూపగా
తడిసిన మట్టి పరిమళం హృదయం తాకగా
నూతన ఆశల కిరణాల ప్రారంభంగా

కలల కనులను తెరిచే కొత్త ఉదయంలో
జీవన పథంలో నూతన ప్రయాణంగా
సాగిపోయే ప్రతి క్షణం ఆనందంగా
ప్రతి హృదయంలో ఆశా జ్యోతులు వెలిగించగా

స్వప్నాల వేకువ జామున నవోదయం చూడగా
జీవిత మార్గంలో కొత్త అడుగుల శ్రీకారంగా
ప్రమోదంతో గడిపే ప్రతి నిమిషం సంబరంగా
మనసులో ఆశా దీపాలు ప్రజ్వలించనీయగా

శుభోదయం! శుభోదయం! శుభోదయం!
ఇది అరుణోదయ కావ్యంగా శోభించగా
ఆశల వెలుగుల హృదయాలు ఏకమవగా
ప్రేమపు వీణ మీటి, ఉదయం పాటగా,
జీవన యానంలో, స్వప్నాల సాగరంగా!

సత్య ప్రేరణ

సమస్య ఎంత చిన్నది అయినా
కల్పన చేస్తే అది కొండంతయ్యె
నిజానికి అది చిన్ని చుక్కైనా
మనసులో మాత్రం మహాసాగరమే!

మనసు భయపడే కల్పన లోకం
నిజం కంటే ఎంతో పెద్దది కాదా
సమస్య లేదు అనుకుంటే చిన్నది కానీ
కల్పనలో మాత్రం అది గిరిశిఖరమే!

నీటి బుడగ చిన్నదే అయినా
మనసు దాన్ని తుఫాను చేస్తుంది
ఆలోచనల ప్రవాహం ఆపి
నీ శక్తిని నమ్ము
నిన్ను దైవమే కాపాడుతుంది.

సమస్యను కల్పనలో వెతికే ముందు
నిజాన్ని పరిశీలించు మొదటగా
మనసు చెప్పే భయాల కన్నా
వాస్తవానికి ఉండు దగ్గరగా

అందుకే మిత్రమా
నమ్మకం అనే నావలో
కల్పనల సాగరం దాటి
నిజం అనే తీరం చేరు

ఊహలు చెప్పే కధలు వినే ముందు
నిజంలో ఉండే బలం గుర్తించు
కల్పనలకు ఇంత చోటిచ్చే బదులు
ధైర్యంతో సమస్యను ఎదిరించు