ఆనందానికి 10 సూత్రాలు

జీవితమే అనందమయం

తరాలు తిన్నా తరగని ధనముంది
ఎదటి మనిషిని ఎదిరించే ధైర్యముంది

ముప్పొద్దులా ఘుమఘుమలాడే తిండుంది
విశ్వకర్మే విస్తుపోయేంతటి భవనముంది

ఊరంతా గొప్పగా చెప్పుకునే పేరుంది
అందరూ జేజేలు పలికే ప్రఖ్యాతుంది

ఇంట్లో ఎదురూచూసే భార్య ఉంది
మురిపించి మరపించే సంతానముంది

తప్పు చేస్తామని చూచే సంఘముంది
పలకరిస్తే పులకరించే స్నేహముంది

అనుభూతుల్ని దాచుకొనే మనస్సుంది
అంతరిక్షంలోకి ఎగరగలిగే విఙ్ఞానముంది

కానీ వస్తూ..పోతూ..
మనతోనే ఉన్నట్టనిపిస్తూ..
అంతలోనే మాయమైపోతూ..
ఉన్నదని భ్రమించేలోపే లేదన్న చేదు నిజాన్ని తెలియజేస్తూ
ఎండమావిలాంటి అందమైన “ఆనందం”, జీవితంలో అచ్చంగా మన సొంతమౌతుందా?

****************************************

“ఎందుకు లేదు…ఎప్పుడూ నేను ఏ టెన్షన్సు లేక ఆనందంగానే ఉంటానే” అంటారా…అలా అనే వాళ్ళకు నా శతకోటి అభినందనలు. జన్మ జన్మల పుణ్యఫలం మీ ఆనందం. అలాగే ఉండండి…నలుగురునీ అలాగే ఉంచండి.

****************************************
మొన్న కొత్తపాళీగారు తమ బ్లాగులో “జీవిత పరమార్థం” గురించి అడిగినప్పుడు దాదాపు అందరూ “ఆనందం”గా ఉండటమే అని సమాధానం వ్రాశారు. మనకు ఆనందంగా ఉండటం ముఖ్యం అని తెలుసు, కానీ ఎలా ఉండాలో తెలియదు.
జీవతమంతా ఆనందంగా ఉండాలని లేనిదెవ్వరికి?

మీ ఇంటి వెనక ఓ పెద్ద గొయ్యి ఉందనుకొందాం. చిన్నప్పట్నుంచి రోజూ కొంత చెత్త వేస్తూ వస్తున్నారనుకుందాం. పెద్దయ్యే పాటికి ఆ గొయ్యి ఏమౌతుంది? చెత్తతో నిండిపోదూ? అసలు ఆ చెత్తను పొయ్యడానికి ‘పెద్ద’ గొయ్యి అయినా సరిపోతుందా? సరిపోదు, మనమే వీలైనప్పుడంతా ఆ చెత్త తీసేస్తూ మునిసిపాలిటీ ట్రాక్టర్లో వేస్తూ ఉండాలి, అప్పుడే గొయ్యి ఖాళీగా ఉండి…ఏ వర్షమో పడ్డప్పుడు నీళ్ళు నిండుతాయి…భూమి దాహాన్ని తీరుస్తాయి. మన మనస్సు కూడా సరిగ్గా గొయ్యి లాంటిదే. చిన్నప్పట్నుంచి చెడు ఆలోచనలు, తప్పు ఆలోచనలు (negative thinking) అనే చెత్తను మన మనస్సనే గొయ్యిలో వేస్తూనే ఉన్నాం? మరి ఆనందమనే వర్షానికి వచ్చే నీరు నింపుకోవడానికి…అనుభూతి చెందటానికి మన మనస్సులో ఖాళీ ఏది? మనలోనే ఎన్నో వికారాలను నింపుకొని మన ఆనందాని మనమే చిదిమేసుకుంటాం. అసలు మనం ఆనందంగా ఉండాలంటే మొదటి మెట్టు మనలో లోపాలు ఉన్నట్టు మనం తెలుసుకోవడం, మనం పరివర్తన చెందాలన్న బలీయమైన కోరిక కలగడం.

సదా ఆనందంగా ఉండాలంటే, మనలో కొన్ని గుణాలు నింపుకోవాలి, అలవాట్లు చేసుకోవాలి. ఆనందంగా ఉండటానికి నా అనుభవం నేర్పిన ఓ పది పాఠాలను మీతో పంచుకుంటున్నాను.

1) అందరిలోని మంచినే చూస్తూండాలి
2) సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి
3) చెడులో కూడా మంచినే చూడాలి
4) వ్యర్థాన్ని సమర్థంగా చేసుకోవాలి
5) నిందా స్థుతులలో ఒకటిగా ఉండాలి
6) సహనశీలతా గుణం చాలా మంచిది
7) అపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి
8) సమస్యలు మనలను వదలవు, మనమే వాటిని వదిలెయ్యాలి
9) అందరి స్వభావ సంస్కారాలతో కలసిపోవాలి. (Flexible and adaptable)
10) మాట మధురంగా ఉండాలి

Stephen Covey 8th habbit లాగా, పైన వ్రాసిన ఒక్కో వాక్యం గురించి ఒక్కో పుస్తకం వ్రాయొచ్చు. పుస్తకం వ్రాయలేకపోయినా..కనీసం ఓ టపా అన్నా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

25 thoughts on “ఆనందానికి 10 సూత్రాలు

  1. భలే భలే .. నా టపా మీద వచ్చిన వ్యాఖ్యలూ, ఇతర బ్లాగు టపాలూ చదివి ఈ విషయమే ఆలోచిస్తున్నా. ఒకలా చూస్తే జీవిత పరమార్ధం ఆనందం అనేది నిర్వివాదం, కానీ ఆ ఆనందం యెలా వస్తుంది. కోవీ ప్రసక్తి తెచ్చి ఇంకో మంచి పని చేశారు. ఎనిమిదో అలవాటు (రాశాడని తెలుసు గానీ చదవ లేదు) నాకు తెలీదు గానీ ఏడు అలవాట్లనీ నిరంతరం అధ్యయనం చేస్తున్నా. మళ్ళి మాట్లాడతా దీన్ని గురించి.

  2. అన్ని సూత్రాలూ ఇలానే మొదలౌతాయి. తర్వాత అవన్నీ ఎదుటి వారినుండీ expect చెయ్యడం మొదలుతుంది. అక్కడే తంటా.
    ఆనమదం పరమార్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
    కానీ ప్రతి క్షణం ఆనందం అనేది కూడా పేరాశే. బాధ కలిగించేది జరిగితే బాధ కలుగుతుంది. ఆ బాధకి లొంగిపోకుండా ఉండగలగాలి.
    మా చిన్నబ్బాయి బస్సు స్టాపులో అందరికన్నా ముందుండాలని తాపత్రయ పడడం మొదలు పెట్టాఆడు. ఇంకో అబ్బాయి వాడితో పోటీకొచ్చే వాడు. రెండు రోజులు తెగ ఏడ్చాడు. మూడో రోజు అర్థం చేసుకున్నాడు. ఆ అబ్బాయి తనకంటే ముందు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయితో ఆడుకోవడానికి ఎదురు చూస్తాడు, అతనికంటే ముందు ఉండడానికి కాదు. ముందు ఉంటే సంతోషమే కాని దాని ప్రాముఖ్యత ఇప్పుడు వాడికి ఎక్కువ లేదు.
    సంతోషంగానే ఉండాలి అన్నది కూడా stress factor. సీతాకోకలు, గొంగళీపురుగుల ఉపమానం నాకు నేర్పినది అదే.
    అన్నిటికంటే ముఖ్యం, పరాజయాలు, పరాభవాలు జీవితంలో part and parcel అని మర్చిపోకూడదు.
    Fear of failure ని జయించాలి.
    We got to do what we got to do is what I understood so far.
    ఇవి నా కోసం చెప్పుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే “ఆనందం”:-)

  3. @సోమశంకర్, కొత్తపాళీగారికి
    మీ వ్యాఖ్యలకు నా :)లు

    @లలితగారికి
    >> ఎదుటి వారినుండీ expect చెయ్యడం మొదలుతుంది. అక్కడే తంటా.
    1) అందరిలోని మంచినే చూస్తూండాలి
    3) చెడులో కూడా మంచినే చూడాలి

    >>బాధ కలిగించేది జరిగితే బాధ కలుగుతుంది. ఆ బాధకి లొంగిపోకుండా ఉండగలగాలి.
    4) వ్యర్థాన్ని సమర్థంగా చేసుకోవాలి
    8) సమస్యలు మనలను వదలవు, మనమే వాటిని వదిలెయ్యాలి

    >>సంతోషంగానే ఉండాలి అన్నది కూడా stress factor.
    సరైన మార్గంలో పయనించక..గమ్యం కానరాదేమీ అని తెగ ఆలోచిస్తూంటే కలిగేది వత్తిడే. సరైన మార్గం కనుగొనడంలో ఉంది టెక్నిక్కంతా. అసలు ఆనందంగా ఉండటమన్నదే వత్తిడిని వదిలెయ్యటం. ఆనందంగా ఉండటానికి వత్తిడికి గురౌతూంటే…..సరైన విధంగా ఆలోచించటం లేదేమో

    >> కానీ ప్రతి క్షణం ఆనందం అనేది కూడా పేరాశే.
    ఇది ఆశ కాదండి. మన జీవిత పరమార్థం. ఆనందంగా ఉండటం లేకపోవటం మన చేతుల్లోనే ఉంది. ఆనందంగా ఈ జన్మకు కాకపోతే ఎప్పుడుంటాం? అందుకే ఆనందగా గడపాలన్న ఆలోచన పేరాశ కానే కాదు. సత్యం తెలుసుకోవడమేమో అనిపిస్తుంది.

    >>అన్నిటికంటే ముఖ్యం, పరాజయాలు, పరాభవాలు జీవితంలో part and parcel అని మర్చిపోకూడదు. Fear of failure ని జయించాలి.
    అంతేగా మరి…జీవితమలో సంఘటనలన్నీ మనకు అనుకూలంగా ఉండవు. కానీ మనసుస్సునెప్పుడూ నిలకడగా ఉంచుకోవాలి. ( 5) నిందా స్థుతులలో ఒకటిగా )ఉండాలి

    [
    publishing this comment from Bahrain Airport :)
    Waiting for my Bangalore flight (GF272) @ Gate 12A
    ]

  4. నిన్ను నిరాశ పర్చడం ఎందుకులే నవీన్.
    సూత్రాల విలువ అన్వయాన్ని బట్టి ఉంటుంది అని మాత్రమే నేను చెప్పదల్చుకుంది.
    నువ్వు ఈ సూత్రాలను పాటించేటప్పుడూ ఎప్పుడైనా సందిగ్ధం వస్తే దానిని ఎలా తేల్చుకున్నావో, ఇంకా ఈ సూత్రాల్ అమలు పర్చుకోవడంలో అనుభవాలు కూడా రాయ గలిగితే బావుంటుందేమో, అప్పుడప్పుడూ.

  5. @కొత్తపాళీ గారు : మీ నుండి ఎంతో అంతర్మధనంతో వెలువడిన ‘జీవిత పరమార్ధమేమిటి’ అనే ప్రశ్న, గడ్డిపూలపై అప్పుఢే పడిన వేకువ తొలి మంచుబిందువులా స్వఛ్ఛంగా కనులముందు/మనసుపొరలలో కదులుతూ ఉంటే ఇప్పుడు మీరు ‘జీవిత పరమార్ధం ఆనందం’ అనటం ఆశ్చర్యాన్ని/ఆనందాన్ని(ఇంత తొందరగా తెలుసుకున్నందుకు) కలుగజేస్తున్నా, నిర్వివాదం అనే పదప్రయోగం కొంత బాధని(మీలాంటి ఆలోచనాపరులు కూడా ఇలా అనటం చూసి) కూడా కలుగజేస్తుంది…..వీలైతే నేను కుడా బ్లాగుతా ఈ జీవితపరమార్ధం గురించి .. అప్పుడు కలుద్దాం మరలా.

  6. “సంతోషంగానే ఉండాలి అన్నది కూడా stress factor.”
    చదవంగానే నవ్వొచ్చినా, చాలా మంచి మాట చెప్పారు లలితా.
    నవీనుకేమి, యెన్నైనా చెబుతాడు. రేపు పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి మర్నాడు పొద్దున్నే తనకి ముఖ్యమైన క్లయంటు మీటుంగుండగా అర్ధరాత్రి రెండు గంటలకి లేచి అకారణంగా ఏడ్చే పిల్లాణ్ణి సముదాయించాల్సి వొచ్చినప్పుడు .. అప్పుడు తెలుస్తుంది .. ఏం నవీనూ?
    ఈ సంతోషంగా ఉండటం మీద ఈ మధ్యన ఒక ఆలోచన విన్నాను. కానీ దాని గురించి ఇంకా నాలోనే అంతర్మథనం జరుగుతోంది. దాన్ని బయటికి తెచ్చే ప్రయత్నంలో మొదటి అడుగే నా జీవిత పరమార్ధం టపా. చూద్దాం, ఎలా ఎదుగుతుందో యీ ఆలోచన!

  7. ఆనందంగా ఉండాలంటే నేను పాటిచ్చే ఒక సింపుల్ సూత్రం – రొజుకొకరిని ఆనంద పడేలా చేయడం. ఉదాహరణకి ఆటోలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆటో వాడికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి చూడండి. అతని ముఖములోని ఆనందాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి.
    ఎదుటివారికి / మీతో పాటూ ఉన్న వారికి ఏమి చేస్తే / ఇస్తే ఆనంద పడుతారో అవి మీరు చేస్తే సరి.ఎదుటివారి నుంచి మీరు ఏమి ఆశించకూడదు.
    న్యూటన్ లా ప్రకారం వాళ్ళ రియాక్షన్ కూడా అలానే ఉంటుంది.

    ఆల్ హ్యపీస్…

  8. @లలిత గారు
    >> నిన్ను నిరాశ పర్చడం ఎందుకులే నవీన్.
    ఇంతకు ముందు, మీ సమాధానం ప్రాక్టికల్‌గా ఆలోచించి చెప్పారని అర్థమైంది. నూటికి తొంభై సార్లు జరిగేదిదే. మనం ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదిచి ఉంటాము. అందులో ఉన్న విషయాలను, కనీసం మనకు నచ్చిన విషయాలను పాటించేది ఎందరు? తెల్లవారే నిద్రలేవటం, తొందరగా పడుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు, మరి ఎన్ని సార్లు దీన్ని పాటిస్తాము? ఇల్లాంటివే చాలా చూసి, ఆలోచించి సమాధానం చెప్పారనుకుంటాను. అదీ కాక నిత్యం లక్షల ఘోరాలు జరిగే ఈ కలియుగంలో సదా ఆనందంగా ఉండటం కష్టసాధ్యమైన పనే. ఒక రకంగా టన్నుల కొద్దీ చెత్త కుప్ప మధ్యలో కూర్చొని ఒక మల్లెపువ్వు వాసన చూడటం లాంటిదేమో అనిపిస్తుంది. కానీ సంకల్పం, ఆశావాదం ఉండటం మంచిదే కదా!!! కృషి ఉంటే మనుష్యులు ఆనంద స్వరూపులౌతారు :)
    >>ఇంకా ఈ సూత్రాల్ అమలు పర్చుకోవడంలో అనుభవాలు కూడా రాయ గలిగితే బావుంటుందేమో, అప్పుడప్పుడూ.
    మంచి సూచన చేశారు. తప్పకుండా నా అనుభవాలు వ్రాస్తాను.

    @తెలుగు ‘వాడి’ గారు
    మీరు అస్సలు బాధ పడనవసరం లేదండి :) కొత్తపాళీ గారు ఏమన్నారో ఇంకోసారి చదవండి. నిర్వివాదం ముందు “ఒకలా చూస్తే” అన్న పదాలు కనిపిస్తాయి. దీనర్థం, ఈ విషయాన్ని ఇంకోలా కూడా చూడవచ్చు అనే కదా అర్థం. మీరు జీవితాని ఏ వైపు నుంచి చూస్తారో తప్పకుండా మీ బ్లాగులో వ్రాయండి.
    అసలు ఆనందం అనేది బై ప్రోడక్టు. కొందరికి సేవ చెయ్యడంలో ఆనందం లభిస్తుంది. మరికొందరికి సహాయం చెయ్యడంలో లభిస్తుంది. వీటంతటికీ స్వచ్చమైన మంచి మనసు, మంచి గుణాలు,పరిస్థుతులకు తగ్గట్టు నెగ్గుకురాగలిగే ఓర్పు, తెలివి ఉండాలి.
    జీవితం సార్థకం ఐతేనే కదా ‘జీవిత పరమార్థానికి’ అర్థం!!
    @అశోక్,
    అశోక్ ఆల్వేస్ రాక్స్……..
    ఆల్ హ్యాపీస్‘ :)

  9. అశోక్ గారు,
    ఆనందానికి మీరు చెప్పిన సూత్రం చాలా బావుంది.
    నవీన్,
    నీ సూత్రాలతో నీ అనుభవాలు పంచుకుంటాననన్నందుకు thanks.

    ఆశాభావానికి ఆశీర్వచనాలు.
    సాధనమున పనులు సమకూరు ధరలోన!

  10. What a bunch of juveniles !! :)
    అంటే నేను జీవిత పరమ సత్యాన్ని తెలుసుకున్న యోగిని జ్ఞానిని అని అనట్లేదు గాని. ఇలా అందరూ గగనకుసుమమని తెలిసి కూడా ఆశ చంపుకోలేక ఆ నిత్యానందాన్ని వెంటాడడం కొంత నవ్వుకలిగిస్తుంది.
    నా పనికి మాలిన అభిప్రాయం ! అంతే !
    అన్నట్టు సంతోషం విషయమై, ప్రతి ఒక్కరికి తమ తమ comfort zones ఉంటాయని ఎక్కడో చదివాను.

  11. భలే మంచి చర్చ జరిగింది. నేను రాకేశ టైపనుకోండి ఈ విషయంలో…
    ఐడియల్ కీ ప్రాక్టికల్‌కీ చాలా తేడా ఉంది. కనీసం నా విషయంలో అయితే అంతే.
    అలాగని ప్రయత్నించ కూడదని నా ఉద్దేశం కాదు.

    పైన చెప్పినవన్నీ మంచి సూత్రాలు. అమలులోకి తెస్తే మంచిదే.

  12. @రాకేశీ,
    నేనేదో మొన్నేదో అనుకొని, నిన్నంతా ఆలోచించి, ఈ రోజు ఏదో టపా వ్రాయలేదు. ఆనందం వెతుక్కోవడంలో నేనూ కొన్ని యేళ్ళ పెట్టుబడి పెట్టాను. ఇప్పుడిప్పుడే మార్గం / గమ్యం కనిపిస్తున్నాయి.

    >> ఇలా అందరూ గగనకుసుమమని తెలిసి కూడా ఆశ చంపుకోలేక
    ఆనందంగా ఉండాలనుకోవడం ఆశ కాదు నాన్నా, ఆనందంగా ఉండటమనేది మన హక్కు.
    >>౯౯.౯౯ శాతం.
    100% అని కాన్ఫిడెంట్‌గా చెప్పలేదే :)
    >>What a bunch of juveniles !! :)
    నీ అభిప్రాయాలు నీవి. వాటిని తప్పక గౌరవిస్తాను. నాకు ఉపయోగపడిన విషయాలు పంచుకోవడం వరకే నా పని. జనాలు వాటిని ఉపయేగించుకుంటారా లేదా అన్నది నా పరిదిలో లేదు కదా.

    పైన నేను చెప్పిన పాయింట్లన్నీ పాటిస్తూ…సదా ఆనందంగా ఉండేవాళ్ళు నాకు తెలుసు. నాకు ఆత్మీయులు కూడానూ. అలా తయారవడనానికి వాళ్ళకు ఎన్నో యేళ్ళు పట్టింది, కానీ ఫలితం అద్భుతం ….అమోఘం. తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పైన చెప్పినవి నా జీవితంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి, పడుతున్నాయి.నా పర్సనల్ విషయాలు బ్లాగుల్లో వ్రాయడం ఇష్టం లేక ఇవేవి ఇంతవరకు వ్రాయలేదు.
    అన్నీ కాకున్నా..నేను వ్రాశిన మొదటి పాయింటు పాటించగలిగినా చాలు. తేడా మీరే స్పష్టంగా చూస్తారు.

    @ప్రవీణ్,
    >>ఐడియల్ కీ ప్రాక్టికల్‌కీ చాలా తేడా ఉంది.
    నిజమే. కానీ నేను చెప్పినవి ఆచరించలేనంత ఐడియల్‌గా ఏమీ లేవే. ఐనా తమ గురించి ఆలోచన ఒక్కోరికి ఒక్కో వయసులో కలుగుతుందిలే.

  13. నవీన్ చాలా ఓపికగా సమాధానాలు ఇస్తున్నావు.
    రమణి గారి పోస్టుకి ఇచ్చిన సమాధానాలూ చూశాను.
    నిజంగా కుతూహలం ఎక్కువౌతోంది నీ సాధన గురించి తెలుసుకోవాలని.
    అంటే స్వంత విషయాలు రాయమని కాదు.
    మొదటి సూత్రం ఆచరించి భళ్ళున బోర్లాపడ్డాఅను చాలా సార్లు.
    ఎందుకంటే మంచినే చూద్దామనుకుని నేను వారు చెప్తున్న దాంట్లో reading between the lines చెయ్యక చాలా సందేశాలని మిస్ అయ్యాను.
    దాని ద్వారా పాఠాలూ నేర్చుకుంటూ ఉన్నాను. నేను నా సూత్రాలను అన్వయించుకునే పద్ధతుల్నీ evaluate చేసుకుంటున్నాను.
    బోలెడన్ని ఆలోచనలు ప్రవాహాంలా ఆగకుండా సాగుతున్నాయి.
    రాయాలి ఎప్పుడో.
    మళ్ళీ ఒక సారి, నీ ఆలోచనలు బాగుంటున్నాయి.
    All the best.

  14. @నవీన్ – మంచి టపా. మీ సూత్రాలు బాగున్నాయి. వాటిలో కొన్ని పాటించడం వల్ల నేను చాలా ఆనందం పొందగలిగా (ఈరెండు రోజుల్లోకాదు – ఇప్పటి దాకా జీవితంలో). ఈ సూత్రాలు ఐడియల్ కాదు- ప్రాక్టికల్లే. లలితగారు చెప్పినది నిజం- మీరు చాలా ఓపికగా సమాధానాలిస్తారు.

    @లలిత గారూ- మీ సహజ బాణీలో చేసిన వ్యాఖ్యలు మీకు ఈసూత్రాలపట్ల నమ్మకం కలగలేదని తెలుస్తోంది. మీ తర్వాతి కామెంటు చదివాకా మీ అనుభవాల దృష్ట్యా మీకు నమ్మకం కలగలేదని అర్ధం అయింది. కొన్ని సూత్రాలు మనం పాటించడం అవతలి వాళ్ళ సహృదయత మీద ఆధారపడుతుంది. కానీ మనం నమ్మిన సూత్రాలని ఆచరించడం మానేయఖ్ఖర్లేదు. ఇవి ప్రాధమిక విఘ్నాలు. సూత్రం అదే అయినా, మనం ఎన్నుకున్న పూలని బట్టి, మన మాలకట్టే నైపుణ్యాన్ని బట్టి మన దండ (ఫలితం) ఉంటుంది.
    మీ అబ్బాయి ముందు బస్సెక్కడానికి పడిన పోటీ మానవ సహజం. అది సాధ్యం కాదని రాజీపడి, దానికి ప్రాముఖ్యం ఇవ్వడం మానేయడం మంచి పద్ధతే. కానీ సాధించగలిగీ కూడా, వదులుకోగలగడం సాధించదగిన స్థితి. అలాగే, ఇలాంటివి సాధించడంలో ఏమీ అనందం లేదని తెలుసుకోవడం పరమార్ధసిద్ధి. అప్పటి ఆనందం వేరు.

    @రాకేశ్వర రావు- నేను మీపక్షం కాదు- ౯౯.౯౯+0.01 శాతం. ))

  15. సత్యసాయి గారు, నా సహజ బాణీ ఏమిటో కాస్త వివరంగా చెప్తే దాని అర్థం చేసుకుంటాను.
    సీరియస్‌గా.
    ఇక పోతే మా అబ్బాయి విషయంలో చెప్పింది, వాడు సాధించగలిగినప్పుడు కూడా ఆ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ఇదంతా రెండు రోజుల్లో కలిగిన growth. నాకు నిజంగా చాలా బాగా అనిపించిన విషయం. పెద్ద వాడిని పెంచడంలో చేసిన పొరపాట్లు చిన్నవడి విషయంలో పనికి వస్తున్నాయి. వాడి విషయంలో ఫలితాలు చూశాక ఇప్పుడిప్పుడే పెద్ద వాడికి కూడా అప్ప్లై చేస్తున్నాను.
    ఇక నా ఉద్దేశాం ఇవి ప్రాక్టికల్ అవునా కాదా అని కాదు.
    నేను భంగపడిన విషయంలో కూడా నేను ఇతరుల మీద ఆధారపడి నా సూత్రాన్ని వదులుకోవడం చెయ్యడంలేదు.
    అది నేను అన్వయించుకునే తీరును మార్చుకుంటున్నాను.
    నేను reading between the lines చెయ్యట్లేదని అవతలి వాళ్ళకు తెలియదు కదా అని తెలుసుకున్నాను.
    నేను ఇంకొంచెం శ్రద్ధగా వినడం నేర్చుకుంటున్నాను.
    నా సూత్రం నేను మార్చుకోవడం గురించి కాదు నేను చెప్పేది.
    ఉదాహరణకు రసాయన శాస్త్రం లో 2A + B = A2B అని ఉందనుకోండి. ఆ సూత్రం పని చెయ్యడానికి అనువైన ఒత్తిడి, ఉష్ణోగ్రత, ఒక్కో సారి క్యాటలిస్టు అవసరం అవుతాయి కదా. అదీ నేను చెప్పదల్చుకున్నది.
    నేను చెప్పేది, there is a process involved. We have to go through it even when we have strong principles అని. వాతావరణం మీద మన నియంత్రణ ఉండదు కనుక మనం మనల్ని నియంత్రించుకోవడం, మన సూత్రాలు ఫలించకపోతే వాటిని మనం ఎలా అన్వయించుకుంటున్నామో పరీక్షించుకుంటూ, సాగుతూ ఉండాలి.
    ఒక సూత్రం ఒక సారి మనకు వొజయాన్నో ఆనదాన్నో ఇచ్చింతర్వాతా మన గమ్యం చేరినట్టు ఐపోదు. మళ్ళీ మళ్ళీ ఆ సూత్రం అమలు చెయ్యాల్సి వస్తుమంది. ప్రతి సారీ పరిస్థితులు ఒకేలా ఉండవు. విజయమో ఆనందమో అలవాటయ్యాక ఒక్కో సారి భంగ పడితే, ఎందుకంటే మనకు అంతా తెలియదు కాబట్టి, అప్పుడు మన నమ్మకానికి పరీక్ష.
    అంతెందుకు, మా ఇంట్లో కొన్ని సూత్రాలు ఉండేవి – ఫలానా మంచి చెయ్యి నిన్ను లోకం అర్థం చేసుకోదు, లేదా నీకీ ఫలితం ఎదురవ్వచ్చు. అయినా నువ్వు ఆ మంచిని చెయ్యి, అని.
    చాలా వివరాలు ఉన్నాయి నా ఆలోచనలలో. అవన్నీ పంచుకోవడం సాధ్యం కాదు కానీ, కొంచెమైనా నా భిప్రాయం గురించిన misunderstanding తొలిగించగలిగితే సంతోషం, నేను చర్చిస్తున్నందుకు ప్రయోజనం.

  16. అందరికీ చెప్పడం మరిచా.
    మీరు ఈ పేజీ కుడిపక్కన పైన చూస్తే, “మంచి మాట” అన్న నల్ల బల్ల ఉంది. దానిలో ఎప్పుడో ఇలా వ్రాసుకున్నాను:
    “సంతోషం ఉంటే అన్ని ఖజానాలు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని ఖజానాలు ఉన్నా వ్యర్థం”
    మరి మీ దగ్గర అన్ని ఖజానాలు, నిధులు ఉన్నాయా? :)
    ********************
    ఇలాంటి మాటలు మరి కొన్ని నా “మంచి మాటలు” అన్న పేజీలో చూడవచ్చును

  17. అందరికీ,
    నవీన్ చెప్పిన సూత్రాలు ఆశకు ఊపిరి పోస్తున్నాయి.
    ఇవి ప్రయత్నించి చూసి ఎవరి పాఠాలు వారు నేర్చుకుని ఎదగ గలరు.
    నేను చెప్పదల్చుకున్నది అదే.

    మొదట్లో ఎక్కువ చెప్పద్దనుకుని మళ్ళీ ఎక్కువ చెప్పి సారం తీసేశాననిపించింది.
    సత్యసాయి గారు, కొంప తీసి ఇది కాదు కదా నా సహజ బాణీ!:-)

    ఆనందమే జీవిత మకరందం. మకరందం పువ్వులోకి రావాలన్నా, తేనెపట్టులో చేరాలన్నా, అక్కడ్నించీ మన వంటింటి గూట్లోకి చేరాలన్నా అది ఒక process. మన వంటింటి గూట్లోనే ఉన్నా, రోజూ మనం తీసి కాస్త నోట్లో వేసుకోవడం మరిచిపోకూడదు. మరీ ఎక్కువ తిన్నా మంచిది కాదు:-)

Leave a reply to gsnaveen స్పందనను రద్దుచేయి