ఈ గాలి నాదిరా!

మీ ఙ్ఞాపకాల్ని రెండున్నర సంవత్సరాలు వెనక్కి తిప్పండి…మీకేం గుర్తున్నాయి? మీకేం గుర్తుందో నాకు తెలియదు కానీ..నాకు మాత్రం మండుటెండల్లో వడలిపోయిన ముఖంతో నడుస్తున్న రాజశేఖర రెడ్డి కనిపిస్తుంన్నాడు. వచ్చిన పల్లెల్లో అంతటా కుంకంబొట్టు పెట్టి హారతులతో స్వాగతం పడుతున్న అమ్మలక్కలు. వెనకాలే సూరీడు, ఆరోగ్యం చూసుకోవడానికి డాక్టరు, జేజేలు కొట్ట్డానికి ఇందిరమ్మ సైన్యం.
ఏ ఊరికి వచ్చినా ఒకటే ‘ఉచిత’ ప్రసంగం. “భూమిలేని పేదోళ్లకి భూమి ఉచితం,భూమున్న చోట శిలాఫలకాలు ఉచితం, ఇళ్ళు లేని అభాగ్యులకు ఇళ్ళు ఉచితం, ఇళ్ళున్న చోట తారు రోడ్డులు ఉచితం, ప్రతి ఇంటికి బల్పులు ఉచితం, బల్పులున్న చోట కరెంటు ఉచితం, ఇప్పటికే కరెంటు బిల్లుంటే మాఫీ ఉచితం”. పల్లె పల్లెల్లో ఈ ఉచిత ప్రసంగానికి అందరి గూబల్లో ఉన్న గుబిలి వదిలి, ‘హస్తం గుర్తు’ మీద ఓటును గుద్ది గుద్ది గుద్దారు, గెలిపించారు. తర్వాత మొదలైంది సిసలైన పులువెందుల రాజకీయం.
మొదటి సంవత్సరం అనంతపురం మారణకాండలతో విజయవంతంగా పూర్తి అయ్యింది. తర్వాత ఎదిరా నాయనా ఉచిత కరెంటు అంటే, “నువ్వు పెద్ద రైతువా, చిన్న రైతువా! చిన్న రైతువైతే నీ ఆదాయం 10 వేల లోపలా 10 వేల పైనా? 10 వేలలోపలైతే నీ కొంపలో ఎన్ని బల్బులు ఉన్నాయి? ఒకటా…ఒకటికన్నా ఎక్కువా? ఒకటే ఐతే నెలకు ఎన్ని యూనిట్ల కరెంటు ఖర్చు అవుతుంది…40 లోపలా 40 పైనా? 40 లోపలైతే నీకు ఉచితం ఫో” అని వరదానం ఇచ్చేశారు అయ్యవారు. (అసలు కరెంటు సప్లై ఉంటే కదా ఉచితమో అనుచితమో అని వర్గీకరించడానికి.)
రెండో సంవత్సరం పల్లె బాట, నగర బాటల్తో సరిపోయింది. నగర బాటల్లో భాగంగా మా మదనపల్లెకొచ్చారు రాజశేఖరులుంగారు. అప్పుడు నీళ్ళకు కట కటగా ఉండేది. మునిసిపల్ ఆఫీసర్లకు “మీరెంతైనా ఖర్చుపెట్టండి డబ్బు నేనిస్తాను..నీళ్ళకు ప్రజలు ఇబ్బంది పడకూడదు” అని చెప్పారు. అంతే మా మదనపల్లె మునిసిపాలిటీ రెచ్చిపోయి డబ్బుకు లెఖ్ఖ తెలీకుండా నెలకు 46 లక్షల చొప్పున దాదాపు 3కోట్లు ఖర్చు చేసి రోజూ వందల నీళ్ళ ట్యాంకర్లను తిప్పింది. ఫలితం, కాంగ్రెస్సు గెలిచింది…ఖజానా ఖాళీ అయ్యింది. ఇది జరిగి ఒకటిన్నర సంవత్సరం కావస్తోంది, ఇంత వరకు మునిసిపాలిటీకి ప్రభుత్వం పైసా విదల్చలేదు. చివరకు అయ్యవారి మాటినిన మా ఊరి మునిసిపాలిటీ ఇప్పుడు బ్యాంకుల్లో అప్పులు చేసి నెట్టుకొస్తోంది.
మూడో సంవత్సరం ప్రతిపక్షాల మీదా, మీడియా మీద దాడితో సరిపోతోంది. అబ్బో అయ్యవారి ‘చెత్త’శుద్ది గురించి వ్రాయటానికి నాకు ఇక ఓపిక లేదు కానీ క్రింది వ్యాసంలో రాజశేఖర్ రెడ్డి పాలనను తనదైన శైలిలో రాజగోపాల్ చెప్పాడు. చదివి ఆనందించండి.

****************************************
వైఎస్‌కి బుర్ర పిచ్చెక్కి పోతోంది.
“వాటీజ్‌ దిస్‌ నాన్సెన్స్‌? అసలే ఈ కేసీఆర్‌, ప్రత్యేక తెలంగాణ గొడవతో పడలేక చస్తుంటే … కొత్తగా ఈ గ్రేటర్‌ రాయలసీమ పుట్టుకొచ్చిందేమిటి? టీజీ వెంకటేశ్‌ ప్రత్యేక రాయలసీమ అంటుంటే, ప్రతాపరెడ్డి అండ్‌ కో అటు బళ్ళారి, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్ని కబ్జా చేసేసి ఏకంగా గ్రేటర్‌ రాయలసీమ పెట్టమనడం టూ మచ్‌ … కాదు, కాదు త్రీమచ్‌…”
“మన సత్తిబాబు కూడా ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలంటున్నాడు…” గుర్తు చేశాడు కేవీపీ రామచంద్రరావు.
వైఎస్‌ చికాకు పడ్డాడు.
“ఈ సత్తిబాబొకడు, నా ప్రాణం మీదికి! ఉత్తరాంధ్ర రాష్ట్రం వస్తే సిఎం అయిపోదామనుకుంటున్నాడు కామోసు … ఇప్పటికే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చెలామణీ అవుతున్నాడుగా, అది చాలదూ!” అంటూ ఎగిరెగిరిపడ్డాడు.

“అన్నట్టు, యలమంచిలి శివాజీ సంగతి మర్చిపోయారు … ఆయన బెజవాడలో, గుంటూరులో ప్రత్యేకాంధ్ర మీటింగులు యమాజోరుగా పెట్టేస్తున్నాడు. కర్నాటి రామ్మోహన్‌రావు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర సమితి అనే దుకాణాన్ని తెరిచాడు…” కెవీపీ ఇంకో రెండు ఆజ్యం చుక్కలు పోశాడు.
వైఎస్‌ భగ్గుమన్నాడు. చిటపటలాడాడు. చిందులు తొక్కాడు. కాస్సేపు కోపంగా పచార్లు చేసి స్థిమితంగా సోఫాలో కూర్చున్నాడు.
“ఇక లాభం లేదు. వీళ్ళకి బుద్ధొచ్చేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి …” అంటూ వైఎస్‌ ఆలోచించసాగాడు.
“మళ్ళీ ఏ తుఫానో, వరదలో వస్తే బాగుణ్ణు … అందరి దృష్టీ అటువైపు మళ్ళి, కొన్నాళ్ళు ఈ గొడవలు మర్చిపోతారు” అన్నాడు కేవీపీ.
తుఫాను అనగానే వైఎస్‌ బుర్రలో ఓ బల్బు వెలిగింది. కాసేపు తనకొచ్చిన అయిడియా మీద వర్కవుట్‌ చేసి, కేవీపీతో అన్నాడు.
“ఈ సంక్రాంతి సందర్భంగా మనం లాల్‌బహదూర్‌ స్టేడియంలో గాలిపటాల పోటీ నిర్వహిస్తున్నాం …” కేవీపీ అర్థం కానట్టు చూశాడు.
వైఎస్‌ చిర్నవ్వు నవ్వాడు. “అర్థం కాలేదా? చెబుతా విను! ప్రత్యేక ర్రాష్టాలు కోరుతున్న వాళ్ళందర్నీ ఈ గాలిపటాల పోటీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిద్దాం … ఎవరి గాలిపటం బాగా ఎగిరితే వాళ్ళ డిమాండ్‌ ఒప్పుకుంటామని ఎనౌన్స్‌ చేద్దాం…”

“ఏడ్చినట్టే ఉంది … సంక్రాంతి సీజన్‌లో గాలిపటాలు ఎగరక చస్తాయా? అనవసరంగా అభాసుపాలవుతావు, జాగర్త” హెచ్చరించాడు కేవీపీ.
“నాకామాత్రం బుర్ర లేదనుకున్నావా? ఈ విషయంలో మన వరుణుడి సాయం తీసుకుందామనుకుంటున్నాను” అన్నాడు వైఎస్‌.
కేవీపీ ఎగతాళిగా నవ్వాడు. “అంటే … గాలిపటాల పోటీపెట్టి, వరుణుడి చేత వర్షం కురిపించి, వాళ్ళ గాలి పటాలు ఎగరకుండా చేద్దామనుకుంటున్నావా? అలాగే జరిగితే … పోటీని వాయిదా వేయమంటారు … అయినా వరుణుడు మన పార్టీ వాడు .. ఇదంతా మన కుట్రేనని వాళ్ళు ఇట్టే పసికట్టేస్తారు …”
“చూస్తుండు … వరుణుడికేం చెబుతానో!” అంటూ వైఎస్‌ మనసులో వరుణ దేవుణ్ణి ధ్యానించాడు.
వరుణుడు ప్రత్యక్షమై ఒళ్ళు విరుచుకున్నాడు. “సుబ్బరంగా రెస్టు తీసుకుంటున్న నన్ను నిద్రలోంచి లేపావు … ఏం కావాలో చెప్పు” విసుక్కుంటూ అన్నాడు.
వైఎస్‌ టూకీగా గాలిపటాల పోటీ గురించి చెప్పి, “మీరో హెల్ప్‌ చేయాలి” అని కోరాడు.
“కొంపతీసి వర్షం కురిపించాలా, ఏమిటి? ఇది నా సీజన్‌ కాదు .. బాగుండదు” అంటూ నీళ్ళు నమిలాడు వరుణుడు.
“వర్షం అక్కర్లేదు లేవయ్యా! మీ ఫ్రెండు వాయుదేవుడితో చెప్పి, ఓ గంటసేపు అక్కడ గాలి ఆడకుండా చేయాలి. మనుషులకి ఊపిరాడితే చాలు … గాలిపటాలు మాత్రం ఎగరకూడదు … అది మీ వాయుదేవుడికే సాధ్యం … ఎలాగైనా ఈ సాయం చెయ్యాలి, ప్లీజ్‌” అంటూ బతిమాలాడు వైఎస్‌.
వరుణుడు కాసేపు బెట్టుచేసి, చివరికి ఒప్పుకున్నాడు.

* * *
లాల్‌బహదూర్‌ స్టేడియంలో గాలిపటాల పోటీకి ‘ప్రత్యేక’ అతిథులంతా విచ్చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్‌, నరేంద్ర; రాయలసీమ నుంచి టీజీ వెంకటేశ్‌, గంగుల ప్రతాపరెడ్డి, వీరశివారెడ్డి; కోస్తాంధ్ర నుంచి యలమంచిలి శివాజీ, కర్నాటి రామ్మోహనరావు; ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ ఉరఫ్‌ సత్తిబాబు ‘ప్రత్యేక’ గాలిపటాలతో రెడీగా నించున్నారు.
వైఎస్‌ మైకు ముందు నిలబడి ఉపన్యాసం మొదలుపెట్టాడు.
“నా ఆహ్వానాన్ని మన్నించి, గాలిపటాల పోటీలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ సుస్వాగతం. నేనిప్పుడు రెడీ, వన్‌, టూ త్రీ అనగానే మీరు గాలిపటాలు ఎగరేయాలి. ఎవరి గాలిపటం బాగా ఎగిరితే, వాళ్ళ డిమాండ్ని నేనొప్పుకుంటాను. గాలిపటాలు ఎగరకపోతే మాత్రం ఎవరి దుకాణం వాళ్ళు కట్టేసి ఇంటికెళ్ళి బబ్బోవాలి. సరిగ్గా గంటసేపు టైమిస్తున్నాను. ఒకేనా! రెడీ … వన్‌ …!”
అంతే … అప్పటిదాకా అందర్నీ ఆహ్లాదపరుస్తూ, రివ్వుమంటూ వీస్తున్న గాలి ఒక్కసారిగా స్తంభించిపోయింది. చెట్టుమీద ఆకులు కూడా కదలడం మానేశాయి. ‘ప్రత్యేక’ అతిథులు గాలిపటాలు లేపడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా అవి లేవడం లేదు. మన్నుతిన్న పాముల్లా నేలమీద బొక్కబోర్లా పడుకున్నాయి. అతిథులు దారాలు పట్టుకుని గ్రౌండ్‌లో అటూ ఇటూ పరుగులు పెడుతున్నా అవి అంగుళం కూడా పైకి లేవడం లేదు. “పద, పదవే, ప్రత్యేక గాలిపటమా!” అంటూ పాటలు పాడినా ప్రయోజనం లేకపోయింది.

“ఇది కచ్చితంగా వైఎస్‌ కుట్రే!” నరేంద్ర కేసీఆర్‌ చెవిలో గొణిగి, “ఉండండి, చెబుతాను” అంటూ వైఎస్‌ దగ్గరికి వెళ్ళారు.
“సార్‌, నాదో చిన్న మనవి … మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరే వివరిస్తే వినాలని ఉంది. సరిగ్గా గంటసేపు ఉపన్యాసమిస్తే చాలు … ఈలోగా ఇక్కడ ఏం జరిగినా సరే, మీరు మాట్లాడ్డం మాత్రం ఆపకూడదు” అంటూ నరేంద్ర అభ్యర్థించాడు.
వైఎస్‌ పొంగిపోయి, ‘అలాగే’ అంటూ మైకు అందుకుని మొదలుపెట్టాడు.
“మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఒక్క గంటకాదు, వెయ్యి గంటలు కూడా సరిపోవు అధ్యక్షా! మేం అధికారంలోకి వచ్చేనాటికి ఈసురోమని ఉన్న సగటు మనిషి ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఇదొక్కటి చాలు అధ్యక్షా, మా అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పడానికి…”
నేలమీద అతుక్కుపోయి ఉన్న గాలిపటాలు తోకతొక్కిన తాచుల్లా పైకి లేచాయి.
“జలయజ్ఞం చేశాం, భూయజ్ఞం చేశాం .. ఎక్కడా ఎకరా పొలం కూడా ఎండకుండా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం…” వైఎస్‌ చెప్పుకుపోతున్నాడు.
గాలిపటాలు రివ్వురివ్వుమంటూ ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించాయి.
“ఇదేమిటీ చోద్యం” రయ్‌మని ఎగురుతున్న తన గాలిపటాన్ని చూస్తూ పరవశంగా నరేంద్రని అడిగాడు కేసీఆర్‌.
“వైఎస్‌ని అభివృద్ధి గురించి ఉపన్యాసం ఇవ్వమన్నాం కదా! దాని ప్రభావమే ఇది” అన్నాడు నరేంద్ర.
“వైఎస్‌ ఉపన్యాసానికీ, మన గాలిపటాలు ఎగరడానికీ ఏమిటి సంబంధం?” అర్థంకాక అడిగాడు కేసీఆర్‌.
“అవన్నీ వట్టి గాలి కబుర్లే కదా! ఆ మాత్రం గాలి చాలు మన గాలిపటాలు ఎగరడానికి” టూకీగా తేల్చేశాడు నరేంద్ర.
(రాజగోపాల్ రచన)

7 thoughts on “ఈ గాలి నాదిరా!

  1. భలే భలేగా వుంది.
    ఇదే ఎప్పుడూ నాలో మెదులుతూ వుంటుంది. వాగ్దానభంగానికి శిక్షంటూ ఏమీ లేదా? ఇలా ఏదంటే అది చెప్పేసి అందరికీ అన్నీ వుచితమని ఆయాచిత వరమిచ్చేసి అందలమేక్కేస్తే ఇక వాళ్ళనడగడానికి మార్గమే లేదా? తన పాదయాత్రలో ఎన్ని వాగ్దానాలు చేశాడు? ఎన్ని వుచిత వరాలు వుచితంగా ఇచ్చాడు. చేతికి ఎముకే లేనట్టు అడిగిన వారెవ్వరికీ లేదనకుండా వరాలిచ్చేశాడు. చివరికి అన్నలక్కూడా అరచేతిలో స్వర్గం అన్నాడు. పులి గడ్డి తింటుందంటే ఎవరైనా నమ్ముతారా? నక్సలైట్లు తుపాకులు వీడతారంటే ఎవరైనా నమ్ముతారా? అప్పుడు వాళ్ళు నక్సలైట్లు ఎలా అవుతారు? ఇలాంటివేమీ పట్టకుండా అందరికీ అన్నీ అని అన్నీ తానై శఠగోపం పెడుతున్నాడు.
    పోనీ ఈయన కలల పంటైన జల యజ్ఞమన్నా సవ్యంగా జరిగితే బాగుండు. ఈయన హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్లు వచ్చే నాయకుడి కాలానికి వుండకుంటే ఎవరిని అడగాలి?
    ఇంత చురుగ్గా వున్న న్యాయవ్యవస్థ కూడా ఏమీ చేయలేదా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. శ్రీనివాస గారు, నా పోస్టును చదివి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరినందుకు సంతోషం. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతూందో నాకు తేలియయకపోతే, మీకు తెలిసింది విపులీకరించండి. విషయం మంచిదైతే చదివి సంతోషిస్తాను.

    అభిప్రాయాల్ని పత్రికల్ని చూసి మాత్రమే ఏర్పరుచుకోనవసరం లేదండీ, మా ఊరిలో మిషన్ కాంపౌండ్ గ్రౌండ్స్ లో రాజశేఖరరెడ్డిచే ఆవిష్కరించబడిన 3 అనాధ శిలాఫలకాలను చూసి కూడా ఎర్పరుచుకోవచ్చు. పోయిన అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్సు మ్యానీపెస్టోను ఇప్పుడు ఒక్కసారి చదివితే ఇంకా బాగా ఎర్పరుచుకోవచ్చు. కుడి’చేతి’తో ఇచ్చినట్టే ఇచ్చి ఎడమ’చేతి’తో లాగేసుకొనే ఈ ప్రభుత్వ పోకడలు ఎవ్వరికి తెలియదు? ఊరూరా వాడవాడలా బెల్టు షాపులు తెరచి, జనాలు సారా తాగకుండా నిరుత్సాహ పరిచేందుకు విస్తృత ప్రచారం చేస్తాం అన్నారు. ఇంతకన్నా పెద్ద కామెడీ, మాటల గారడీ మీరెరుగుదురా? పోతే పోనీ ప్రచారం అన్నా నిర్వహించారా అంటే అదీ లేదు. ఏ టెండరు చూసినా ఒకటే కథ, ఐతే కాంట్రాక్టర్లను చెదిరించడం లేకపోతే రింగుగా ఎర్పడడం. ఇట్టాంటోళ్ళు నిర్మించే ప్రాజెక్టులు ఎలా ఉంటాయో చెప్పాలా? లేక ప్రజల సొమ్ము ఎంత మొత్తంలో స్వాహా అవుతుందో చెప్పాలా?

    పంటలు పండిస్తామంటే కరెంటుండదు, కరెంటుండి పండించుకొంటే సరైన గిట్టుబాటు ధర పలకదు. ఈ వాళ ద్రవ్యోల్బణం (Inflation) 6 కు మాటే. ఇది ఒక రికార్డు. నెల నెలకు ఎగబాకుతున్న నిత్యావసర వస్తువుల ధర, ప్రతి 6 నెలలకు సమీక్షించబడే రిజిస్ట్రేషన్ ఫీజులు. ఇవన్నీ చాలవా ప్రభుత్వం మీద ఎదో ఒక అభిప్రాయం ఎర్పరుచుకోవడానికి? ఇంత చెప్పడం ఎందుకు….మంత్రి వర్గ విస్తరణకు భయపడే సీయెం అన్ని మాటలు నిలబెట్టుకొంటాడంటే నమ్మేదెలా?

  3. విహారి గారు, మీరన్నది నన్నా ప్రవీణ్ నా? ఈ పోస్ట్ లో ప్రవీణ్ కామెంట్స్ ఎక్కడా లేవే!!! బహుశా నవీన్ అనబోయి ప్రవీణ్ అని వ్రాశారా? అయితే ఓకే :)

  4. నవీన్ గారు,

    మిమ్మల్నే నండి.

    ఏంటోఎ ఈమధ్య నవీనా ప్రవీణా అని తెగ కన్ ఫ్యుజన్ వచ్చేస్తోంది. దానికి విరుగుడేంటి చెప్మ !!!

    ఆలస్యంగా సమాధానమిచ్చినా. సమాధాన మిచ్చానన్న తృప్తి మిగిలింది.

    గూగుల్లో నా “విహారి”(తెలుగు) పేరు మీద సెర్చ్ కొట్టా అందులో నా వ్యాఖ్యకు మీ వ్యాఖ్య కనిపించింది. దాన్ని పట్టుకుని ఇక్కడికొచ్చా.

    విహారి

Leave a reply to విహారి స్పందనను రద్దుచేయి